కాంగ్రెస్‌తో దిలీప్‌కు సంబంధమేంటి ? : ఈటెల రాజేందర్ | what's the relation Dileepkumar with congress: Etela rajender | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌తో దిలీప్‌కు సంబంధమేంటి ? : ఈటెల రాజేందర్

Aug 17 2013 3:49 AM | Updated on Mar 25 2019 3:09 PM

తమ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన కె.దిలీప్‌కుమార్‌కు కాంగ్రెస్‌తో ఉన్న సంబంధం ఏమిటని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ ప్రశ్నించారు.

సాక్షి, హైదరాబాద్ : తమ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన కె.దిలీప్‌కుమార్‌కు కాంగ్రెస్‌తో ఉన్న సంబంధం ఏమిటని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. తెలంగాణభవన్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ నేతలను కాంగ్రెస్ నేతలతో మాట్లాడించి, కాంగ్రెస్‌లో చేర్పిస్తుంటే ఏమనుకోవాలన్నారు. ఎనిమిది మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ దిలీప్ ఎలా ప్రకటిస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమాంధ్ర సంపన్నుల చేతిలో పావుగా మారి, ఉద్యమానికి ద్రోహం చేస్తున్నారన్నారు. తెలంగాణకుచెందిన మహిళా ఉద్యోగులపై సీమాంధ్రులు దాడి చేయడం  హేయమని ఈటెల విమర్శించారు. మహిళలపై దాడులకు దిగడమే సీమాంధ్ర సంస్కృతా అని ప్రశ్నించారు. ఇలాంటివి మానుకోకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఈటెల హెచ్చరించారు.
 
 టీ-ఉద్యోగులపై దాడి అమానుషం : కేకే
 సీమాంధ్రలోని తెలంగాణ ఉద్యోగులపై దాడులు చేయడం అమానుషమని టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు అన్నారు. 60 ఏళ్ల తెలంగాణ ఉద్యమం లో తాము ఏనాడు సీమాంధ్ర ఉద్యోగులపై దాడులు చేయలేదని స్పష్టం చేశారు. సీమాంధ్రలో తెలంగాణ ఉద్యోగులపై జరిగిన దాడికి నిరసనగా శుక్రవారం మధ్యాహ్నం మింట్ కంపౌండ్‌లో తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ ఇలాంటి పరిస్థితులు పునరావృతమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యోగులపై జరిగిన దాడులను ఖండిస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ పదవులకు రాజీ నామా చేస్తే రెండేళ్ల ముందే తెలంగాణ వచ్చేదన్నారు. ధర్నాలో ఎమ్మెల్సీ స్వామిగౌడ్, తెలంగాణ విద్యుత్ జేఏసీ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
 
 విడిపోయే ముందు విద్వేషాలు వద్దు
 గుంటూరులో తెలంగాణకు చెందిన గ్రూప్-1 అధికారి హనుమంత నాయక్‌పై జరిగిన దౌర్జన్యాన్ని తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర గౌడ్ ఖండించారు. విడిపోయే ముందు విద్వేషాలు పనికి రావన్నారు. ప్రాంతాలను బట్టి అధికారులపై దౌర్జన్యం చేయడం మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు. ప్రాంతాలుగా విడిపోయి అన్నదమ్ముల్లా కలిసుందామని ఆయన హితవుపలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement