సింహపురి ఖిల్లా ప్రగతిపురిగా...

YS Jagan Developments In Nellore Over 100 Days  - Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వంద రోజుల పాలనలో కీలకంగా తీసుకున్న నిర్ణయాలతో కావలి నుంచి తడ వరకు 169 కిలో మీటర్ల తీరం ఉన్న సింహపురి ఖిల్లా ప్రగతిపురిగా రూపాంతం చెందనుంది. కొత్త ప్రాజెక్ట్‌ల నిర్మాణాలు, స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు కల్పించాలనే చారిత్రాత్మక నిర్ణయాలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇప్పటికే నిర్మితమైన ప్రాజెక్ట్‌లు, పరిశ్రమల్లోనూ వేలాది మందికి ఉద్యోగావకాశాలు వస్తాయి.  గ్రామీణ సచివాలయాల్లో ఉద్యోగాలు, గ్రామ/వార్డు వలంటీర్ల పోస్టులతో వేలాది మందికి కొలువులు ఖరారయ్యాయి. మొత్తంగా ఉపాధి, ఉద్యోగాలతో కొలువుల జిల్లాగా మారనుంది.  ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ వ్యవస్థల్లో ఉద్యోగులకు ఇచ్చిన వరాలతో జిల్లా ప్రజలు సంతోష సంబరాల్లో మునిగి తేలుతున్నారు. సంక్షేమ పథకాల అమలుతో అన్ని వర్గాల సామాన్య ప్రజలకు సైతం ఆర్థిక భరోసా లభించనుంది. సాగునీటి ప్రాజెక్ట్‌ల అభివృద్ధితో లక్షలాది ఎకరాలకు సాగునీరు సమృద్ధిగా లభించి ధాన్యాగారంగా ప్రసిద్ధి చెందిన నెల్లూరు సీమ సస్యశ్యామలం అవుతోంది. రైతులు రారాజులుగా మారనున్నారు.

ప్రగతి దిశ.. మహర్దశకు మార్గం
కావలి: దశాబ్దాల కలలను సాకారం చేస్తూ.. ప్రగతి దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాలు కావలికి మహర్దశ పట్టనుంది. 100 రోజుల పాలనలో జిల్లా ప్రజల జీవితాలను ప్రభావితం చేయడమే కాకుండా ప్రపంచ చిత్రపటంలో జిల్లాకు సముచిత స్థానం దక్కేందుకు దోహదపడే అత్యంత కీలకమైన రామాయపట్నం పోర్టు కమ్‌ షిప్‌ యార్డ్, దామవరం విమానాశ్రయం, జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణాలకు కదిలిక తీసుకొచ్చారు. పదేళ్లుగా ఈ మూడు ప్రాజెక్ట్‌ల విషయంలో గత పాలకులు దోబుచులాటలాడుతూ ప్రజలను మభ్యపెట్టి పబ్బం గడుపుకొనే కుయుక్తులు మాత్రమే జరిగాయి. కావలి నియోజకవర్గ పరిధిలో ఈ మూడు ప్రాజెక్ట్‌లు ఉన్నప్పటికీ జిల్లా ప్రజలందరి ఆత్మగౌరవానికి సంబంధించిన వ్యవహారం కావడంతో, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వీటిపై స్పష్టమైన వైఖరితో నిర్ణయాలు తీసుకొంటూ అడుగులు వేయడం ప్రారంభించారు.

