చక్రవడ్డీ ప్రయోజనాలు ఫండ్స్‌లో లభిస్తాయా?

expert advices in Equity fund - Sakshi

నేను గత కొన్నేళ్లుగా ఒక ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌లో సిప్‌ విధానంలో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. కానీ ఈ ఫండ్‌ పనితీరు అంచనాలకు అనుగుణంగా లేదు. ఈ ఫండ్‌ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను పూర్తిగా వెనక్కి తీసుకొని వేరే ఫండ్‌లోకి మారుద్దామనుకుంటున్నాను.  ఇలా ఒకేసారి ఒక ఫండ్‌ నుంచి మరో ఫండ్‌లోకి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మార్చుకోవచ్చా ? పన్ను బాధ్యత ఏమైనా ఉంటుందా ? –విజయ్, విశాఖపట్టణం  
ఒక ఈక్విటీ ఫండ్‌లో మీరు ఇప్పటిదాకా ఇన్వెస్ట్‌ చేసిన ఇన్వెస్ట్‌మెంట్స్‌ అన్నింటినీ ఒకేసారి వెనక్కి తీసుకొని వేరే ఫండ్‌లోకి ఇన్వెస్ట్‌ చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడానికి సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానమే సరైనది. సాధారణంగా ఈక్విటీ ఫండ్స్‌ దీర్ఘకాలంలో మంచి రాబడులే ఇస్తాయి. కేవలం 3,4 సంవత్సరాల పనితీరును ఆధారంగా చేసుకొని వేరే ఫండ్‌లోకి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మార్చాలనుకోవడం సరికాదు.

కాదు, కూడదు ఫండ్‌ను మార్చాలనేది మీ నిర్ణయమైతే, మీరు.. కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఎగ్జిట్‌ లోడ్‌ వర్తిస్తుందేమో అన్న విషయాన్ని చెక్‌ చేసుకోవాలి. మీ సిప్‌లకు ఎగ్జిట్‌ లోడ్‌ వర్తించే కాలం ముగిసిన తర్వాతే వేరే ఫండ్‌లోకి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బదిలీ చేసుకుంటే ఎగ్జిట్‌ లోడ్‌ వ్యయాలు తగ్గుతాయి.  ఇక ఒక ఫండ్‌ నుంచి వేరే ఫండ్‌లోకి మారడమంటే ఒక ఫండ్‌ నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకొని, వేరే కొత్త ఫండ్‌లో ఇన్వెస్ట్‌చేయడంగా పరిగణిస్తారు. అందుకని మీ పాత ఫండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను వర్తిస్తుందేమో ఒక సారి చెక్‌ చేయండి.  అలా వర్తించే పక్షంలో స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను భారం పడని కాలం వరకూ వేచి చూసి, ఆ తర్వాత వేరే ఫండ్‌లోకి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మార్చుకోండి.  

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో చక్రవడ్డీ ప్రయోజనాలు లభిస్తాయి. అలాంటి ప్రయోజనం మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే లభిస్తుందా ? –మేరీ, సికింద్రాబాద్‌  
చక్రవడ్డీ ప్రయోజనాలు మ్యూచువల్‌ ఫండ్స్‌లో లభిస్తాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌కు సంబంధించి గ్రోత్‌ ప్లాన్‌లు ఈ తరహావే అని చెప్పవచ్చు. అయితే వీటిని ఫిక్స్‌డ్‌ డిపాజిట్లుగా పరిగణించడానికి లేదు.

ఎందుకంటే, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో ఎంత కాలం ఇన్వెస్ట్‌ చేస్తే, ఎంత మొత్తం రాబడి వస్తుందో ముందే తెలుస్తుంది. మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే  ఇంత మొత్తాల్లో రాబడులు వస్తాయని గ్యారంటీగా చెప్పలేము. అయితే అంతకు మించిన లాభాలు వచ్చాయని చరిత్ర చెబుతోంది. గత 20 ఏళ్లలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 17–18 శాతం చొప్పున వృద్ధి సాధించింది. ఇది డిపాజిట్‌ రేట్‌కన్నా దాదాపు రెట్టింపు. కొన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌ ఏడాదికి 20–22 శాతం చక్రగతి రాబడులను కూడా ఇచ్చాయి.  

