సమాజాన్ని పట్టి పీడిస్తున్న లంచగొండితనం, అవినీతి నుంచి విముక్తి లభిస్తేనే ప్రజలు స్వేచ్ఛగా జీవించగలుగుతారని, ఇందుకు అందరూ కంకణబద్ధులు కావాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ కోరారు.
గోదావరిఖని, న్యూస్‌లైన్: సమాజాన్ని పట్టి పీడిస్తున్న లంచగొండితనం, అవినీతి నుంచి విముక్తి లభిస్తేనే ప్రజలు స్వేచ్ఛగా జీవించగలుగుతారని, ఇందుకు అందరూ కంకణబద్ధులు కావాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ కోరారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో ‘దేశంలో అవినీతి సమస్య-లోక్‌పాల్ బిల్లు-యువత పాత్ర’ అంశంపై శనివారం ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. అవినీతి నిర్మూలనకు ప్రభుత్వ సంస్థలు ఎన్ని పనిచేస్తున్నా ఫలితం కనిపించటం లేదన్నారు.
అందుకే ప్రభుత్వం ఇటీవల లోక్‌పాల్ బిల్లును తీసుకువచ్చిందని, దీనిద్వారా మార్పు వస్తుందన్న ఆశాభావం వ్యక్తంచేశారు. పరిమితంగా ఉన్న వనరుల దుర్వినియోగంతో కాలుష్యం ఏర్పడి వ్యాధుల తీవ్రత పెరిగిందని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. అనంతరం విద్యార్థులు, యువకులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. యాంటీ కరప్షన్ సిటిజన్ ఫోరం కన్వీనర్, హైకోర్టు న్యాయవాది వడ్లకొండ రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో జిల్లా 6వ అదనపు జడ్జి వెంకటక్రిష్ణయ్య, మంథని మెజిస్ట్రేట్ కుమారస్వామి పాల్గొన్నారు.