
పెరిగిన బంగారం ధరలు
బంగారం ధరలు మరోసారి పెరిగాయి. దేశీయ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 29,840 రూపాయిలకు చేరుకుంది.
హైదరాబాద్: బంగారం ధరలు మరోసారి పెరిగాయి. దేశీయ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 29,840 రూపాయిలకు చేరుకుంది. మళ్లీ రూ.30వేల స్థాయికి చేరుకుంది. గతనెల (మార్చి) 3న 29,480 రూపాయిలకు పడిపోయిన స్వచ్ఛమైన బిస్కెట్ గోల్డ్ ధర అమెరికా ఫెడ్ తీసుకున్న తాజా నిర్ణయం కారణంగా ఒక్కసారిగా లాంగ్ జంప్ చేసింది. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 28,200 రూపాయిలుగా ఉంది. ఫెడ్ విడుదల చేసిన గత సమావేశ మినిట్స్‌ను ప్రకారం బ్యాలెన్స్ షీటులో భారీ కోత పడనుంది. ఇందుకు అనుగుణంగా కీలక వడ్డీ రేట్లలో పెంపునకు ఆస్కారం ఉందనే అంచనాలు బులియన్ మార్కెట్‌లో బంగారానికి డిమాండ్ పెంచాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ సమావేశం కానున్న నేపథ్యంలో వీరి నుంచి ఎటువంటి ప్రకటనలు వెలువడతాయోనన్న ఆందోళనలో ఇన్వెస్టర్లు బంగారం కొనుగోలుకు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఒక్కసారిగి పెరిగిన డిమాండ్ కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ (31.1గ్రాము) బంగారం ధర అర శాతం పెరిగి 1,255 డాలర్లకు చేరుకుంది. ఇందుకు అనుగుణంగా దేశీయంగా కూడా ధరలు పెరిగాయి. వెండి ధర రూ.112 పెరిగి 42,370 రూపాయిలకు చేరుకుంది.