ఈ జిల్లాకు ఏమైంది..


24గంటలైనా గడవలేదు.. మరో విషాదం

ఉత్సాహంగా  పుష్కర స్నానాలకు వెళ్లిన ఓ బృందం

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

మూడు కుటుంబాల్లో విషాదం
శ్రీకాకుళం సిటీ /సబ్బవరం: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నుంచి మంగళవారం అర్ధరాత్రి టాటా మేజిక్ వ్యానులో 11మంది బయలుదేరారు. బుధవారం తెల్లవారుజామున ఈ వాహనాన్ని రాజమండ్రి పుష్కరాల నుంచి వస్తున్న మరో వ్యాన్ సబ్బవరం మండలం అసకపల్లి పంచాయతీ సున్నపుబట్టీల సమీపాన జాతీయ రహదారిపై ఢీకొనడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. నరసన్నపేట మండలం రాళ్లపాడు గ్రామానికి చెందిన బోర ఎర్రప్పడు (60), గార మండలం రెడ్డిపేట గ్రామస్తురాలు కర్రి సుభద్రమ్మ(40) అక్కడికక్కడే మరణించారు.జలుమూరు మండలం టెక్కలిపాడు గామానికి చెందిన పిట్టా అప్పలరాజు (25) తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. బోర సరస్వతి (44) జలుమూరు మండలం టెక్కలిపాడు గ్రామానికి చెందిన కళ్యాణి మల్లేసు (60), కళ్యాణి అమ్మన్నమ్మ (40), కళ్యాణి లక్ష్మి (30), కర్ర సన్యాసిరావు (45), సిమ్మ పారయ్య(60), సిమ్మ రాములమ్మ (56), బొజ్జ లక్ష్మి (30), తీవ్రగాయాలపాలయ్యారు. వీరిని విశాఖ కేజీహెచ్‌కి, మరో రెండు ప్రయివేటు ఆస్పత్రులకు అంబులెన్సుల్లో తరలించారు. ఎస్‌ఐ వి.చక్రధర్‌రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పుష్కర యాత్ర ముగించుకొని వస్తూ ఢీకొన్న వాహనంలో నరసన్నపేట మండలం ఈదల వలస గ్రామానికి యాత్రికులున్నారు. సంఘటన స్ధలంలో క్షతగాత్రుల రోదనలు మిన్నంటాయి.అలసటగా ఉందని చెప్పినా...

తొలిరోజు ఓ ట్రిప్ తీసుకెళ్లి వచ్చామనీ, వెంటనే బయలుదేరాలంటే కష్టమేనని తాను అలసటగా ఉన్నానని అప్పలరాజు మొదట వెళ్లేందుకు నిరాకరించారు. అయితే బుక్‌చేసుకున్న మిత్రుల ఒత్తిడితో చేసేది లేక మంగళవారం రాత్రి భోజనం చేశాక బయలుదేరి అంతలోనే విగతజీవిగా మారాడని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మరణవార్త విన్న భార్య కనక సుశీల, తల్లి అచ్చెమ్మ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న తహశీల్దార్ కె.ప్రవల్లికా ప్రియ, వీఆర్వో పాగోటి మోహనరావుతో పాటు ఎంపీటీసీ బండి ఎర్రన్న, వైఎస్సార్‌సీపీ నాయకుడు ధర్మాన ప్రసాదరావు పరామర్శించి ఓదార్చారు. ప్రభుత్వ పరంగా రావాల్సిన సహాయం అందించేందుకు కృషి చేస్తామన్నారు.రెడ్డిపేటలో విషాదఛాయలు

గార : రెడ్డిపేట గ్రామానికి చెందిన కర్రి సుభద్రమ్మ(40) భర్త సన్యాసిరావుతో కలసి పుష్కర స్నానం కోసంబయలుదేరింది. అయితే మార్గమధ్యలోనే జరిగిన ప్రమాదంలో ఆమె మృత్యువాతపడింది. విషయం తెలుసుకున్న గ్రామంలో ఉంటున్న కుమార్తె హుటాహుటిన తన కుటుంబంతో విశాఖపట్నం వెళ్లగా సాయంత్రం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అశ్రునయనాలతో అంతిమసంస్కారం గావించారు. మండల పరిషత్ ప్రత్యేక ఆహ్వానితుడు గుండ భాస్కరరావు, ఆర్‌ఐ డి. రామకృష్ణ, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, ఎంపీ రామ్మోహన్‌నాయుడు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ కుటుంబ సభ్యులను ఆదుకుంటామని  ఒక ప్రకటనలో తెలిపారు.పేదరికంలో ఉన్నా..

