పేదోడికి పెద్ద చదువులు దూరం కాకూడదనే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మహత్తర ఆశయానికి నేటి పాలకులు తూట్లు పొడవడాన్ని సర్వత్రా జీర్ణించుకోలేకున్నారు.
సీట్లు నిండవు... పాట్లు తప్పవు !
Sep 21 2013 4:06 AM | Updated on Jul 11 2019 6:33 PM
పేదోడికి పెద్ద చదువులు దూరం కాకూడదనే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మహత్తర ఆశయానికి నేటి పాలకులు తూట్లు పొడవడాన్ని సర్వత్రా జీర్ణించుకోలేకున్నారు. ‘ఫీజు రీయింబర్స్‌మెంట్’ పథకం అమలులో స్పష్టతలేని నిర్ణయాల కారణంగా నేడు ఎందరో ప్రతిభ ఉన్న విద్యార్థులు ఇంజినీరింగ్ కళాశాలల్లో చేరేందుకు సిద్ధపడటం లేదు. ఫలితంగా, ఆయా కళాశాలల్లో సీట్లు భర్తీ కాక, నిర్వహణ భారం మోయలేక మూసేసుకోవడమే ఉత్తమంగా భావిస్తున్నారు. జిల్లాలో పలు యాజమాన్యాలు ఇప్పటికే తమ కళాశాలల భవనాలు, ప్రాంగణాలను అద్దెకు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నాయి.
సాక్షి, గుంటూరు : జిల్లాలో 47 ఇంజినీరింగ్ కళాశాలలు, 18 వేలకుపైగా సీట్లు. మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తికావస్తోంది. 45 శాతం సీట్లు కూడా భ ర్తీ కాని పరిస్థితి. సమైక్యాంధ్ర సమ్మె ప్రభావం, బ్యాంకుల సెలవు దినాల నేపథ్యంలో మొదటి విడత కౌన్సెలింగ్‌ను ఈనెల 25 వరకు పొడిగించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంపై ప్రభుత్వ నిర్ణయంలో ఇప్పటికీ స్పష్టతలేదు. దీంతో ప్రభుత్వ నిర్ణయాలపై ఆధారపడి కౌన్సెలింగ్ ద్వారా కన్వీనర్ సీటు కోసం కూర్చోవడం దండగని విద్యార్థులు భావిస్తున్నారు. అసలు పథకం నిధులు విడు దల చేస్తారా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమౌతోన్నాయి.
వేలాది రూపాయల ఫీజుల భారం మోయలేని మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లల్ని ప్రత్యామ్నాయ కోర్సుల్లో చేర్పిస్తున్నారు. ఈ ఏడాది బీఏ, బీకాం కోర్సుల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య పది శాతం పెరగడమే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. జిల్లాలోని ఆర్వీఆర్ అండ్ జేసీ, విజ్ఞాన్ లారాా, కిట్స్, ఏఎన్‌యూ తదితర ఆరు ఇంజినీరింగ్ కళాశాలల్లో మాత్రమే మొదటి విడత కౌన్సెలింగ్‌లో నూరుశాతం సీట్లు భర్తీఅయ్యాయి. మరో 15 కళాశాలల్లో 50శాతం పూర్తికాగా, 5 నుంచి 10 సీట్లు భర్తీ అయిన కళాశాలలు 20కి మించి ఉన్నాయి. నరసరావుపేట, మాచర్ల కళాశాలలు ఇప్పటికే తమ వద్దవున్న బ్యాచ్‌లను ఇతర కళాశాలలకు బదిలీ చేయాలనే ఆలోచనతో మం తనాలు చేస్తున్నాయి.
ఇటీవల ముగిసిన ఎంసెట్ ర్యాంకర్ల సర్టిఫికెట్ల పరిశీలనకు జిల్లా వ్యాప్తంగా 9,600 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. ఆయా విద్యార్థులందరూ జిల్లాలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో చేరినా ఇంకా ఐదు వేలకు పైగా సీట్లు మిగిలిపోనున్నాయి. ప్రభుత్వం ఫీజులు చెల్లిస్తున్నందునే విద్యార్థులు ప్రతేటా ఇంజినీరింగ్ కళాశాలల్లో చేరుతున్నారనేది తెలియంది కాదు. ఫీజులు ఎంత పెరిగినా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రూ. 35 వేలకే ప్రభుత్వం పరిమితం చేసింది.అంతేకాక, 10 వేలలోపు ర్యాంకులు తెచ్చుకున్నవారికే ఫీజుల చెల్లింపంటూ నిబంధనలు పెట్టిన దృష్ట్యా ఇంజినీరింగ్ విద్య చదవకపోతే ఏంటని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ప్రశ్నించుకుంటున్నారు.
కొట్టుమిట్టాడుతున్న యాజమాన్యాలు..
ఫీజుల పెంపు కోరుతూ యాజమాన్యాలు రచ్చకెక్కిన ఫలితంగా ప్రస్తుతం కొన్ని కళాశాలల్లో అసలు విద్యార్థుల ప్రవేశాలే లేని పరిస్థితి నెలకొంది. ఎంసెట్‌తో పాటే ఐఐటీ, ఏఐఈఈఈ లోనూ ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లోని ఐఐటీలు, సాంకేతిక విద్యా సంస్థల్లో చేరిపోయారు. ఇక సర్టిఫికెట్ల పరిశీలన పూర్తిచేసుకుని వెబ్ కౌన్సెలింగ్‌కు హాజరవుతున్న విద్యార్థులు రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లోని ఇంజినీరింగ్ కళాశాలలు, పేరెన్నికగన్న కళాశాలల్లోనే సీట్లు కోరుతున్నారు. మారుమూల కళాశాలల్లో చేరేందుకు ఇష్టపడడం లేదు. బోధనా సదుపాయాలు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, ప్రయోగశాలలు లేకున్నా ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఇంతకాలం నెట్టుకొచ్చిన కళాశాలలకు ప్రస్తుత ప్రభుత్వ విధానాల కారణంగా గడ్డుకాలం ఎదురైంది.
Advertisement
Advertisement