‘పోర్ట్‌ కమ్‌ షిప్‌ యార్డు’
నెల్లూరు జిల్లాలోని వెనకబడిన కావలి, ఉదయగిరి నియోజక వర్గాలతో పాటు ప్రకాశం జిల్లా అభివృద్ధికి కీలమైన రామాయపట్నంలో ‘పోర్ట్‌ కమ్‌ షిప్‌ యార్డు’ గత ప్రభుత్వాల తొమ్మిదేళ్ల కాలంలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అనే చందంగా మారింది. రామాయపట్నంలో పోర్టు కమ్‌ షిప్‌ యార్డ్‌ను నిర్మిస్తే అన్ని రకాలుగా అభివృద్ధి చెందేది కావలి పట్టణమే కావడం గమనార్హం. భౌగోళికంగా రామాయపట్నం ప్రకాశం జిల్లా పరిధిలో ఉన్నప్పటికీ  కావలి మండల సరిహద్దును ఆనుకొని ఉంది. కావలి, ఉదయగిరి, కందుకూరు, కొండెపి, కనిగిరి నియోజకవర్గాల్లో సాగునీరు లేక పంటలు పండక బీడు భూములుగా వదిలేసినవి పెద్ద ఎత్తున ఉన్నాయి. పోర్ట్‌ కమ్‌ షిప్‌ యార్డ్‌ నిర్మిస్తే బీడు భూముల్లో భారీ పరిశ్రమలు నిర్మించడానికి అవకాశాలు ఉంటాయని, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు.

రామాయట్నంలో భూమి విస్తీర్ణం ఎక్కువగా ఉండటంతో పాటు చాలా వరకు బీడు భూములు వినియోగంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. రామాయపట్నంలో భారీ ఓడరేవు, నౌకా నిర్మాణ కేంద్రంకు అవసరమైన భూములను గుడ్లూరు, ఉలవపాడు మండలాల్లో 5,414 ఎకరాలను రెవెన్యూ శాఖ గుర్తించింది. ఇవన్నీ వినియోగంలోకి వస్తాయి. ఏడాదికి  5.08 కోట్ల టన్నుల సరుకులను ఈ భారీ ఓడరేవు ద్వారా ఎగుమతులు, దిగుమతులు చేయాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా రూకల్పన చేసింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ అంచనాలు నేటి ధరల నేపథ్యంలో రూ.25,000 కోట్లు అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ ప్రాజెక్ట్‌ పూర్తయితే వేలాది ఎకరాల బీడు భూములకు విలువలు పెరిగి, సామాన్యుల ఆర్థిక స్థోమతలు పెరుగుతాయి. ప్రాజెక్ట్‌కు అనుబంధంగా ఏర్పడే పరిశ్రమల వల్ల వేలాది ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా వేలాది మందికి ఉపాధి అవకాశాలు  మెండుగా ఉన్నాయి. లక్షలాది మంది జీవన ప్రమాణాలు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఇంతటి ప్రయోజనకరమైన ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గత జూలై 6వ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసినప్పుడు కోరారు. దీంతో ఆయా ప్రాంతాల ప్రజల ఆకాంక్షలను ముఖ్యమంత్రి ఆవిష్కరించగలిగారు.

విమానాశ్రయం నిర్మాణానికి వేగంగా అడుగులు 
కావలి నియోజకవర్గంలోని దగదర్తి మండలం దామవరం వద్ద అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం నిర్మాణానికి అవసరమైన పనులు వేగంగా జరుగుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకుంది. ఉత్తుత్తి శంకుస్థాపన చేసి చేతులు దులుపుకోవడంతో, విమానాశ్రయ నిర్మాణం శిలాపలాకానికే పరిమితమైంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 100 రోజుల పాలనలో ఈ ప్రాజెక్ట్‌ను పురోగమన దిశ వైపు తీసుకెళ్లారు. గత ప్రభుత్వం నిర్మాణ సంస్థకు ఇచ్చిన కాంట్రాక్ట్‌ను రద్దు చేసి, కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎయిర్‌ పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు నిర్మాణ పనులు అప్పగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం పూర్తయితే వ్యాపార రీత్యా లాభసాటిగా ఉంటుందనే విమానయాన రంగ నిపుణుల సూచనలను వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. ఈ మేరకు రూ.5,600 కోట్లతో భారీ విమానాశ్రయాన్ని నిర్మించాలని తలపోస్తోంది.

