నలుగురికి ఉద్వాసన | Use of funds with carefully | Sakshi
Sakshi News home page

నలుగురికి ఉద్వాసన

Dec 31 2014 2:32 AM | Updated on Sep 2 2017 6:59 PM

నెల రోజులు సమయం ఇస్తున్నా... ఆ లోపు జలసంరక్షణ పనుల నిర్వహణ..

కర్నూలు(అగ్రికల్చర్): నెల రోజులు సమయం ఇస్తున్నా... ఆ లోపు జలసంరక్షణ పనుల నిర్వహణలో స్పష్టమైన పురోగతి చూపడంతో పాటు అందుకు తగిన విధంగా నిధులు వినియోగించాలి. లేకపోతే మీకు మంగళం పలకడానికి సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ ఐడబ్ల్యూఎంపీ వాటర్‌షెడ్ ప్రోగ్రామ్ ఆఫీసర్లను హెచ్చరించారు.

ఇటీవల సాక్షిలో ఐడబ్ల్యూఎంపీ నిధుల వ్యయంపై ‘3 నెలలు, రూ.39 కోటు’్ల శీర్షికన ప్రచురించిన  కథనానికి స్పందించిన కలెక్టర్ మంగళవారం అత్యవసరంగా ఐడబ్ల్యూఎంపీ వాటర్‌షెడ్ పీఓలు, ఇంజనీర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వేలాది రూపాయలు జీతం తీసుకుంటూ ఎటువంటి ప్రగతి చూపని ఆళ్లగడ్డ, ఆదోని ప్రోగ్రామ్ ఆఫీసర్లు కిరణ్‌కుమార్, మాలిక్‌బాషా, ఇంజనీర్లు విజయమోహన్, జయరామ్‌లను ఉద్యోగాల నుంచి తొలగించారు.

బుధవారం ఉదయానికల్లా అన్ని రికార్డులు, అకౌంట్స్ తదితరవి అప్పగించాలని, లేకపోతే క్రిమినల్ కేసులు ఉంటాయని హెచ్చరించారు. ప్రాజెక్టు వారీగా వాటర్‌షెడ్‌ల ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. నందికొట్కూరు ప్రాజెక్టులో 21 శాతం, ఓర్వకల్లులో 15 శాతం, నంద్యాలలో 22 శాతం, ఎమ్మిగనూరులో 10 శాతం... ఇలా అతి తక్కువగా ప్రోగ్రెస్ ఉండటం వల్ల కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరికీ నెల రోజుల సమయం ఇస్తున్నా.. ఈ  లోపు 100 శాతం లక్ష్యాలు సాధించాలి. లేకపోతే ఉద్వాసన తప్పదు.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి. వారికి శిక్షణ ఇచ్చి రంగంలోకి దించుతామని ప్రకటించారు. సమావేశంలోనే ఇద్దరు ప్రాజెక్టు ఆఫీసర్లు, ఇద్దరు ఇంజనీర్లకు ఉద్వాసన పలకడం కలకలం రేపింది. నాలుగు బ్యాచ్‌ల ఐడబ్ల్యూఎంపీ వాటర్‌షెడ్‌ల నిర్వహణకు రూ.205 కోట్లు విడుదల అయ్యాయని, వీటిని సద్వినియోగం చేసుకుంటే జిల్లా సస్యశ్యామలం అవుతుందని, కానీ ఇప్పటివరకు కేవలం రూ.41 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ధ్వజమెత్తారు. నెల రోజుల్లో ప్రగతి చూపితేనే ఉద్యోగాల్లో ఉంటారని, లేకపోతే మీ స్థానాల్లో ఇంకొకరు ఉంటారన్నారు.

మొదటి, రెండవ బ్యాచ్ వాటర్‌షెడ్‌ల గడువు ఈ ఏడాది మార్చితో పూర్తి అవుతుందని, నిధులు మాత్రం కోట్లాదిగా ఉన్నాయని, మీ నిర్లక్ష్యం వల్ల ఈ నిధులు ల్యాప్స్ అయ్యే ప్రమాదం ఉందని,దీనిని సహించేది లేదని తెలిపారు.  సమావేశంలో డ్వామా పీడీ పుల్లారెడ్డి, జేడీఏ ఠాగూర్‌నాయక్, పశుసంవర్థక శాఖ జేడీ వేణుగోపాల్‌రెడ్డి, ఐడబ్ల్యూఎంపీ వాటర్‌షెడ్‌ల అదనపు పీడీ రసూల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement