ఆ ఊరిలో ఒక్కడే మిగిలాడు

The whole of Villagers Migrated In Rudravaram Kurnool - Sakshi

కనుమరుగవుతున్న గ్రామం 

వలస వెళ్లిన కుటుంబాలు

శిథిలావస్థకు చేరిన ఇళ్లు 

కళ్లెదుటే ఓ ఊరు మాయమవుతోంది. మొన్నటి వరకు జనంతో కళకళలాడిన గ్రామం నేడు శ్మశానాన్ని తలపిస్తోంది. భవిష్యత్‌లో ఇక్కడో గ్రామం ఉండేదని చెప్పుకోవడానికి ఇళ్లు శిథిలమై.. మొండిగోడలు మిగిలాయి. ఉపాధి కోసం ఒక్కో కుటుంబం గ్రామం విడిచిపోవడంతో ఊరంతా ఖాళీగా మారింది. రెవెన్యూ రికార్డుల్లో ఆ గ్రామం పేరు కనిపిస్తున్నా ఈ ఊరిలో మాత్రం జనం లేరు. ఈ పల్లె గురించి చెప్పడానికి 15 ఏళ్లుగా ఓ వ్యక్తి మాత్రం అక్కడ ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాడు. ఈ గ్రామం తెలుసుకోవాలంటే రుద్రవరం మండలం లాలాయిపేట వెళ్లాల్సిందే.                              

సాక్షి, కర్నూలు : పూర్వం జీవనోపాధి కోసం భూములను సాగు చేసుకుంటూ పొలాల పక్కనే నివాసాలు ఏర్పర్చుకోవడంతో గ్రామాలు ఏర్పడ్డాయి. ఇదే కోవలోనే లాలయ్య అనే ఓ ముస్లిం వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలసి కొన్నేళ్ల క్రితం పొలాల మధ్య ఓ చిన్న గుడిసె వేసుకొని స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. చుట్టుపక్కల ఉన్న పొలంలో కొంత భాగం వ్యవసాయం చేసుకుంటూ పంటలు పండించాడు. ఆయనను చూసి మరికొందరు వలస వచ్చి అక్కడ నివాసాలు ఏర్పరచుకుని వ్యవసాయం చేశారు. అలా 25 కుటుంబాల వరకు పెరగడంతో ఆ ఊరికి లాలాయిపేట అని పేరు పెట్టారు.

ఈ గ్రామాన్ని పక్కనే ఉన్న చిలకలూరు పంచాయతీకి మజరాగా నమోదు చేశారు. అప్పటి నుంచి ఆ గ్రామస్తులకు అవసరమైన వసతులను అధికారులు కల్పించే వారు. ఇందులో భాగంగానే ముందుగా రోడ్డు వేశారు. గ్రామస్తులకు తాగు నీటి సౌకర్యం కింద ముందుగా బోరు వేసి చేతి పంపు అమర్చారు. అనంతరం మినీ వాటర్‌ ట్యాంకు ఏర్పాటు చేశారు. ఓ కాలనీలో సీసీరోడ్డు వేశారు. గ్రామస్తులు వ్వవసాయంలో మంచి పంటలు పండించుకుంటు ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. తమ పిల్లలను మంచిగా చదివించుకున్నారు. పిల్లలు పెద్దవారై మంచిగా చదివి వివిద ఉద్యోగాలు పొందారు. అప్పటి నుంచి గ్రామంలో వలసలు మొదలయ్యాయి. సరైన వసతులు లేని ఆ గ్రామంలో ఎలా ఉండేదంటు వారు తమ తల్లిందడ్రులను పిలుచుకొని ఒక్కొక్కరుగా పట్టణాలకు వలసలుగా వెళ్లి స్థిర పడ్డారు. అలా మొత్తం కుటుంబాలన్నీ ఆళ్లగడ్డ, నంద్యాల, కర్నూలు, కోవెలకుంట్ల, ప్రకాశం జిల్లాలకు వెళ్లి పోయాయి. పొలాలను సమీప గ్రామస్తులకు కౌలుకు ఇచ్చారు. గ్రామస్తులు అందరూ ఇళ్లు ఖాళీ చేసి వెళ్లడంతో ఉన్న మిద్దెలు ఒక్కొటిగా కూలి పోయాయి. ప్రస్తుతం ఆ గ్రామంలో పడి పోయిన మిద్దెలు దర్శన మిస్తున్నాయి.

మౌన సాక్షిగా ఆనవాళ్లు.. 
లాలాయి పేట గ్రామం కనుమరుగవుతున్నా అక్కడ ఆనవాళ్లుగా కొన్ని మిగిలి ఉన్నాయి. ప్రదానంగా వ్యవసాయానికి సంబంధించిన తీపి గుర్తులు మౌనంగా పలకరిస్తున్నాయి. పంట నూర్పిడికి ఉపయోగించే రాతి గుండ్లు, ఎద్దులకు నీళ్లు తాపే గచ్చులు, చెట్టు కింద కట్టుకున్న రచ్చబండ, పూజించే నాగులకట్ట.. ఇలా ఎన్నో ఇప్పటకీ పదిలంగా ఉన్నాయి.

ఊరంటే ఎంతో ఇష్టం 
నా కుటుంబీకులందరూ నంద్యా లలో ఉన్నారు. నేను మాత్రం పుట్టి పెరిగిన ఊరిపై మమకారం వదులుకొని పట్టణానికి వెళ్ల లేకపోతున్నా. నాకున్న 4 ఎకరాల పొలంలో పంటలు వేసుకుంటూ ఒక్కడినే ఇక్కడే ఉంటున్నా. పగలంతా చుట్టు పక్కల గ్రామాల రైతులు వ్యవసాయ పనులకు వచ్చి కాసేపు ఇక్కడ కూర్చోని మాట్లాడి వెళ్తుంటారు. రాత్రి అయితే ఒంటరిగానే ఉంటున్నా. చేతి పంపు ఉండటంతో నీటికి ఇబ్బంది లేదు. అప్పుడప్పుడు నంద్యాలకు వెళ్లి కుటుంబీకులను పలకరించి, వచ్చే టప్పుడు వంటకు అవసరమైన సరుకులు తెచ్చుకుంటున్నాను. ఒకప్పుడు గ్రామంలో సందడిగా ఉండేది. నేడు శ్మశానంలా మారిపోయింది.  
 – తిప్పారెడ్డి, గ్రామస్తుడు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top