నేను దీర్ఘకాలం పాటు మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను.  కొన్ని బ్యాలన్స్‌డ్‌ ఫండ్స్‌ను షార్ట్‌లిస్ట్‌ చేశాను. ఇటీవలే కంపెనీ నుంచి రూ. లక్ష వరకూ బోనస్‌ వచ్చింది. ఈ మొత్తాన్ని  ఒకేసారి  ఇన్వెస్ట్‌ చేయమంటారా ? ఈ మొత్తాన్ని బ్యాంక్‌లో డిపాజిట్‌ చేసి నెలకు కొంత మొత్తం చొప్పున   సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేయమంటారా ? –సందీప్, విజయవాడ  
ఈక్విటీ గానీ, బ్యాలన్స్‌డ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో కానీ ఇన్వెస్ట్‌ చేయాలనుకున్నప్పుడు సిప్‌ విధానమే శ్రేయస్కరం. మీ దగ్గర ఇన్వెస్ట్‌ చేయడానికి పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్నప్పుడు. ముందుగా మీరు షార్ట్‌ టర్మ్‌ డెట్‌ ఫండ్‌లో ఆ మొత్తాన్ని ఇన్వెస్ట్‌ చేయండి. ఆ తర్వాత ఒక మంచి బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌ను ఎంచుకోండి. ఈ షార్ట్‌ టర్మ్‌ డెట్‌ ఫండ్‌ నుంచి సిస్టమేటిక్‌ ట్రాన్స్‌ఫర్‌ ప్లాన్‌(ఎస్‌టీపీ) ద్వారా మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌కు మార్చుకోండి.

ఇలా చేస్తే, మీరు బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయడానికి ముందు మీరు బ్యాంక్‌లో ఉంచేదానికన్నా అధికంగానే షార్ట్‌ టర్మ్‌డెట్‌ ఫండ్‌ ద్వారా రాబడులు పొందవచ్చు. బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయడాన్ని కనీసం ఏడాది, ఏడాదిన్నర కొనసాగించండి. ఈ కాలంలో మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై మీకు తగిన అవగాహన వస్తుంది. మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై తగిన అవగాహన వచ్చిన తర్వాత ఒకటి లేదా రెండు ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ను ఎంచుకొని సిప్‌ విధానంలో ఆ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ కొనసాగించండి. రిటైర్మెంట్‌ నిధి ఏర్పాటు, సొంత ఇంటిని సమకూర్చుకోవడం, పిల్లల ఉన్నత చదువులు తదితర దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల సాధన కోసం ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ మంచి సాధనాలు.  

నేను గతంలో బ్యాంక్‌లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసిన మొత్తం మరో రెండు, మూడు నెలల్లో మెచ్యూర్‌ అవుతుంది. ఈ మొత్తాన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. కనీసం ఎనిమిదేళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. ఈ విషయమై తగిన సలహా ఇవ్వండి ? –రియాజ్, హైదరాబాద్‌  
ఎనిమిదేళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేయడమంటే దీర్ఘకాలం కిందే లెక్క. ఇంత ఎక్కువ కాలం ఇన్వెస్ట్‌మెంట్స్‌పై  మంచి రాబడులు పొందాలంటే ఉన్న కొన్ని రాబడి సాధనాల్లో ఈక్విటీ మ్యూచువల్‌ çఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ఒక మార్గం. మీరు మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు కొత్త కాబట్టి, ముందుగా 2 లేదా 3 బ్యాలన్స్‌డ్‌ ఫండ్స్‌ ఎంచుకోండి. మీరు పన్ను బ్రాకెట్లో ఉంటే, ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌(ఈఎల్‌ఎస్‌ఎస్‌)ల్లో ఇన్వెస్ట్‌ చేయండి. ఫలితంగా సెక్షన్‌ 80సీ కింద మీకు రూ. లక్షన్నర వరకూ పన్ను
మినహాయింపులు లభిస్తాయి.    

– ధీరేంద్ర కుమార్‌ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top