వివాహిత అనుమానాస్పద మృతి | The mysterious death of a married | Sakshi
Sakshi News home page

వివాహిత అనుమానాస్పద మృతి

Sep 22 2014 2:13 AM | Updated on Aug 21 2018 5:46 PM

వివాహిత అనుమానాస్పద మృతి - Sakshi

వివాహిత అనుమానాస్పద మృతి

వివాహమైన 11 నెలలకే ఓ యువతి అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. పెళ్లయినప్పటి నుంచి వేధింపులకు పాల్పడుతున్న భర్తే హత్యచేసి పారిపోయి ఉంటాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

  • పెళ్లయిన 11 నెలలకే కాటికి..
  •  భర్తే ఈ దారుణానికి ఒడిగట్టాడని మృతురాలి పుట్టింటివారి ఆరోపణ
  • కొల్లిపర(గుంటూరు జిల్లా) : వివాహమైన 11 నెలలకే ఓ యువతి అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. పెళ్లయినప్పటి నుంచి వేధింపులకు పాల్పడుతున్న భర్తే హత్యచేసి పారిపోయి ఉంటాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

    కొల్లిపర మండలం వల్లభాపురానికి చెందిన కొక్కిలిగడ్డ సీతారామ్‌తో కృష్ణాజిల్లా కోడూరు మండలం దింటిమెరక గ్రామానికి చెందిన నాగజ్యోతికి గతేడాది అక్టోబర్‌లో వివాహమైంది. పెళ్లి సందర్భంగా రూ.22 వేలు జ్యోతి తల్లిదండ్రులు కట్నం కింద ఇచ్చారు. నెలరోజులకే ఆదనపు కట్నం తెమ్మంటూ వేధింపులు మొదలయ్యాయి.

    మూడు నెలల క్రితం కూడా భార్యను పుట్టిం టికి పంపాడు. జ్యోతి త ల్లిదండ్రులకు అంత స్తోమత లేకపోవడంతో కుమార్తెను తమ వద్దే ఉంచుకున్నారు. నెలరోజుల క్రితం సీతారామ్ తండ్రి దానారావు దింటిమెరక వెళ్లి కోడలిని కాపురానికి పంపాల్సిందిగా కోరాడు. ఇకపై వేధింపులు ఉండవని హామీ ఇవ్వడంతో జ్యోతిని పుట్టింటివారు పంపించారు. ఈ నెల 13న దింటిమెరక వెళ్లివద్దామని చెప్పి సీతారామ్ తన భార్యను గ్రామం వద్ద ఉన్న కృష్ణానదిలో పడవపై ఏరవతలకు తీసుకువెళ్లాడు.

    అప్పటినుంచి దంపతులు కనిపించడంలేదు. అదేరోజు తన సెల్‌ఫోను నుంచి కుటుంబసభ్యులకు జ్యోతి ఫోన్‌చేసి మాట్లాడింది. మరుసటి రోజు నుంచి ఆ ఫోన్ పనిచేయకపోవడంతో తండ్రి వెంకటేశ్వరరావు ఆందోళనకు గురై బంధువులతో కలసి 15న వల్లభాపురం వచ్చారు. సీతారామ్ కుటుంబసభ్యులను విచారించగా, 13నే జ్యోతి దింటిమెరక వెళ్లిపోయిందని చెప్పారు. తమ కుమారుడూ కనపడడం లేదని, ‘మీరే ఏదో చేసి ఉంటారు’ అంటూ  వారిపై సీతారామ్ సోదరులు వాదనకు దిగారు. దీంతో వెనుదిరిగి వెళ్లి గాలింపు చేపట్టినా ఫలితం లేకపోయింది. దీంతో జ్యోతి తండ్రి శనివారం కొల్లిపర పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

    దంపతులు కనపడడం లేదంటూ దినపత్రికల్లో వార్తలు రావడంతో గ్రామస్తులు కొందరు జ్యోతిని వారం క్రితం లంకలో చూశామని చెప్పారు. దీంతో ఆమె పుట్టింటివారు అక్కడకు వెళ్లిచూశారు. అక్కడ గుడిసె దగ్ధమై ఉంది. అందులో ఒక అస్థిపంజరం ఉండడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలించారు. అస్థిపంజరానికి ఉన్న గాజు తన కుమార్తెదేనని జ్యోతి తండ్రి వెంకటేశ్వరరావు తెలిపాడు. తమ కుమార్తెను అల్లుడే హత్యచేశాడని ఆరోపించాడు.
     
    ఆది నుంచి వేధింపులే..

    పెళ్లయిన నాటి నుంచి అనుమానంతో సీతారామ్ తరచూ భార్యను వేధిస్తుండేవాడని గ్రామస్తులు చెబుతున్నారు. ఎక్కడికి వెళ్లినా అమెను కూడా తన వెంట తీసుకువేళ్లేవాడని తెలిపారు. ఇటీవల కాలంలో ఎవరో జుట్టు బాగుం ది అని చెప్పడంతో అమెకు గుండు గీయించాడని చెప్పారు. అదనపు కట్నం తెమ్మంటూ పదేపదే వేధిస్తుండే వాడని, మూడు నెలల క్రితం ఇంటికి వస్తే చేసేది లేక తమవద్దే ఉంచామని తండ్రి బోరుమన్నాడు. తిరిగి పంపకుండా ఉన్నా తమ కూతురు బతికేదని రోదస్తూ చెప్పాడు. జ్యోతి మరణవార్త తెలిసి అమె బంధువులు, గ్రామస్తులు పెద్దసంఖ్యలో ఆ ప్రదేశానికి చేరుకున్నారు. తెనాలి డీఎస్పీ టీపీ విఠలేశ్వర్, రూరల్ సీఐ టి.మురళీకృష్ణ, ఎస్సై జి.సుబ్బారావు, కొల్లిపర పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీతారామ్ హత్య చేసి పరారై ఉంటాడని ప్రాథమికంగా భావిస్తున్నామని పోలీసులు తెలిపారు.  
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement