అయ్యో..! హాసిని

Tirupati Family Died in Devipatnam Boat Accident - Sakshi

బోటు ప్రమాదంలో గల్లంతయిన హాసిని మృతదేహం వెలికితీత

ఆమె తండ్రి సుబ్రమణ్యం కోసం ఆందోళన

తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు దిగ్భ్రాంతి

సుబ్రమణ్యం తండ్రి అస్థికలను గోదావరిలో కలిపేందుకు భార్య, కూతురితో ఈనెల 13వ తేదీ రాత్రి రాజమండ్రికి బయలుదేరారు. హాసిని చదువుతున్న పాఠశాల విద్యార్థులు 14వ తేదీ జూపార్కును సందర్శించారు. తోటి విద్యార్థులతో కలసి తాను కూడా వెళ్లాలనుకుంది. ఆ విషయం తన తండ్రితో  చెప్పింది. అయితే ముందుగా రాజమండ్రికి వెళ్లాల్సిందేనని తండ్రి సుబ్రమణ్యం తేల్చి చెప్పారు. ఒకవేళ వారు ప్రయాణాన్ని వాయిదా వేసుకుని ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదని ఆ పాఠశాల ఉపాధ్యాయులు చెబుతున్నారు.  హాసిని లాంటి ఓ మంచి విద్యార్థినిని కోల్పోవడం బాధాకరమంటూ వారు కన్నీటిపర్యంతమయ్యారు.

సాక్షి, తిరుపతి:భయపడినట్లే.. జరిగింది.. పాపికొండల ప్రయాణం ప్రాణాలు తీసింది. గోదావరి నది పడవ ప్రమాదం తిరుపతికి చెందిన సుబ్రమణ్యం కుటుంబాన్ని చిదిమేసింది. చిట్టిపొట్టి పలుకులతో, అల్లరి చేష్టలతో నిత్యం ఉత్సాహంగా ఉండే హాసిని.. నీటి ఉద్ధృతిలో కొట్టుకుపోయి కన్నుమూసింది. చిన్నారి మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పుణ్యం కోసం గోదారమ్మ ఒడ్డుకెళ్తే.. పుట్టెడు సోకం మిగిలిందంటూ.. కన్నీటి పర్యంతమయ్యారు. గోదావరి బోటు మునక ప్రమాదంలో గల్లంతైన తిరుపతికి చెందిన సుబ్రమణ్యం(45), మధులత(40) దంపతుల కుమార్తె హాసిని(12) మృతదేహాన్ని సోమవారం ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు వెలికితీశాయి. ఈ ఉదయం దేవీపట్నం సమీపంలోని కచ్చలూరు వద్ద నౌకాదళ, రాష్ట్ర అగ్నిమాపకశాఖ, స్థానిక మత్స్యకారులు వెతుకులాట ప్రారంభించారు. అయితే నదీ ప్రవాహవేగం, లోతు, నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. కాగా తిరుపతికి చెందిన సుబ్రమణ్యం తన తండ్రి అస్థికలను గోదావరిలో నిమజ్జనం చేసేందుకు భార్య మధులత, కుమార్తె హాసినితో కలసి వెళ్లారు. ఈ కార్యక్రమం అనంతరం పాపికొండల అందాలను వీక్షించేందుకు అందరూ బోటులో బయలుదేరారు. అయితే దేవీపట్నం వద్ద గోదావరిలో బోట్‌ బోల్తాపడింది. ఈ ప్రమాదం నుంచి మధులత బయటపడగా.. సుబ్రమణ్యం, హాసిని గల్లంతయ్యారు. ఈ క్రమంలో సోమవారం ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ముమ్మరంగా గాలింపు చేపట్టగా.. హాసిని మృతదేహం బయటపడింది. సుబ్రమణ్యం వివరాలు ఇంకా వెల్లడికాలేదు.  

కాళ్లు పట్టుకున్నా కాపాడలేకపోయా!
‘‘పడవ బోల్తా పడిన వెంటనే నా భర్త సుబ్రమణ్యం నన్ను నీటిలో నుంచి పైకి నెట్టి కాపాడారు. అదే సమయంలో నా కాళ్లు పట్టుకుని ఉన్న నా కుమార్తె హాసినిని కూడా పైకి నెట్టి రక్షించేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నించారు. నన్ను కాపాడి నా కళ్లముందే ఆయన నీటిలో మునిగిపోయారు. నా బిడ్డ నా కాళ్లు పట్టుకున్నా.. నేను కాపాడుకోలేకపోయాను’’    – మధులత