జిల్లా కేంద్రమైన నెల్లూరు, ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలుకు సమీపంలో ఉంది. దేశంలో విశిష్టత ఉన్న కోల్‌కత్తా – చెన్నై జాతీయ రహదారి పక్కనే ఎయిర్‌ పోర్టు ఉంది. విశాఖపట్నం–చెన్నై, చెన్నై–బెంగళూరు పరిశ్రమల కారిడార్‌ ప్రాధాన్యాతా కేంద్రంగా ఈ ఎయిర్‌ పోర్టు ఉంది. నిత్యం దేశ, విదేశాల నౌకలు రాకపోకలతో ప్రైవేట్‌ నౌకాశ్రయాలకు వ్యాపార పరంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కృష్ణపట్నం పోర్టుకు సమీపంలో ఉంది. జాతీయ, అంతర్జాతీయ విభిన్న పరిశ్రమలతో ఇంటిగ్రేటెడ్‌ సెజ్‌గా ప్రఖ్యాతగాంచిన కిసాన్‌ సెజ్‌కు చెంతనే ఉండడం, రాబోయే రోజుల్లో రామాయపట్నం తీరంలో ‘పోర్టు కమ్‌ షిప్‌ యార్డ్‌ రూపకల్పన జరగనున్న నేపథ్యంలో ఈ ఎయిర్‌ పోర్టుకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ ప్రాజెక్ట్‌ కోసం మొత్తం 1379.71 ఎకరాల భూసేకరణ చేయనున్నారు. ఇందులో 1,061.095 ఎకరాల భూసేకరణ ప్రక్రియ ముగిసింది. మిగిలిన 318.615 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్‌ పూర్తయితే చుట్టు పక్కల ఉన్న ప్రాంతాల్లో భూములకు ధరలు పెరిగి, యజమానుల జీవన ప్రమాణాలు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి.

ఫిషింగ్‌ హార్బర్‌ 
జువ్వలదిన్నె సముద్రతీరంలో 76.89 ఎకరాల విస్తీర్ణంలో రూ.288.80 కోట్లతో ఫిషింగ్‌ హార్బర్‌ను నిర్మించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పట్టుదలతో ఉంది. 169 కిలో మీటర్లు సముద్ర తీరం ఉన్న జిల్లాలోని 12 మండలాల్లో 118 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. మత్స్యకారులే 1.5 లక్షల మంది ఉన్నారు. వీరిలో లక్ష మంది చేపలు వేటనే జీవనాధారంగా చేసుకొన్నారు. ఈ ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మిస్తే ప్రత్యక్షంగా లక్ష మంది మత్స్యకారులకు, పరోక్షంగా మరో లక్ష మందికి జీవనోపాధి మెరుగు పడటానికి దోహదపడుతోంది. ఫిషింగ్‌ హార్బర్‌ నుంచి మండల కేంద్రం బోగోలుకు 12 కిలో మీటర్లు, జువ్వలదిన్నె గ్రామానికి 1 కిలో మీటరు, కావలి రైల్వేస్టేషన్‌కు 20 కిలోమీటర్లు దూరంలో ఉంది. దీని వల్ల సరుకు రవాణాకు, మత్స్యకారులు, ఇతరులు ప్రయాణానికి, నివాసానికి వసతులు, అందుబాటులో ఉండటం జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌కు ఉన్న సానుకూల అంశం. దీనికి సంబంధించిన పనులు చేసేందుకు ప్రభుత్వం వేగంగా సన్నాహాలు చేస్తోంది.

ఉద్యోగాల సందడి
కొత్త ప్రభుత్వం ఉద్యోగాల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించింది. ఇప్పటికే జిల్లాలోని అన్ని పంచాయతీల్లో (మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థ మినహా) 10,908 గ్రామ వలంటీర్లను నియమించింది. జిల్లాలో గ్రామ సచివాయల పోస్టులను ప్రకటించి భర్తీకి వీలుగా రాతపరీక్షలు నిర్వహిస్తున్నారు. తద్వారా 10,304 మంది ఉద్యోగులను నియమించనున్నారు. మొత్తం కలిపి 21 వేలపై చిలుకు ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చుట్టారు. వచ్చే నెల 2 నుంచి గ్రామ సచివాలయాలు పనిచేయనున్నాయి. మున్సిపాలిటీల్లోని వార్డులు, నగరపాలక సంస్థలోని డివిజన్‌లో మరో నాలుగు వేల మందికి పైగా వలంటీర్లు, సచివాలయాల ఉద్యోగాల కల్పన జరగనుంది.

ఉగాదికి ఇళ్ల స్థలాలకు కసరత్తు
జిల్లాలో వచ్చే ఏడాది ఉగాదికి అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడానికి కసరత్తు సాగుతోంది. ఇప్పటి వరకు అధికారులకు అందిన అర్జీల్లో 93,936 మందిని అర్హులుగా గుర్తించారు. ఈ మేరకు 2,658.39 ఎకరాల భూమిని గుర్తించారు. అర్హుల ఎంపిక, భూమి ఆన్వేషణ ప్రక్రియ  కొనసాగుతున్నాయి.

పింఛన్‌తో రెట్టించిన ఉత్సాహం 
ఎన్నికల ముందు చెప్పిన విధంగా అధికారంలోకి రాగానే పింఛన్‌ దశల వారీగా పెంచుకుంటూ పోతున్నారు. అందులో భాగంగా అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్‌ను  రూ.250 పెంచుతూ మొదటి సంతకం చేశారు. జిల్లాలో ఎన్నికల ముందు వరకు రూ.34 కోట్లుగా ఉన్న పింఛన్‌ మొత్తం ప్రస్తుతం రూ.78.88 కోట్లకు చేరింది. జిల్లాలో 3,14,558 మంది పింఛన్‌దారులు ఉన్నారు. అయితే వీరందరికి గత ప్రభుత్వం నెలకు రూ.వెయ్యి చొప్పున జిల్లాలో ప్రతి నెలా రూ.34 కోట్లు మాత్రమే పింఛన్‌ పంపిణీ చేసింది. వైఎస్‌ జగనమోహన్‌రెడ్డి తాను అధికారంలోకి వస్తే పింఛన్‌ మొత్తాన్ని రూ.2 వేలకు పెంచుతానని హామీ ఇవ్వడంతో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చివరి రెండు నెలలు రూ.2,000 వంతున పంపిణీ చే«శారు. గతంలో ఏటా అందే పింఛన్‌ రూ.12 వేలు ఇప్పుడు అది రెట్టింపు దాటి రూ.27 వేలకు చేరింది.

మత్స్యకారులకు మేలు 
మత్స్యకారులకు వేట విరామభృతి రూ.4 వేల నుంచి రూ.10 వేలకు జగన్‌ సర్కారు పెంచింది. జిల్లాలో 169 కిలో మీటర్ల సముద్ర తీరం ఉంది. 12 మండలాల్లో సముద్రతీరం ఉండటంతో సముద్ర వేటనే ప్రధాన వృత్తిగా చేసుకొని జీవించే మత్స్యకార కుటుంబాలు వేల సంఖ్యలో ఉన్నాయి. జిల్లాలో నమోదు చేసుకున్న మత్స్యకారులు 15,321 మంది  ఉన్నారు. వీరికి ఇక నుంచి వేట విరామ సమయంలో నెలకు రూ.10 వేల భృతి రూపంలో ఇవ్వనున్నారు. గతంలో వీరికి ఏటా 61.28 లక్షలు మొత్తం భృతిగా అందేది. ఇప్పుడు అది రెట్టింపు దాటి రూ. 1.53 కోట్లు ఏటా ఆందనుంది. జిల్లాలో బోట్లు, డీజీల్‌ సబ్సిడీలకు భారీగా నిధులు కేటాయించారు. జిల్లాలో ఉన్న 4,971 బోట్ల ఉన్న మత్స్యకారులకు లబ్ధి చేకూరనుంది. వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారులకు రూ.5 లక్షలకు ఉండే పరిహారాన్ని రూ.10 లక్షలకు రెట్టింపు చేశారు. 

