మళ్లీ పెరిగిన బంగారం ధరలు
రూ.29వేల దిగువకు దిగజారిన బంగారం ధరలు మళ్లీ పైకి ఎగిశాయి.
ముంబై : రూ.29వేల దిగువకు దిగజారిన బంగారం ధరలు మళ్లీ పైకి ఎగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సంకేతాలు స్తబ్ధుగా ఉండటం పాటు స్థానిక ఆభరణ వర్తకుల నుంచి కొనుగోళ్లు పెరగడంతో బంగారం ధరలు శనివారం బులియన్ మార్కెట్‌లో 190 రూపాయలు పెరిగాయి. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.29వేలకు పైన రూ.29,050 వద్ద నిలిచింది. సిల్వర్ కూడా 38వేల రూపాయల మార్కును మళ్లీ తన సొంతం చేసుకుంది. కాయిన్ తయారీదారులు, పారిశ్రామిక యూనిట్ల నుంచి కొనుగోళ్లు పెరగడంతో సిల్వర్ ధరలు కూడా పెరిగాయి.
దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛమైన బంగారం ధరలు పది గ్రాములకు రూ.190 రూపాయలు పెరిగి, 29,050 రూపాయలు, 28,900 రూపాయలుగా నమోదయ్యాయి. కాగ, నిన్నటి ట్రేడ్లో బంగారం ధరలు 190 రూపాయలు పడిపోయిన సంగతి తెలిసిందే. ఎంసీఎక్స్ మార్కెట్‌లో కూడా శనివారం బంగారం ధరలు 154 రూపాయలు పెరిగి, రూ.28వేలకు చేరువలో నమోదైంది. బంగారం ధరలతో పాటు సిల్వర్ కూడా పైకి ఎగిసింది. కేజీకి 600 రూపాయలు పెరిగి, రూ.38,000 మార్కును చేరుకుంది.