అంచనాలు మించిన డాక్టర్‌ రెడ్డీస్‌ | Dr Reddys profit grows eight-fold on higher sales in India, US & emerging markets | Sakshi
Sakshi News home page

అంచనాలు మించిన డాక్టర్‌ రెడ్డీస్‌

Jul 27 2018 12:21 AM | Updated on Sep 27 2018 4:42 PM

Dr Reddys profit grows eight-fold on higher sales in India, US & emerging markets - Sakshi

హైదరాబాద్‌లో గురువారం ఆర్థిక ఫలితాలు వెల్లడిస్తున్న డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబరేటరీస్‌ సహ చైర్మన్‌ జీవీ ప్రసాద్‌. పక్కన సీఎఫ్‌వో సౌమేన్‌ చక్రవర్తి.

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: సుబాక్సోన్‌ ఔషధం, భారత్‌తో పాటు వర్ధమాన దేశాల మార్కెట్లలో అమ్మకాల ఊతంతో ఔషధ రంగ దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబరేటరీస్‌ (డీఆర్‌ఎల్‌) అంచనాలను మించిన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.456 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో నమోదైన రూ.59 కోట్లతో పోలిస్తే ఇది సుమారు ఎనిమిది రెట్లు అధికం. అప్పట్లో జీఎస్‌టీ తదితర అంశాల ప్రభావంతో లాభాలు స్వల్ప స్థాయికి పరిమితమయ్యాయి. ఈ క్యూ1లో లాభాలు దాదాపు రూ.290 కోట్ల మేర ఉండొచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేసినప్పటికీ.. అంతకు మించిన ఫలితాలను కంపెనీ ప్రకటించింది. ఆదాయం 12 శాతం వృద్ధితో రూ.3,315 కోట్ల నుంచి రూ. 3,721 కోట్లకు పెరిగింది. కొత్తగా ప్రవేశపెట్టిన సుబాక్సోన్‌ ఔషధం అమ్మకాలు, విదేశీ మారకం పరమైన ప్రయోజనాలు ఇందుకు తోడ్పడ్డాయని గురువారమిక్కడ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా డీఆర్‌ఎల్‌ సీఎఫ్‌వో సౌమేన్‌ చక్రవర్తి విలేకరులకు తెలిపారు. పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై క్యూ1లో వ్యయాలు కొంత తగ్గినా.. పూర్తి ఆర్థిక సంవత్సరానికి జరిపిన కేటాయింపుల్లో ఉండబోవన్నారు. అటు పెట్టుబడి వ్యయాలు రూ.1,000 కోట్ల మేర ఉండొచ్చని ముందుగా అంచనా వేసినప్పటికీ.. కార్యకలాపాల పునర్‌వ్యవస్థీకరణ నేపథ్యంలో ఇవి అంతకన్నా కొంత తక్కువగా రూ. 800 కోట్ల పైబడి ఉండవచ్చని చక్రవర్తి చెప్పారు.  

ఆశావహంగా వృద్ధి అవకాశాలు.. 
రాబోయే త్రైమాసికాల్లోను వృద్ధి అవకాశాలు ఆశావహంగానే ఉన్నాయని, అయితే కొంత ఆచితూచి వ్యవహరించనున్నామని డీఆర్‌ఎల్‌ సహ–చైర్మన్‌ జీవీ ప్రసాద్‌ తెలిపారు. క్యూ1లో ఆదాయానికి ఊతమిచ్చిన సుబాక్సోన్‌ విక్రయాల నిలిపివేతతో మిగతా త్రైమాసికాలపై కొంత ప్రభావం కనిపించే అవకాశం ఉందని పేర్కొన్నారు. సుబాక్సోన్‌ పేటెంట్‌ విషయంలో బ్రిటన్‌ ఔషధ సంస్థ ఇండీవియర్‌తో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే.  ఉత్తర అమెరికా మార్కెట్లో ధరలపరమైన ఒత్తిళ్లు కొనసాగుతున్నప్పటికీ.. వ్యయాలను నియంత్రించుకోవడం, అధిక వృద్ధి సాధనపై ప్రధానంగా దృష్టి సారించనునట్లు ప్రసాద్‌ చెప్పారు. సుబాక్సోన్‌ ఔషధ పేటెంట్‌ వివాద పరిష్కారం, కొత్త ఔషధాలను ప్రవేశపెట్టడం, పోర్ట్‌ఫోలియోను విస్తృతం చేయడం, పరిశోధన.. తయారీ కార్యకలాపాలు, వ్యయాల నియంత్రణపైనా కసరత్తు చేయనున్నట్లు పేర్కొన్నారు. దువ్వాడ ప్లాంటు విషయంలో అమెరికా ఎఫ్‌డీఏను మరోసారి తనిఖీలకు ఆహ్వానించినట్లు, సానుకూల ఫలితాలు రావొచ్చని ఆశిస్తున్నట్లు ప్రసాద్‌ చెప్పారు. రష్యా మార్కెట్లో క్రమంగా రికవరీ కనిపిస్తోందని, మిగతా మార్కెట్లలో కూడా రెండంకెల వృద్ధి సాధించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.  

సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ స్థాయిలో కోతలు.. 
సీనియర్‌ మేనేజ్‌మెంట్‌లో మార్పుల, చేర్పుల నేపథ్యంలో సుమారు 150–200 ఉద్యోగాల్లో కోత విధిస్తున్నట్లు ప్రసాద్‌ తెలిపారు. గత క్వార్టర్‌లో మొదలైన ఈ కార్యక్రమం ఈ త్రైమాసికంలో పూర్తి కానుందన్నారు. పనితీరు తదితర అంశాలు ప్రాతిపదికగా దీన్ని చేపట్టినట్లు ప్రసాద్‌ చెప్పారు.   

విభాగాలవారీగా..: గ్లోబల్‌ జనరిక్స్‌ విభాగం ఆదాయాలు సుమారు 12% వృద్ధితో రూ.3,064 కోట్లకు, ఫార్మా సర్వీసెస్‌ అండ్‌ యాక్టివ్‌ ఇంగ్రీడియంట్స్‌ విభాగం ఆదాయాలు 10% వృద్ధితో రూ. 541 కోట్లకు పెరిగాయి. జనరిక్స్‌కి సంబంధించి ఉత్తర అమెరికాలో 6%, భారత మార్కెట్లో 30%, వర్ధమాన మార్కెట్లలో 16% వృద్ధి నమోదైంది. ఉత్తర అమెరికాలో అమ్మకాలు రూ.1,590 కోట్లు, భారత్‌లో రూ.607 కోట్లుగా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement