నిజాం హాస్టల్‌లో టెన్షన్.. టెన్షన్!
ఏపీఎన్జీవోల ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ నేపథ్యంలో శనివారం ఉదయం నుంచి సాయంత్రం దాకా నిజాం కాలేజీ హాస్టల్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
సాక్షి, హైదరాబాద్: ఏపీఎన్జీవోల ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ నేపథ్యంలో శనివారం ఉదయం నుంచి సాయంత్రం దాకా నిజాం కాలేజీ హాస్టల్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బయటి విద్యార్థులను (ఔటర్స్) హాస్టల్ నుంచి పంపించేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు హాస్టల్‌లోకి రావడాన్ని నిరసిస్తూ విద్యార్థులు హాస్టల్ భవనంపైకి ఎక్కి నిరసన తెలిపారు. వారిని కిందకు దింపేందుకు పోలీసులు వెళ్లడంతో విద్యార్థులు అడ్డుకున్నారు.
దీంతో పోలీసులు లాఠీలను ఝళిపించడంతో పలువురు విద్యార్థులు గాయాలపాలయ్యారు. విద్యార్థులపై లాఠీచార్జిని ఓయూ జేఏసీ, టీఎస్ జాక్ తీవ్రంగా ఖండించాయి. ఇక ఏపీఎన్జీవోల సభలో ‘జై తెలంగాణ’ నినాదాలు కలకలం సృష్టించాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి జేఏసీ నేత దూదిమెట్ల బాలరాజు యాదవ్ పోలీసుల కన్నుగప్పి సభలోకి వెళ్లి తెలంగాణ నినాదాలు చేశారు. అలాగే ఇదే సభలో ప్రసంగాలు సాగుతుండగా వేదిక సమీపంలో విధుల్లో ఉన్న సిద్దిపేట సాయుధ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్ శ్రీనివాస్ జై తెలంగాణ అంటూ నినదించారు. దీంతో వీరిద్దరిపై సభకు వచ్చిన వారిలో పలువురు దాడికి పాల్పడ్డారు.