ప్రభుత్వ పథకాలతో కార్మికులకు భరోసా  

Undavalli Sridevi Speech At Guntur District - Sakshi

సాక్షి, గుంటూరు: అసంఘటిత కార్మికులకు, చిన్న వ్యాపారస్తులకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్‌ధన్, ( పి.ఎం.ఎస్‌.వై.ఎం ) ప్రధాన మంత్రి లఘు వ్యాపిర మాన్‌ధన్‌ ( పి.ఎం.ఎన్‌.పి.ఎస్‌.) పథకాలతో భరోసా లభిస్తుందని కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌ కుమార్‌ పేర్కొన్నారు. శనివారం స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో కార్మిక శాఖ నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఈ రెండు పథకాల్లో చేరితే 60 ఏళ్ల తర్వాత రూ.3000 వేల వరకు  పెన్షన్‌ అందుతుందని చెప్పారు. పెన్షన్‌ ప్రీమియం వయస్సును బట్టి మారుతుందన్నారు. కనీసం రూ.55 నుంచి రూ.200 వరకు కట్టాల్సి వస్తుందని చెప్పారు. దీనిపై అవగాహన కల్పించడానికి గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో కార్మిక శాఖ అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆయన ఆదేశించారు.

సభకు అధ్యక్షత వహించిన తూర్పు నియోజకవర్గ శాసన సభ్యుడు మొహమ్మద్‌ ముస్తఫా మాట్లాడుతూ సమాజ అభివృద్ధి కోసం రెక్కలు ముక్కలు చేసుకునే కార్మికులకు ఎంత చేసినా తక్కువేనన్నారు. కార్మిక శాఖ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా కార్మిక శాఖ డెప్యూటీ కమిషనర్‌ యు.మల్లేశ్వర కుమార్‌ మాట్లాడుతూ మరింత సమాచారం కోసం కార్మికులు, చిరు వ్యాపారులు తమ కార్యాలయాన్ని సందర్శించాలని సూచించారు.  అనంతరం కార్మికులకు కలెక్టర్,  తాడికొండ శాసన సభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి, వైఎస్సార్‌ సీపీ    పశ్చిమ నియోజకర్గ ఇన్‌చార్జ్‌ చుక్కా ఏసురత్నం, జిల్లా అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ ఆదినారాయణ చెక్కులు అందజేశారు. 

సర్వే, డేటా ఎంట్రీని వేగవంతం చేయాలి   
వైఎస్సార్‌ నవశకం సర్వే, డేటా ఎంట్రీ నమోదును వేగవంతం చేయాలని కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌ కుమార్‌ ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరం నుంచి ఆయన అధికారులతో   సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సేకరించిన  సమాచారాన్ని డేటా రూపంలో ఏరోజుకారోజు నమోదు చేయాలని తెలిపారు. డిసెంబర్‌ 7నాటికి మొత్తం సర్వే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సర్వేలో కొంతమంది అధికారుల నిర్లక్ష్యం బాగా కనబడుతోందని, వారు పనితీరును మెరుగుపరచుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అర్బన్, రూరల్‌ పరిధిలో సర్వే వివరాలను అదే రోజు సాయంత్రం ఆన్‌లైన్‌ అక్‌నాలెడ్జ్‌మెంట్‌ తప్పనిసరిగా చేసుకోవాలని సూచించారు. డేటా ఎంట్రీ కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో కనీసం ఒక కంప్యూటర్‌ అయినా ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. సర్వే, డేటా ఎంట్రీల్లో అర్బన్‌ పరిధిలో ఎంపీడీవో, తహసీల్దార్, కమిషనర్, రూరల్‌ పరిధిలో ఎంపీడీవో,  తహసీల్దార్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్‌ చెప్పారు.

సచివాలయాల వారీగా మ్యాపింగ్, ఆన్‌లైన్‌ డేటా ఎంట్రీ కోసం ఉద్యోగులకు లాగిన్‌లు అందించాలని ఆదేశించారు. వీటిపై గుంటూరు, తెనాలి, నరసరావుపేట, గురజాల ఆర్డీవో, తెనాలి సబ్‌ కలెక్టర్‌ ప్రతి రోజూ తహసీల్దార్, ఎంపీడీవో,  కమిషనర్లతో సమీక్ష జరిపి వివరాలు తనకు పంపాలని కలెక్టర్‌ ఆదేశించారు. బియ్యం కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డుల డేటా ఎక్కువగా ఉందని, సర్వే చేసిన సంఖ్యకు, డేటా నమోదుకు చాలా వ్యత్యాసముందని పేర్కొన్నారు. దీన్ని తక్షణం తగ్గించాలని ఆయన ఆదేశించారు. సర్వేకు, పెన్షన్ల పంపిణీకి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని తెలిపారు. ఇప్పటికే పెన్షన్లకు సంబంధించిన నగదును బ్యాంకుల్లో జమ చేశామని, డిసెంబర్‌ 1న డ్రా చేసి పంపిణీ చేయాలని చెప్పారు. ప్రభుత్వం నవశకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, నిర్లక్ష్యం చేయొద్దని హెచ్చరించారు. సమావేశంలో జేసీ–2 శ్రీధర్‌ రెడ్డి, జెడ్పీ సీఈవో డి.చైతన్య, జీఎంసీ కమిషనర్‌ సీహెచ్‌.అనూరాధ, డీఎస్‌వో టి.శివరామ్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top