పోలాకి: మండలంలోని రాళ్ళపాడు గ్రామానికి చెందిన బోర ఎర్రప్పడు(58)ది నిరుపేద కుటుంబం. ఆయన నరసన్నపేటలోని ఓ చింతపండు దుకాణంలో కళాసీగా పనిచేస్తున్నాడు. ఇద్దరు కుమారుల్లో పెద్దవాడు జనార్దన(రాజు) నరసన్నపేటలో పురుగుమందులదుకాణం నడుపుతుండగా, చిన్న కుమారుడు రమేష్ టైల్స్ పాలిషింగ్ పనిచేస్తుంటాడు. ఇద్దరికీ వివాహాలు కావడంతో వేర్వేరుగా కాపురాలు చేసుకుంటున్నారు.ఎన్నో ఏళ్లకు వచ్చిన పుష్కరాల్లో నదీస్నానం చేస్తే పుణ్యం లభిస్తుందన్న ఆశతో ఎర్రప్పడు భార్య సరస్వతితో కలసి బయలుదేరాడు. అనుకోని దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. భార్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను విశాఖపట్నంలోని సిద్దార్థ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్సనందిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న కుమారులిద్దరూ కన్నీరుమున్నీరై విలపిస్తూ విశాఖ బయలుదేరి వెళ్లారు. సాయంత్రానికి తండ్రి మృతదేహానికి స్వగ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించగా... తల్లి పరిస్థితిని తలచుకుని తల్లడిల్లుతున్నారు. పేదరికంలోనూ అన్యోన్యంగా ఉన్న కుటుంబంలో వచ్చిన ఈ విషాదం అక్కడివారిని తీవ్రంగా కలచివేసింది.క్షణాల్లో ప్రమాదం... అంతా కలలా ఉంది!

నరసన్నపేట : జరిగిన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన నరసన్నపేటలోని నక్కవీధికి చెందిన బి.లక్ష్మి క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘మహా పుష్కరాల్లో పాల్గొంటే మంచి జరుగుతుందని భావించి టాటామ్యాజిక్ వాహనంలో 10 మంది బయలుదేరాం. బుధవారం వేకువ జామున ఏం జరిగిందోగానీ ఒక్కసారి భారీగా కుదుపు వచ్చింది. కళ్లుమూసి తెరిచే లోపే ప్రమాదం జరిగిపోయింది. చిమ్మ చీకటి. ఏమీ కన్పించలేదు. గాయాలతో ఉన్న వారి రోదనలు మిన్నంటాయి. ప్రమాద వాహనం నుంచి మెల్లగా బయట పడి రోడ్డుపైకి వచ్చి  వాహనాలను ఆపాలని గట్టిగా కేకలు వేశాను. కొన్ని వాహనాలు ఆపలేదు.అర గంట తరువాత వాహనాలు ఆపి గాయపడినవారిని బయటకు తీశారు. ఆ తరువాత అంబులెన్సులు వచ్చాయి. అప్పటికే ముగ్గురు చనిపోయారు. నాతో పాటు నరసన్నపేటకు ఎందిన  కల్యాణ మల్లేసు, కల్యాన అమ్మన్న, కల్యాణ లక్ష్మిలకు తీవ్ర గాయాలు అయ్యాయి. అలాగే జిల్లోడు మాకివలసలకు చెందిన శిమ్మ పారయ్య, సరస్వతి, శిమ్మ రాములమ్మలకు గాయాలు అయ్యాయి.’ లక్ష్మి తెలిపారు. కాగా ప్రమాద సంఘటనకు సంబంధించి నరసన్నపేట తహశీల్దార్ సుధాసాగర్ ప్రమాదం నుంచి బయట పడిన లక్ష్మి నుంచి వివరాలు సేకరించారు. ప్రమాదం ఎలా జరిగింది, గాయాలు ఎవరెవరికి అయ్యాయి. అన్న సమాచారం సేకరించారు.

 

రోడ్డున పడిన కుటుంబం

జలుమూరు : పుష్కరాలు ఆ కుటుంబాన్ని రోడ్డుపైకి నెట్టేసింది. టాటా మ్యాజిక్ వాహనాన్ని నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న జలుమూరు మండలం టెక్కలిపాడు పంచాయతీ గొల్లపేటకు చెందిన పిట్ట అప్పలరాజు మృతి ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది. అప్పలరాజుకు భార్య కనకసుశీల, రెండునెలల కుమార్తె యామిని, తల్లి అచ్చెమ్మ ఉన్నారు. వీరందరికీ ఆయనే ఆధారం. సోమవారం కొందరు ప్రయాణికులను రాజమండ్రి తీసుకెళ్లి వచ్చిన అప్పలరాజు మళ్లీ మంగళవారం రాత్రి మరికొందరిని తీసుకెళ్లి మృత్యువుపాలయ్యాడు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top