సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయాలంటే టీడీపీ నేతలు జంకుతున్నట్టే కనిపిస్తోంది.
మోత్కుపల్లిపై.. బాబుకు ఉమ ఫిర్యాదు
తెలుగుదేశం విభేదాలు వీధిన పడ్డాయి.. సాక్షాత్తు ఆ పార్టీ అధినేత చంద్రబాబు వద్దే జిల్లా నేతల గొడవ తారస్థాయికి చేరింది.. సీనియర్ ఎమ్మెల్యేలు ఉమామాధవరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు మధ్య ప్రచ్ఛన్న పోరు సాగుతోంది. ఇపుడు తాజాగా రాజ్యసభ ఎన్నికలు వీరి మధ్య మరింత అగాథం
సృష్టించాయి..!!
సాక్షిప్రతినిధి, నల్లగొండ
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయాలంటే టీడీ పీ నేతలు జంకుతున్నట్టే కనిపిస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ విషయంలో పార్టీ అనుసరించిన విధానంతో ప్రజల్లోకి ధైర్యంగా వెళ్లలేని పరిస్థితిని ఎదుర్కొంటున్న టీడీపీ నేతలు ఎన్నికల్లో సొంత పార్టీ వారి నుంచే ఎదురుకానున్న అసమ్మతి రాజకీయాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదు. దీంతో ఈసారి ఎమ్మెల్యేగా ఎన్నికల్లో పోటీ చేయడానికి సుముఖంగా లేరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిని బలపరుస్తూ మోత్కుపల్లి, ఉమామాధవరెడ్డి ఇద్దరూ తమకు రాజ్యసభకు అవకాశం ఇవ్వాలని పోటీలు పడి అధినేతను కోరారు. ఇక, ఉమామాధవరెడ్డి రాజ్యసభ సీటును ఆశించడం వెనుక బలమైన కారణమే ఉందని చెబుతున్నారు. భువనగిరి నియోజకవర్గంలో టీడీపీకి ఓటమి అనేది లేకుండా మాధవరెడ్డి.. ఆయన దుర్మరణం తర్వాత అతని సతీమణి ఉమామాధవరెడ్డి గెలుచుకుంటూ వస్తున్నారు. అయితే, ఇటీవల భువనగిరి నియోజకవర్గంలో కొందరు నేతలను ఎగదోసి, అసమ్మతి రాజేసి మోత్కుపల్లి న ర్సింహులు చికాకులు సృష్టిస్తున్నారన్న బలమైన అభిప్రాయానికి ఉమామాధవరెడ్డి వచ్చారని చెబుతున్నారు.
ఈ విషయంలో ఇప్పటికే పలువురు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారని పార్టీవర్గాల సమాచారం. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో తన వర్గాన్ని పెంచుకునేందుకు, తన అనుచరులకు పదవులు ఇప్పించుకునేందుకు మోత్కుపల్లి ఓ ప్రణాళిక ప్రకారం పావులు కదుపుతూ వస్తున్నారని అంటున్నారు. తానొక్కడినే కీలకనేతగా మిగాలన్న వ్యూహంతోనూ అందరికీ పొగపెడుతున్నారన్న ఆరోపణలూ లేకపోలే దు. ఈ రకంగానే సూర్యాపేట ఇన్‌చార్జ్ పదవిని ఆశించిన మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావును పార్టీ వీడేలా చేశారని ప్రచారంలో ఉంది. ఇపుడిదే ఎత్తుగడతో కోదాడ, నాగార్జునసాగర్, భువనగిరి నియోజకవర్గాల్లో గుంపుల కుంపట్లు రాజేస్తున్నారని టీడీపీలోని ఓ వర్గం ఆరోపిస్తోంది. ఈ చికాకులు భరించలేకకే ఉమ మోత్కుపల్లి తీరుపై బాబు కు ఫిర్యాదు చేశారని సమాచారం.
ఆలేరు నుంచి తుంగతుర్తి నియోజకవర్గానికి వలస వెళ్లి సంకినేని మద్దతుతో గెలిచిన మోత్కుపల్లికి ఈసారి ఆ నియోజకవర్గంలో పరిస్థితి ఆశాజనకంగా కనిపించకనే తనసొంత నియోజకవర్గం ఆలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటించారన్న వాదనా ఉంది. అయితే, ప్రత్యక్ష రాజకీయాల్లో ఎన్నికల్లో పోటీలు పడి, ఖర్చు లు పెట్టుకునే బదులు రాజ్యసభకు వెళితే ఏ బాదరాబందీ ఉండదన్న ఆలోచనతోనే ఆయ న బాబు వద్ద దరఖాస్తు పెట్టుకున్నట్లు చెబుతున్నారు. అయితే, పార్టీకి ముందు నుంచీ విశ్వాసంగా ఉండి, భువనగిరి నియోజకవర్గాన్ని టీడీపీకి ఓటమి ఎరుగని కోటగా మలి చిన తమ కుటుంబానికి గుర్తింపునివ్వాలని, తనకే రాజ్యసభ సీటు ఖరారు చేయాలని ఉమసోమవారం చంద్రబాబును కోరినట్లు చెబుతున్నారు. ఇదే సందర్భంలో వివిధ నియోజకవర్గాల విషయంలో వేలుపెట్టి మోత్కుపల్లి పార్టీని ఎలా ఇబ్బందులు పాలు చేస్తోంది, తన నియోజవర్గంలో చికాకులు సృష్టించిందీ అధినేతకు వివరించినట్లు సమాచారం. మొత్తానికి ఇద్దరు ఎమ్మెల్యేలూ రాజ్యసభ సీటు ఆశిస్తుండడం, ఫిర్యాదుల పరంపరకు తెరపడక పోవడంతో, సార్వత్రి క ఎన్నికల ముందు ఇదేం గొడవరా బాబూ అని కార్యకర్తలు మదనపడుతున్నారు.