రాష్ట్రంలో ఎండల తీవ్రత ఆదివారం కూడా కొనసాగింది. ముఖ్యంగా రాయలసీమలో ఈ తీవ్రత అధికంగా ఉంది. ఆదివారం రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు రాయలసీమలోనే నమోదయ్యాయి.
విశాఖపట్నం: రాష్ట్రంలో ఎండల తీవ్రత ఆదివారం కూడా కొనసాగింది. ముఖ్యంగా రాయలసీమలో ఈ తీవ్రత అధికంగా ఉంది. ఆదివారం రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు రాయలసీమలోనే నమోదయ్యాయి. చిత్తూరులో 42 డిగ్రీలు, కర్నూలు, అనంతపురంలలో 41 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు కోస్తా ప్రాంతంలోని నెల్లూరులోనూ భానుడు ప్రతాపం చూపాడు.
ఇక్కడ ఆదివారం 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రెంటచింతల, నందిగామల్లోనూ 41 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదవగా.. కావలిలో 40, విశాఖపట్నంలో 38.2, కాకినాడలో 36, మచిలీపట్నంలో 38, బాపట్లలో 37 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఏప్రిల్ సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో వేడి వాతావరణం, పొడిగాలుల ప్రభావం మరింతగా ఉంటుందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్రపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వారు తెలిపారు.