ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తి తన సమస్యను విన్నవించడానికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది.. కానీ, తాగునీటి
నిందితుడిని అరెస్ట్ చేయడంలో మీనమేషాలు
అధికార పార్టీకి జీ హుజూర్ అంటున్న ఖాకీలు
సాక్షి, కడప : ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తి తన సమస్యను విన్నవించడానికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది.. కానీ, తాగునీటి సమస్యను లేవనెత్తిన పాపానికి టీచర్‌పై టీడీపీ నేతలు దాడి చేశారు. బాధితుడు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళితే అక్కడ కూడా బెదిరింపులు ఎదురైనట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. స్థానిక పోలీసులతోపాటు ఎస్‌ఐ సమక్షంలోనే అన్యాయం జరుగుతున్నా ఎవరూ నోరు మెదపడం లేదనే చర్చ జరుగుతోంది. పైగా పోలీసుల ఉదంతాన్ని ఒకసారి పరిశీలిస్తే.. ఒంటిమిట్ట మండలానికి చెందిన టీడీపీ నేత నరసయ్య(దాడికి పాల్పడిన నిందితుడు)పై జూన్ మూడవ వారంలో రికార్డుల వ్యవహారమై పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
సాధారణంగా కేసు నమోదైన వ్యక్తులు స్టేషన్ చుట్టుపక్కల కనిపించరు. అయితే ఆయన మాత్రం స్వేచ్ఛగా తిరుగుతున్నా పట్టించుకోకపోగా, రెండు రోజుల కిందట జరిగిన గొడవలో భాగంగా ఏకంగా తనపై కూడా దాడి చేశారని పోలీసుస్టేషన్‌కే వెళ్లి ఫిర్యాదు చేసినట్లు తెలియవచ్చింది. అయితే, పోలీసులు కూడా ఆ నాయకుడిపై కేసు ఉన్న విషయం మరిచిపోయారో.. లేక తెలిసే ఊరుకున్నారో.. లేక అధికార పార్టీ నాయకుడు కదా అని వెనక్కి జంకారో తెలియదు గానీ...ఫిర్యాదు తీసుకుని పంపించి వేశారు.
సమస్యను లేవదీసినందుకు టీచర్ రమణపై దాడి చేసినా పట్టించుకోకపోగా..పైగా స్టేషన్‌కు వచ్చినా నిందితుడిని అరెస్టు చేయకపోవడం పట్ల పోలీసులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ మధ్యకాలంలోనే ఒంటిమిట్ట పోలీసుస్టేషన్‌లో ఎర్రచందనం దుంగలను దొంగలు అపహరించిన సంఘటన పోలీసు శాఖకు మచ్చ తెచ్చి పెట్టింది. ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీ పోలీసులపై చర్యలు తీసుకుని ప్రతిష్టను కాపాడారని భావిస్తున్న తరుణంలో.. ఒంటిమిట్ట పోలీసులు ఇప్పటికీ నిందితుని విషయంలో వ్యవహరిస్తున్న తీరు వివాదాలకు ఆజ్యం పోస్తోంది. అంతేకాకుండా వారం రోజుల కిందట జిల్లా అడిషనల్ ఎస్పీని కూడా మండలానికి చెందిన కొంత మంది తెలుగు తమ్ముళ్లు కలిసి నిందితుడిని అరెస్టు చేయాలని కోరినట్లు తెలిసింది. అందుకు సంబంధించిన వినతిపత్రానికి అడిషనల్ ఎస్పీ ఆమోదముద్ర వేసి ఒంటిమిట్ట పోలీసుస్టేషన్‌కు పంపినా చర్యలు తీసుకోకపోవడాన్ని పోలీసుల్లో చర్చ లేవనెత్తింది.