హోంగార్టులకు వేతనాలు రెట్టింపు 
జిల్లాలో 775 మంది హోంగార్డులు ఉన్నారు. వీరిలో 700 మంది పురుషులు, 75 మంది మహిళా హోంగార్డులు ఉన్నారు. వీరికి గత ప్రభుత్వ హయాంలో నెలకు రూ.9,500 జీతం వచ్చేది జగన్‌ సర్కారు దీనిని రూ.18 వేలకు పెంచింది.

పారిశుధ్య కార్మికులకు..
నెలకు రూ.9,500 నుంచి రూ.11 వేల వరకు వేతనంతో పనిచేసే పారిశుధ్య కార్మికులకు నెలకు రూ.18 వేలు ఇస్తామని జగన్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు అధికారిక జీఓ కూడా జారీ చేశారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో 1,236 మంది కార్మికులు ఉన్నారు.  జీతం దాదాపుగా రెట్టింపు కావడంతో సర్వత్రా హర్షం వ్యక్త అవుతుంది. సగటున 9,500 చొప్పున గతంలో రూ.11.72 లక్షలు నెలకు జీతంగా చెల్లించేవారు. ఇప్పుడు అది దాదాపు రెట్టింపు కావడంతో అది రూ. 22.24 లక్షలకు పెరిగింది.

అంగన్‌వాడీలకు వెయ్యి పెంపుదల 
జిల్లాలోని 17 ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ల పరిధిలో 3,774 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 7,560 మంది పని చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో వీరికి నెలకు 10,500 జీతం వచ్చేది. అది కూడా ప్రతి నెలా కాకుండా మూడు, నాలుగు నెలలకు ఒకసారి జీతం అందే పరిస్థితి. జగన్‌ సర్కారు అంగన్‌వాడీల జీతాలను పెంచింది. ప్రతి అంగన్‌వాడీకి నెలకు వెయ్యి పెంచి రూ.11,500 జీతం ఇస్తామని ప్రకటించారు.

అమ్మ ఒడితో 4.60 లక్షల మందికి లబ్ధి
జిల్లాలో వచ్చే ఏడాది జనవరి నుంచి అమ్మఒడి పథకం అమలు కానుంది. దీని ద్వారా జిల్లాలో 4,60,687 లక్షల మంది అమ్మలకు లబ్ధి చేకూరనుంది. జిల్లాలో 4,485 స్కూల్స్‌లో  215 జూనియర్‌ ఇంటర్‌ కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూల్స్‌ల్లోని విద్యార్థుల తల్లులకు ఈ పథకం వర్తించనుంది.

అన్నదాతలకు పెట్టుబడి సాయం
అన్నదాతలకు అక్టోబర్‌ 15 నుంచి ఏటా రూ.12,500 పెట్టుబడి సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో జిల్లాలో లబ్ధిదారుల జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో ఖరీఫ్, రబీలో కలిపి 8 లక్షలకు పైగా ఎకరాల్లో పంటల సాగు జరుగుతోంది. జిల్లాలో 2,13,150 మంది చిన్న, సన్నకారు రైతులు, 1.90 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. నిబంధనలకు అనుగుణంగా వీరందరికి పంట పెట్టుబడి సాయం అందనుంది.

