అంత్యక్రియలను అడ్డుకోవడం అమానవీయం

YS Jagan Review Meeting With Officials About Coronavirus - Sakshi

కరోనా మృతుల అంతిమ సంస్కారాలను అడ్డుకోవడం సమంజసం కాదు

ఇకపై ఎవరైనా అడ్డంకులు కల్పిస్తే పోలీసులు సీరియస్‌గా స్పందించాలి

ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

కరోనా ఎవరికైనా సోకవచ్చు. అంత్యక్రియలను అడ్డుకున్న వారికైనా ఇలాంటి పరిస్థితే రావొచ్చు. బాధితులను అంటరాని వాళ్లుగా చూడడం సరికాదు. అలాంటి వారి పట్ల ఆప్యాయత, సానుభూతి చూపించాల్సింది పోయి వివక్ష చూపడం ఏమాత్రం మంచిది కాదు. సొంత వారికి ఇలాంటివి జరిగితే ఎలా స్పందిస్తామో అందరి విషయంలోనూ అలాగే స్పందించాలి.

సాక్షి, అమరావతి : కర్నూలు జిల్లాలో కరోనా  సోకిన వ్యక్తి అంత్యక్రియలను స్థానికులు కొందరు అడ్డుకోవడంపై ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఇది చాలా అమానవీయమని, ఇలాంటి వారిపై తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీపీ గౌతం సవాంగ్‌ని ఆయన ఆదేశించారు. కరోనా ఎవరికైనా సోకవచ్చని.. అంత్యక్రియలను అడ్డుకున్న వారికైనా ఇలాంటి పరిస్థితే రావొచ్చునని.. బాధితులను అంటరాని వాళ్లుగా చూడడం సరికాదని సీఎం అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారి పట్ల ఆప్యాయత, సానుభూతి చూపించాల్సింది పోయి వివక్ష చూపడం ఏమాత్రం మంచికాదన్నారు. సొంతవారికి ఇలాంటివి జరిగితే ఎలా స్పందిస్తామో అందరి విషయంలోనూ అలాగే స్పందించాలని వైఎస్‌ జగన్‌ అన్నారు.

కోవిడ్‌–19 నివారణ చర్యలు, కరోనాపై భయపెట్టేలా దుష్ప్రచారం చేయడం, కేసుల సరళి, టెలిమెడిసిన్‌ విధానం అమలు, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్, ధరలపై ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కర్నూలు జిల్లాలో కరోనా సోకిన వ్యక్తి అంత్యక్రియలను స్థానికులు కొందరు అడ్డుకోవడంపై ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులతో చర్చించారు. అంత్యక్రియలకు అడ్డంకులు కల్పించడం అమానవీయమని కూడా సమావేశం అభిప్రాయపడింది. ఈ సమీక్షలో అధికారులు వెల్లడించిన అంశాలు, వాటిపై సీఎం జగన్‌ ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి..

కరోనా వస్తే అది భయానకమనో.. వచ్చిన వారిని అంటరాని వారిగానో చూడడం సరికాదు. తప్పుడు ప్రచారాలను ప్రోత్సహించినట్లు అవుతుంది. కరోనా వస్తే మందులు తీసుకుంటే పోతుంది. ఎవరైనా అలాంటి పనులు చేస్తే పోలీసులు సీరియస్‌గా స్పందించాలి.
కరోనా మరణాల రేటు విషయానికొస్తే.. రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది డిశ్చార్జి అవుతున్నారు. నయం అయితేనే కదా వీరంతా డిశ్చార్జి అయ్యేది?
రాష్ట్రంలో మరణాల రేటు 2.21 శాతం అంటే.. మిగతా వాళ్లు డిశ్చార్జి అవుతున్నట్లే కదా? వైరస్‌ దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నవారి పైనే ఎక్కువ ప్రభావం చూపుతుంది.తప్పుడు ప్రచారాలు చేసి లేనిదాన్ని సృష్టించే ప్రయత్నం చేయొద్దు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలు.. చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని, కేసులు కూడా పెడతామని వివరించారు.

కర్నూలు జీజీహెచ్‌పై దృష్టిపెట్టాలి
కర్నూలు జీజీహెచ్‌ ఆస్పత్రిలో సౌకర్యాలను పరిశీలించి వెంటనే వాటిని మెరుగుపరచడానికి పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. అలాగే, క్వారంటైన్లలో వసతి, సదుపాయాలు మెరుగుపర్చాలని.. పారిశుద్ధ్యం, మంచి భోజనం అందించేలా చూడాలన్నారు. మరోవైపు.. రాష్ట్రంలో ఇప్పటివరకూ కోవిడ్‌–19 పరీక్షలు మొత్తం 94,558 నిర్వహించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇవికాక 68 వేలకు పైగా ర్యాపిడ్‌ టెస్టులు చేశామని కూడా చెప్పారు. అలాగే.. ప్రతి పది లక్షల జనాభాకు 1,771 పరీక్షలు చేసినట్లు తెలిపారు.

రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల శాతం 1.48గా ఉందని.. అదే దేశవ్యాప్తంగా 4 శాతంగా ఉందన్నారు.మరణాల రేటు కూడా రాష్ట్రంలో 2.21 శాతం అయితే.. దేశవ్యాప్తంగా అది 3.26 శాతంగా ఉందని అధికారులు తెలిపారు.గడచిన మూడు నాలుగు రోజులుగా రాష్ట్రంలో మరణాలు లేవని కూడా తెలిపారు.
రానున్న రెండు మూడ్రోజుల్లో డిశ్చార్జి అయ్యే వారి సంఖ్య బాగా పెరుగుతుందని అధికారులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు వివరించారు.

వెరీ యాక్టివ్‌ క్లస్టర్లు 80
ప్రస్తుతం కేసుల వారీగా రాష్ట్రంలో వెరీ యాక్టివ్‌ క్లస్టర్లు 80 ఉన్నాయని సమావేశంలో అధికారులు వివరించారు. అలాగే, యాక్టివ్‌ క్లస్టర్లు 64, డార్మంట్‌ క్లస్టర్లు 66 ఉన్నాయన్నారు. 28 రోజుల నుంచి కేసుల్లేని క్లస్టర్లు 20 ఉన్నాయన్నారు.
కర్నూలు, విజయవాడ, గుంటూరులోని కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పటిష్ట ఆరోగ్య వ్యూహాన్ని అమలుచేస్తున్నామని.. ఈ జిల్లాల్లో లాక్‌డౌన్‌ను మరింత కట్టుదిట్టంగా అమలుచేస్తున్నామని వారు సీఎంకు తెలిపారు.
హైరిస్క్‌ ఉన్న వారిని ముందుగానే గుర్తించి, వారికి విస్తృతంగా పరీక్షలు చేస్తున్నామని.. వారికి ముందస్తుగా వైద్య సేవలు కూడా అందించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టామని.. తద్వారా మరణాలకు ఆస్కారం ఉండబోదన్నారు. 
ఇక టెలిమెడిసిన్‌ విషయానికొస్తే.. మూడ్రోజుల్లోగా సమగ్ర వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు సీఎం వైఎస్‌ జగన్‌కు చెప్పారు.

మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ యాప్‌తో సమాచారం
ఈ సమావేశంలో వ్యవసాయ అనుబంధ రంగాలపై కూడా సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్షించారు. రైతుల ఇబ్బందులకు సంబంధించి ఎక్కడ నుంచి సమాచారం వచ్చినా దాన్ని సానుకూల దృక్పథంతో పరిష్కరించాలని ఆదేశించారు. వీలైంత త్వరగా మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ యాప్‌ ద్వారా సమాచారాన్ని తెప్పించుకునేందుకు ప్రయత్నాలు చేయాలన్నారు. అలాగే..
1902 నంబర్‌ను గ్రామ సచివాలయాల్లో బాగా ప్రచారం చేయాలి.
కష్టం ఉందని రైతులు ఎక్కడ నుంచి ఫోన్‌చేసి చెప్పినా వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.
కూపన్లు జారీచేసి పంటలు కొనుగోలు చేసే విధానంపై రైతుల్లో మంచి సానుకూలత ఉందని అధికారులు ఈ సమయంలో చెప్పగా.. అన్ని పంటలకూ ఇదే విధానాన్ని వర్తింపుజేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.
అంతేకాక.. రోజుకు 60 వేల టన్నుల ధాన్యాన్ని, 8వేల టన్నుల మొక్కజొన్నని కొనుగోలు చేస్తున్నామన్న అధికారులను వీలైనంత ఎక్కువ సేకరించాలని కూడా చెప్పారు.సమీక్షా సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌ పాల్గొన్నారు. కోవిడ్‌  పరిస్థితులపై వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివరాలు అందించారు.  

ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య : 94,558
ప్రతి పది లక్షల జనాభాకు పరీక్షలు : 1,771
రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల శాతం : 1.48
దేశవ్యాప్తంగా పాజిటివ్‌ల శాతం : 4
ఏపీలో కరోనా మరణాల శాతం : 2.21
దేశవ్యాప్తంగా మరణాల శాతం : 3.26

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top