ఆమెను విడుదల చేయండి : చైనా వార్నింగ్‌! | Sakshi
Sakshi News home page

‘వావే’ సీఎఫ్‌ఓ మెంగ్‌కు కెనడా కోర్టు షాక్‌!

Published Thu, May 28 2020 2:40 PM

Canada Judge Ruled Huawei CFO Meng Extradition Case Can Proceed - Sakshi

ఒట్టావా: చైనీస్‌ టెలికాం దిగ్గజం వావే టెక్నాలజీస్‌ వ్యవస్థాపకుడు రెన్ జెంగ్‌ఫే కుమార్తె, సంస్థ సీఎఫ్‌ఓ మెంగ్‌ వాంఝూకు కెనడా కోర్టులో చుక్కెదురైంది. ఆమెను తమకు అప్పగించాలంటూ అగ్రరాజ్యం అమెరికా వేసిన కేసులో తదుపరి విచారణకు అనుమతినిస్తూ స్థానిక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంపై స్పందించిన ఒట్టావాలోని చైనా రాయబార కార్యాలయం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వావే సహా ఇతర చైనా దిగ్గజ కంపెనీలను దెబ్బతీసేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నంలో, కెనడా అగ్రరాజ్యానికి సహాయం చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మెంగ్‌ను వెంటనే విడుదల చేసి, సురక్షితంగా చైనాకు పంపించాలని హెచ్చరించింది. ఇప్పటికైనా తప్పుదిద్దుకుని, సరైన మార్గంలో నడవాలని హితవు పలికింది. తాజా పరిణామాలతో చైనా- కెనడా దౌత్య సంబంధాలపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. 

2018లో అరెస్టు
ఆంక్షలు ఎదుర్కొంటున్న ఇరాన్‌తో వావే అనుమానాస్పద ఒప్పందాలు కుదుర్చుకుని, ఆ దేశానికి సహకరిస్తోందన్న అమెరికా ఆరోపణల నేపథ్యంలో సంస్థ సీఎఫ్‌ఓ మెంగ్‌ను 2018లో వాంకోవర్ ఎయిర్‌పోర్టులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. హాంకాంగ్‌లోని ఓ షెల్‌ కంపెనీని అడ్డుపెట్టుకుని ఇరాన్‌కు పరికరాలను అమ్మేందుకు వావే ప్రయత్నించిందని, తద్వారా అమెరికా నిబంధనలు ఉల్లంఘించిందని అమెరికా ఆరోపించింది. ఈ మేరకు మెంగ్‌ హెచ్‌ఎస్‌బీసీని తప్పుదోవ పట్టించి ఇరాన్‌తో లావాదేవీలు కొనసాగించారని ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో ఆమెను తమకు అప్పగించాల్సిందిగా అమెరికా కెనడాను కోరింది. (హువావేపై ఆరోపణలు - అమెరికా కీలక ముందడుగు)

అప్పగింత ప్రక్రియలో ముందుకు సాగవచ్చు
ఈ నేపథ్యంలో మెంగ్‌ కేసు బుధవారం విచారణకు రాగా, ఆమె నేరంలో భాగస్వామ్యురాలిగా ఉన్నందున, అప్పగింత ప్రక్రియలో ముందుకు సాగవచ్చని అసోసియేట్‌ చీఫ్‌ జస్టిస్‌ హెదర్‌ హోమ్స్‌ వెల్లడించారు. ‘‘మెంగ్‌పై వచ్చిన ఆరోపణలు అతి తీవ్రమైనవి.. అప్పగింత విషయంలో అడ్డుచెప్పే సామర్థ్యాన్ని తగ్గించాయి. మోసం, ఆర్థిక నేరారోపణలు మోపబడిన కారణంగా తదుపరి చర్యలకు ఉపక్రమించే వీలుంది’’ అని తెలిపారు.

అయితే ఈ కేసు కేవలం ఇరాన్‌పై అమెరికా ఆంక్షలకు సంబంధించి మాత్రమేనని, నిజానికి ఇందులో ఫ్రాడ్‌ ఏమీ లేదన్న మెంగ్‌ తరఫు న్యాయవాది వాదనలను జడ్జి ఈ సందర్భంగా తోసిపుచ్చారు. ఇరాన్‌పై కెనడా ఎటువంటి ఆర్థిక పరమైన ఆంక్షలు విధించలేదన్న మాట వాస్తమని, అయితే అదే సమయంలో అమెరికా ఆంక్షలు కెనడా ప్రాథమిక విలువలకు ఏమాత్రం విరుద్ధంగా లేవని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో జూన్‌ 3న మరోసారి కోర్టులో వాదనలు వినిపించేందుకు మెంగ్‌ లీగల్‌ టీం సన్నద్ధమవుతోంది. 

ఇలావుండగా, ఇటీవల వాణిజ్య విభాగ విదేశీ ప్రత్యక్ష ఉత్పత్తుల వినియోగం నిబంధనలు మరింత విస్తృతం చేసిన అగ్రరాజ్యం అమెరికా టెక్నాలజీ లేదా సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి వావే సంస్థ కోసం సెమీకండక్టర్లను తయారు చేసే దేశాలపై సాంకేతికపరంగా ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే. ఇక నుంచి తమ టెక్నాలజీని ఉపయోగించి డిజైన్‌ చేసే వస్తువులను వావేకు అమ్మాలనుకుంటే లైసెన్స్‌ తీసుకోవాలనే నిబంధనను తప్పనిసరి చేసింది. తద్వారా హువావేకు చెక్‌ పెట్టే ప్రయత్నాలు మరింత ముమ్మరం చేసింది. ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో డ్రాగన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా.. వాణిజ్య పరంగానూ యుద్ధానికి తెరతీసిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement