నిరుద్యోగ శంఖారావం

Unemployeed Youth Rally For Notifications Demand - Sakshi

లక్ష పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలకు డిమాండ్‌

ఏయూ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు మార్చ్‌

ప్రభుత్వ వైఖరిపై ప్లకార్డులతో నిరసన

సర్కారు కొలువు కోసం ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న నిరుద్యోగులు ప్రభుత్వ అలసత్వంపై సమరశంఖం పూరించారు. ఏళ్ల తరబడి కుటుంబాలకు దూరంగా, అర్ధాకలితో ఇరుకుగదుల్లోనే అవస్థలు పడుతూ.. కోచింగ్‌ల కోసం వేలకు వేలు వెచ్చించి నానా పాట్లు పడుతుంటే ఇన్ని తక్కువ పోస్టులకే పరిమితం చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష పోస్టులను భర్తీ చేయాల్సిందేనంటూ భీష్మించారు. కడుపు మండిన వారంతా ‘నిరుద్యోగ మార్చ్‌’ లో కదం తొక్కారు.

ద్వారకానగర్‌(విశాఖ దక్షిణ): ప్రభుత్వ ఉద్యోగాల పోస్టులను లక్షకు పెంచి నోటిఫికేషన్‌ విడుదల చేయాలని కోరుతూ ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఏయూలోని వీఎస్‌ కృష్ణా గ్రంథాలయం నుంచి జీవీ ఎంసీ గాంధీ విగ్రహం వరకు నిరుద్యోగ మార్చ్‌ చేపట్టారు. నిరుద్యోగ యువత ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో చొక్కాపు ఆనందరావు, శెల్లి వైకుంఠరావు మాట్లాడుతూ కమలనా«థ్‌ కమిటీ నివేదిక ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల్లో లక్షా నలభై వేల పోస్టులు ఖాళీ ఉండగా.. ప్రభుత్వం 20 వేల పోస్టులు మాత్ర మే భర్తీ చేస్తాననడం సరికాదన్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు నోటిఫికేషన్లు లేక తీవ్ర అసంతృప్తికి గురి అవుతున్నారన్నారు. ఎన్నో సంవత్సరాలుగా కుటుంబాన్ని, గ్రామాన్ని విడిచిపెట్టి ప్రభుత్వ ఉద్యోగమే ధ్యేయంగా చదువుతున్న నిరుద్యోగుల ఆకలిబాధలను ప్రభుత్వం అర్థం చేసుకొని తక్షణమే లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయాలన్నారు.

నిరుద్యోగుల్లో నిరాశ
ఇటీవల ఆర్ధిక శాఖ ఆమోదించిన పోస్టుల్లో ఎంతో కీలకమైన గ్రూప్‌–1 పోస్టులు 182, గ్రూప్‌–2, 337 పోస్టులు మాత్రమే ఉండటంతో అభ్యర్థులు నిరాశ చెందారన్నారు. ఎన్నో సంవత్సరాలుగా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్‌ సెంటర్లకు వెళ్తున్న వారు పోస్టులు చాలా తక్కువగా ఉండడం జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. పోలీస్‌ శాఖలో 30 వేల పోస్టులు ఉండగా ప్రభుత్వం కేవలం ఆరువేల పోస్టులు భర్తీ చేయడం చూస్తే ప్రభుత్వం నిరుద్యోగులపై కక్ష కట్టినట్లు ఉందన్నారు. ఏటా లక్షల్లో విద్యార్థులు డిగ్రీ పట్టా పట్టుకొని రోడ్లపైకి వస్తుంటే ప్రభుత్వం వందల్లో , వేలల్లో పోస్టులు భర్తీ చేస్తే రాష్ట్రంలో నిరుద్యోగ తీవ్రత ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. తెలంగాణాలో సుమారు 19 వేల పోస్టులకు పోలీస్‌శాఖలో నోటిఫికేషన్‌ ఇస్తే మనరాష్ట్రంలో మూడు వేల ఖాళీలకు ఆర్థిక శాఖ ఆమోదించడం నిరుద్యోగులను కించపరచడమేనన్నారు.

రాష్ట్రంలో ఏటా వేల మంది విద్యార్థులు తమ పీజీ పూర్తి చేసుకున్నప్పటకీ సుమారు పదేళ్లుగా జూనియర్‌ లెక్చరర్‌ నోటిఫికేషన్‌ లేకపోవడం చూస్తే ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులను ఈ ప్రభుత్వం ఎలా గౌరవిస్తుందో అర్థం చేసుకోవచ్చునన్నారు. ప్రభుత్వ శాఖలో ఖాళీ ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని లేని పక్షంలో నిరుద్యోగుల ఉద్యమాన్నిఉధృతం చేస్తామని హెచ్చరించారు. చంద్రబాబు డౌన్‌.. డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులతో నిరసన తెలిపారు. ర్యాలీలో  అప్పారావు, శ్రీధర్, ఎ,ఉమామహేష్, తెంకి కూర్మినాయుడు, బి.తరుణ్, సాగర్, పోలినాయుడుతో పాటు విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top