
సాక్షి, విజయవాడ: విజయవాడ పోలీస్ కమిషనరేట్‌లో అదనపు సీపీగా పని చేస్తున్న బత్తిన శ్రీనివాసులు పూర్తిస్థాయిలో విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్‌గా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సీపీ బాధ్యతల నుంచి ద్వారకా తిరుమలరావు రిలీవ్ అయ్యారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీపీగా పనిచేసిన అనుభవం, నగరం గురించి అవగాహన ఉందని తెలిపారు. మరోసారి సీపీగా అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు చేపడతానని పేర్కొన్నారు. స్పెషల్ బ్రాంచ్‌ని బలోపేతం చేసి నేరాలకు అడ్డుకట్ట వేస్తామని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాదక ద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ఆన్‌లైన్ మోసాలపై సైబర్ సెల్ ప్రత్యేక దృష్టి పెడుతుందన్నారు. కాగా గతంలో బత్తిన శ్రీనివాసులు 2013 మే నుంచి 2014 ఆగస్టు వరకు బెజవాడ సీపీగా పనిచేశారు. (గ్యాంగ్ వార్ కేసులో పురోగతి)
నేరాలను నియంత్రించాం: ద్వారకా తిరుమలరావు
విజయవాడలో 23 నెలలుగా సీపీగా పనిచేశానని మాజీ సీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో సమర్థవంతంగా పనిచేశామన్నారు. కరోనా వైరస్ నియంత్రణకు నగరంలో పటిష్ఠమైన చర్యలు తీసుకున్నామన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారానికి కృషి చేయడంతో పాటు నేరాలను నియంత్రణ చేయగలిగామన్నారు. ప్రజా సంబంధాలను మెరుగుపరుచుకున్నామని వెల్లడించారు. సీపీగా విజయవాడలో పనిచేయడం మంచి అనుభవం, జ్ఞాపకాలను ఇచ్చిందన్నారు. కొత్తగా నియమితులైన శ్రీనివాసులకు ఆయన ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. (బెజవాడ గ్యాంగ్‌వార్ : పండు అరెస్ట్)