సమైక్య రాష్ట్ర సాధన కోసం సీమాంధ్ర జిల్లాల్లో సమ్మె ఉధృతంగా సాగుతోంది.
సమైక్య రాష్ట్ర సాధన కోసం సీమాంధ్ర జిల్లాల్లో సమ్మె ఉధృతంగా సాగుతోంది. ఆందోళనలు మిన్నంటుతున్నాయి. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో సమైక్యాంధ్రకు మద్దతుగా 2,700 అడుగుల జాతీయజెండాతో వస్త్రవ్యాపారులు ప్రదర్శన నిర్వహించారు. పశుసవంర్థక శాఖ, ఎన్జీవోల ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల ప్రదర్శన చేశారు.
నెల్లూరు బ్రాహ్మణసంఘం, అర్బన్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వచ్చేనెల 2 నుంచి ఆమరణ నిరాహారదీక్ష చేస్తామని వైఎస్‌ఆర్ సీపీ రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు.
మరోవైపు విశాఖలో సమైక్యాంధ్రకు మద్దతుగా చోడవరం వైఎస్ఆర్ సీపీ నేత సత్యారావు ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు 34వ రోజుకు చేరాయి. అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఉరవకొండ జైనబి దర్గాలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గుంటూరు జిల్లా మాచర్లలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీఎన్జీవోలు, నేషనల్ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లా నందిగామలో ఆంధ్రాబ్యాంక్ మూసేయాలంటూ ఏపీఎన్జీవోలు ధర్నా చేశారు. విజయవాడ బందరు రోడ్డులో సమైక్యాంధ్రకు మద్దతుగా ఐటీ కార్యాలయాన్ని ఏపీఎన్జీవోలు మూసివేయించారు. బీఆర్‌టీఎస్ రోడ్డులో సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యార్థి జేఏసీ వీధిబడి కార్యక్రమం నిర్వహించింది. కైకలూరులో సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్ఆర్ సీపీ నేత డీఎన్‌ఆర్ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు 52వ రోజుకు చేరాయి.