ఆశ వర్కర్లకు మూడు రెట్ల వేతనం పెంపు
రూ.3 వేలు వంతున ఉన్న ఆశ వర్కర్ల వేతనాన్ని సర్కారు మూడు రెట్టు పెంచింది. దీంతో జిల్లాలో 2,227 మంది ఆశ వర్కర్లకు లబ్ధి చేకూరనుంది. గతంలో వీరికి రూ.6.68 లక్షలు నెలకు జీతంగా అందేది. ఇది మూడు రెట్లు పెరగడంతో జీతంతో కలిపి ఇప్పుడు రూ.22.27 లక్షలకు చేరింది. ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా రూ.7 వేలు, జిల్లా మొత్తంగా రూ.15.59 లక్షలు నెలకు పెరిగినట్లయింది.

రూ.18 వేలు జీతం పెంచడం సంతోషం 
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కార్మికుల జీతాలను రూ.10 వేలు నుంచి రూ.18 వేలు పెంచడం సంతోషంగా ఉంది. ఇచ్చిన మాట ప్రకారం కార్మికుల జీతాలు పెంపుపై సంతకం చేశారు. మా కార్మికుల కుటుంబ పోషణకు పెంచిన జీతంతో ఆనందంగా ఉన్నాం.
– సి.దుర్గాప్రసాద్, కార్మికుడు

పేదల పక్షపాతి జగనన్న
ఆశ కార్యకర్తల వేతనాలు పెంచి పేదల పక్షపాతిగా జగనన్న నిలిచారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల పాటు రూపాయి పెంచిన పాపాన పోలేదు. జగనన్న సీఎం అయిన వెంటనే మా సమస్యలను గమనించి రూ.10 వేలకు పెంచి లక్షల కుటుంబాలకు అండగా నిలిచారు. 
–  మర్లపాటి శ్రీలక్ష్మి, ఆశ కార్యకర్త, ఊటుకూరు

నిరుద్యోగానికి చెల్లు
ముత్తుకూరు: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 100 రోజుల పాలనలో విప్లవాత్మకమైన పథకాలు అమల్లో పెట్టారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని చారిత్రక ఉత్తర్వులు జారీ చేశారు. నిరుద్యోగ సమస్యను శాశ్వత పరిష్కారం చూపుతూ ‘ప్రాజెక్ట్‌లు, పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు’ ఇవ్వాలని జీఓ విడుదల చేసి, స్థానిక యువకులు, కార్మికుల ప్రయోజనాలకు పెద్దపీట వేశారు. ఆయా పరిశ్రమలు, ప్రాజెక్ట్‌ల్లో అవసరాలకు సంబంధించి నైపుణ్యత కలిగిన కార్మికులను తయారు చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. త్వరలో ఈ కల సాకారం అవుతోంది. సర్వేపల్లి నియోజకవర్గంలో ముత్తుకూరు, తోటపల్లిగూడూరు, వెంకటాచలంలో మండలాల్లో ప్రాజెక్ట్‌లు, పరిశ్రమల్లో ప్రస్తుతం 8,600 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

ప్రస్తుతం ఆయా పరిశ్రమల్లో స్థానికులకు కనీసం పది శాతం ఉద్యోగాలు కల్పించని పరిస్థితి నెలకొంది. కల్పించిన ఉద్యోగాల్లో సైతం దినసరి కూలీలుగా, స్వీపర్లుగా మాత్రమే అవకాశం కల్పించారు. స్థానికత జీఓ అమల్లోకి వస్తే టెక్నికల్, అడ్మినిస్ట్రేషన్, వర్క్‌ లేబర్‌ తదితర విభాగాల్లో సుమారు 6,450 కొలువుల్లో స్థిరపడడానికి స్థానికంగా చుట్టు పక్కల గ్రామాలు, ప్రాంతాల నిరుద్యోగ యువతకు అవకాశం లభిస్తుంది. ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన హామీని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వెంటనే అమల్లోకి తీసుకురావడంపై ప్రాజెక్ట్‌లు, పరిశ్రమల ప్రభావిత గ్రామాల్లోని నిరుద్యోగులు, యువకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top