శ్రీకాళహస్తి : పుణ్యనది గోదావరిలో తండ్రి అస్థికలను నిమజ్జనం చేసి, ఆఖరి క్రతువును నిర్వహించి, తండ్రిని పున్నామ నరకం నుంచి తప్పించాలని వెళ్లిన తిరుపతికి చెందిన సుబ్ర మణ్యం కుటుంబానికి అంతులేని దుఃఖమే మిగిలింది. బోటు మునక ప్రమాదంలో ఆయన తన కుమార్తె హాసినితో పాటు గల్లవంతవగా, ఆయన భార్య మధులత ప్రమాదం నుంచి బైటపడటం విదితమే. హాసిని మృతదేహాన్ని సోమవారం వెలికితీశారు. సుబ్రమణ్యం కోసం ఇంకనూ గాలిస్తున్నారు. దుర్గం సుబ్రమణ్యం తిరుపతిలో కుటుంబంతో కలిసి వినాయకసాగర్‌ రాధేశ్యామ్‌ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నా రు. సుబ్రమణ్యం (45)కు శ్రీకాళహస్తి, చిత్తూరులో పెట్రోల్‌ బంకులున్నాయి. శ్రీకాళహస్తి  పెట్రోల్‌ బంకు బాధ్యతలను ఆయన సతీమణి మధులత చూసేది. హాసిని (12) తిరుపతి స్ప్రింగ్‌డేల్‌ స్కూలులో 7వ తరగతి చదువుతోం ది. 3నెలల క్రితం కాలం చేసిన తన తండ్రి గంగిశెట్టి అస్థికలను గోదావరిలో నిమజ్జనం చేసేందుకు రెండు రోజుల క్రితం భార్య, కుమార్తెతో కలిసి సుబ్రమణ్యం రాజమహేంద్రవరం వెళ్లారు. బోటు మునక ప్రమాదంలో తండ్రీ, తనయ గల్లంతవగా, మధులత బైటపడింది. ఈ ఘటన  శ్రీకాళహస్తి పెట్రోల్‌ బంకులో పనిచేస్తున్న సిబ్బందికి విషాదం మిగిల్చింది. వారి జ్ఞాపకాల తడితో వారి కళ్లు చెమ్మగిల్లాయి.

పాప కళ్ల ముందే కదలాడుతోంది
ప్రతి ఆదివారం, సెలవు దినాల్లో పాప హాసినితో మా యజమాని సుబ్రమణ్యం, మధులత వచ్చేవారు. హాసిని మాతో కాసేపు మొబైల్‌ వీడియో గేమ్‌ ఆడేది. మా యజమాని మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకునే వారు. హాసిని మా కళ్లలోనే కదలాడుతోంది. ఆ పాప చనిపోయిందని టీవీలలో న్యూస్‌ వస్తూంటే దుఃఖం ఆగడం లేదు. చాలా బాధగా ఉంది.–సుమన్, పెట్రోల్‌ బంక్‌ మేనేజర్‌

ప్రమాద ఘటన కలిచి వేసింది
గోదావరిలో బోటు మునిగి పోయిందని టీవీలో   ఉదయమే చూసాను. అయితే కొంతసేపటికే దుర్వార్త వినాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. మా యజమాని బంధువులు ఫోన్‌ చేసి మా యజమాని సుబ్రమణ్యం, పాప హాసినితో ప్రమాదంలో గల్లంతయ్యారని చెప్పగానే షాక్‌ గురయ్యాం. ఆయన ఫోన్‌ నంబర్లకు ప్రయత్నించాం. కానీ సమాధానం లేదు. కళ్లల్లో నీళ్లు తిరిగాయి.– మురళి, పెట్రోలు బంక్‌  క్యాషియర్‌

చాలా  బాధ కలిగించింది
రెండేళ్లుగా పనిచేస్తున్నా. మా యజమాని సుబ్రమణ్యం చాలా మంచివారు. బంకు దగ్గరికి వస్తే అందరికీ భోజనం తెప్పించేవారు. కూర్చుని అందరం కలిసి భోజనం చేసేవాళ్లం. ఆయన ప్రమాదంలో గల్లంతయ్యారని, హాసిని మృతదేహాన్ని వెలికి తీశారని టీవీలలో చూశాక  దుఃఖం ఆగడం లేదు.      – చెంగయ్య, పెట్రోలు బంకు ఉద్యోగి

