అమ్మ కోసం ఒకరు.. స్నేహం కోసం మరొకరు..!

Two Girls Are Suicide Attempt In East Godavari - Sakshi

ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ విద్యార్థినులు

ఒకరి మృతి, చావుబతుకుల మధ్య మరొకరు

ప్రమాదవశాత్తూ మరణించిన అమ్మ కోసం బెంగపెట్టుకుని ఒక విద్యార్థిని, ప్రాణ స్నేహితురాలు లేకుండా ఉండలేనని మరో విద్యార్థిని..  ఇద్దరూ చనిపోవాలని నిర్ణయించుకున్నారు. శీతల పానీయంలో పురుగు మందు కలిపి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషాద సంఘటన మండలంలోని నాగుల్లంక గ్రామంలో జరిగింది. ఈ సంఘటనలో ఒక విద్యార్థిని మరణించగా, మరో విద్యార్థిని చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.

సాక్షి, పి.గన్నవరం: నాగుల్లంక శివారు రాయిలంకకు చెందిన మామిడిశెట్టి లక్ష్మీప్రసన్న (15), అయోధ్యలంక గ్రామం నుంచి వచ్చి నాగుల్లంకలో నివశిస్తున్న బొక్కా సూర్య భవాని (15) స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. వీరిద్దరు ప్రాణ స్నేహితులని స్థానికులు తెలిపారు. లక్ష్మీప్రసన్న తల్లి భవాని గత జనవరి 16న పంట బోదెలో బట్టలు ఉతుకుతూ ప్రమాదవశాత్తూ నీట మునిగి మరణించింది. దీంతో తల్లి కోసం కుమార్తె బెంగ పెట్టుకుంది.

అమ్మ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆమె లేనిదే తనకు జీవితం లేదని, తాను కూడా చనిపోయి అమ్మ వద్దకు వెళ్తానని సుమారు సుమారు 10 లేఖలు రాసుకుని స్కూలు బ్యాగులో దాచుకుంది. మాతృమూర్తితో చంటి బిడ్డ ఉన్న చిత్రాలను పెన్నులతో గీసి తల్లిపై తనకున్న అభిమానాన్ని స్పష్టం చేసింది. అయితే ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. గురువారం ఉదయం పాఠశాలకు వచ్చిన వారు మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్లారు.

అక్కడ ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లలో గుళికల మందు కలిపి తాగి పాఠశాలకు వచ్చారు. సాయంత్రం సమయంలో లక్ష్మీ ప్రసన్న వాంతులు చేసుకోవడంతో పక్కనే ఉన్న పీహెచ్‌సీకి హెచ్‌ఎం హరినాథ్‌ తరలించారు. ఈలోగా ఆమె స్కూలు బ్యాగులోని టిఫిన్‌ బాక్సులో గుళికలు ఉండటాన్ని గమనించిన విద్యార్థులు హెచ్‌ఎంకు తెలిపారు. అప్పటికే ఆమె పరిస్థితి విషమించడంతో అంబులెన్స్‌కు ఫోన్‌ చేశారు.

ఈలోగా సూర్య భవాని కూడా వాంతులు చేసుకోవడంతో ఇద్దరిని అమలాపురం కిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ లక్ష్మీ ప్రసన్న మరణించగా, ఆమె మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. అపస్మారక స్థితిలో ఉన్న సూర్య భవానికి కిమ్స్‌లో వైద్యం చేస్తున్నారు. ఇద్దరూ ప్రాణ స్నేహితులు కావడంతో ఒకరినొకరు వీడలేక ఇద్దరూ కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్బడి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు.

నాగుల్లంక గ్రామంలో విషాదఛాయలు
పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన పదో తరగతి విద్యార్థినులలో లక్ష్మీ ప్రసన్న మరణించగా, సూర్య భవాని అపస్మారక స్థితికి చేరుకోవడంతో నాగుల్లంకలో విషాద ఛాయలు అలముకున్నాయి. లక్ష్మీ ప్రసన్న తల్లి భవాని ఇటీవల మరణించగా తండ్రి దుర్గారావు, చెల్లెలు లక్ష్మీదుర్గ ఉన్నారు.

కుమార్తె ఆత్మహత్య చేసుకోవడంతో తండ్రి దుర్గారావు బోరున విలపిస్తున్నాడు. సూర్యభవానికి తల్లి సుజాత, తండ్రి శ్రీనివాసరావు, తమ్ముడు గణేష్‌ ఉన్నారు. సూర్య భవాని అపస్మారక స్థితిలో ఉండటంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనతో ఉన్నారు. పి.గన్నవరం ఎస్సై ఎస్‌.రాము కిమ్స్‌ ఆస్పత్రికి చేరుకుని విచారణ చేపట్టారు. ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడటానికి మరేమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో ఎస్సై దర్యాప్తు చేస్తున్నారు.

అపస్మారకస్థితిలో ఉన్న సూర్య భవాని  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top