పంతానికి పోయి సమస్యను పెంచుకోవద్దని తోటపల్లి ప్రాజెక్టు బాసంగి నిర్వాసితులకు జిల్లా జాయింట్ కలెక్టర్ బి.రామారావు
జియ్యమ్మవలస: పంతానికి పోయి సమస్యను పెంచుకోవద్దని తోటపల్లి ప్రాజెక్టు బాసంగి నిర్వాసితులకు జిల్లా జాయింట్ కలెక్టర్ బి.రామారావు హితబోధ చేశారు. ఒకే చోట ఉన్న భూమిని తీసుకోవాలని వారికి సూచించారు. విభేదాలతో గ్రామాన్ని విడగొట్టవద్దని చెప్పారు. మండలంలోని చింతలబెలగాం రైతులు, బాసంగి గ్రామానికి చెందిన నిర్వాసితులతో శనివారం ఆయన చర్చలు జరిపారు. శుక్రవారం పోలీసు బందోబస్తుతో వచ్చిన అధికారులు చింతలబెలగాం నిరుపేద రైతులకు చెందిన భూములు తీసుకోవడానికి ప్రయత్నించగా బాధితులు ఒక రోజు వ్యవధి కోరి కలెక్టర్‌కు తమ గోడు వినిపించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో శనివారం జేసీ బి.రామారావు, ఆర్డీవో ఆర్.గోవిందరావు చింతలబెలగాం, బాసంగి వచ్చి రైతులు, నిర్వాసితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. 6 ఎకరాల పొలం వారికి చాలదని, ఆ భూమి తీసుకుంటే తీరని అన్యాయానికి గురవుతామని రైతులు చెప్పారు. బాసంగి గ్రామస్తులకు కూడా రహదారి పక్కనే పొలాలు ఉన్నాయని, వాటిని ఇవ్వకుండా, ఒకే దగ్గర ఉన్న 53 ఎకరాలు చూపించినా వినకుండా తమ పొలాలపైనే దృష్టి పెడుతున్నారని వివరించారు. ఒకే దగ్గర ఉన్న 53 ఎకరాలను తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా జేసీ రామారావు మాట్లాడుతూ బాసంగికి చెందిన నడిమింటి రమేష్‌పై మండిపడ్డారు. సమస్యను సృష్టిస్తున్నావంటూ విరుచుకుపడ్డారు. నువ్వు ఉండేది పార్వతీపురంలో కదా.. సమస్య పరిష్కరించాల్సిపోయి సృష్టించడానికి ప్రయత్నించవద్దని హెచ్చరించారు. రాజీపేట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వద్ద 20 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, అటువంటి వారిపై చర్యలు తీసుకోకుండా తహశీల్దార్ ఏమి చేస్తున్నారని జేసీ ప్రశ్నించారు. వీఆర్వో ఎస్.ఎ.తిరుపతిరావు కూడా సమాచారాన్ని దాచి పెడుతున్నారని తెలిసిందన్నారు. ఇది నిజమని తేలితే వీఆర్వోపై చర్య తీసుకోవాలని తహశీల్దార్‌కు సూచించారు.