శోక సంద్రమైన స్కూలు 
తిరుపతి ఎడ్యుకేషన్‌ : ఎత్తైన కొండలు...వాటి మధ్య గలగల పారే గోదావరి. పాపికొండల్లో బోటు ప్రయాణం మధురానుభూతి. కొండకోనల అందాలను ఆస్వాదించేలోపే ఓ దుర్ఘటన. నది మధ్యలో బోటు కుదుపులకులోనై మునిగింది. అందులో ప్రయాణిస్తున్న వారిలో 37మంది గల్లంతయ్యారు. వారిలో తిరుపతిలోని స్ప్రింగ్‌డేల్‌ పబ్లిక్‌ స్కూల్‌లో 7వ తరగతి చదువుతున్న డి.హాసిని ఈ ప్రమాదంలో తండ్రితో పాటు గల్లంతయ్యింది. తిరిగి రాని లోకాలకు చేరుకుంది. ఆ నవ్వుల హాసిని ఇక లేదని తెలియడంతో ఆ చిన్నారి చదువుతున్న స్కూలు శోకసంద్రమైంది. ఎప్పుడూ సందడిగా ఉండే ఆ పాఠశాల ఈ విషాదంతో మూగబోయింది.  ఆ పాఠశాల ప్రిన్సిపల్‌ కెఆర్‌.ఆనురాధ గోపాల్, క్లాస్‌ టీచర్‌ ఎస్‌.లత హాసిని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ విచలితులయ్యారు. వారి మాటల్లోనే...‘‘ హాసిని తండ్రి సుబ్రమణ్యంకు రాచగున్నేరి వద్ద పెట్రోల్‌ బంకు నిర్వహిస్తున్నారు.  హాసిని ఏకైక సంతానం కావడంతో  తల్లిదండ్రులు సుబ్రమణ్యం, మధులత ప్రేమగా చూసుకునేవారు. చదువు, ఇతరత్రా విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించేవారు. రెండో తరగతిలో హాసిని స్ప్రింగ్‌డేల్‌ స్కూల్లో చేరింది. అప్పటి నుంచి ఇక్కడే చదువుకుంటోంది. చదువులోనూ బాగా రాణించేది. తనకు చిత్రలేఖనం, నృత్యం అంటే చాలా ఇష్టం. సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటుంది. తన మంచి తనంతో తోటి విద్యార్థులు, టీచర్లను కట్టిపడేసేది. దీంతో హాసినీ అంటే అందరికీ ఇష్టం’’. అని చెప్పారు. ఇక, హాసిని క్లోజ్‌ ఫ్రెండ్స్‌ కూడా ఎన్నో విషయాలు పంచుకున్నారు. హాసిని మరణం తమను తీవ్ర వేదనకు గురిచేసిందన్నారు.

వేపనపల్లెలో విషాద ఛాయలు
పూతలపట్టు (యాదమరి): గోదావరి నదిలో బోటు మునక ప్రమాదం సంఘటన పూతలపట్టు మండలం వేపనపల్లెలో విషాదం నింపింది. తిరుపతిలో నివసిస్తున్న సుబ్రమణ్యం కుటుం బాని కి గ్రామంతో సుదీర్ఘ అనుబంధం ఉం ది. వేపనపల్లె గ్రామానికి చెందిన గంగి శెట్టి, రాజమ్మలకు గ్రామంలో మూడెకరాల పొలం ఉంది.  వీరికి  సుబ్రమణ్యం, సురేంద్ర ఇద్దరు కుమారులు. భార్య మరణంతో గంగిశెట్టి అత్తగారిల్లు అయిన తిరుపతికి 3 దశాబ్దాల క్రితం వెళ్లిపోయారు. అక్కడే చిల్లర దుకాణం పెట్టుకుని తన కుమారుల అభ్యున్నతి కోసం శ్రమించారు. కాలక్రమంలో సుబ్రమణ్యం పెట్రోల్‌ బంకులు లీజుకు తీసుకుని వ్యాపారం చేస్తూ అంచెలంచెలుగా ఎదిగారు. తమ్ముడు సురేంద్ర వెల్డింగ్‌ వర్క్‌ చేసేవారు. తండ్రి అస్థికలు గోదావరిలో నిమజ్జనం చేసేందుకు భార్య, కుమార్తెతో వెళ్లిన సుబ్రమణ్యం బోటు మునకతో గల్లంతయ్యారనే వార్తలు టీవీలో రావడం చూసి గ్రామంలో విషాదం అలుముకుంది. వారి తాలూ కు బంధువర్గం హుటాహుటిన రాజమండ్రికి బయల్దేరింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top