అద్దె బస్సుల రెన్యువల్‌కూ ఉందో రేటు! | Tender Calls For Rental Busses In APSRTC Amaravati | Sakshi
Sakshi News home page

అద్దె బస్సుల రెన్యువల్‌కూ ఉందో రేటు!

Jul 23 2018 8:47 AM | Updated on Aug 20 2018 3:30 PM

Tender Calls For Rental Busses In APSRTC Amaravati - Sakshi

ఎందుకంటే అద్దె బస్సుల ఒప్పందాన్ని రెన్యువల్‌ చేసేందుకు ఉత్తరాంధ్రకే చెందిన ఓ ఎమ్మెల్సీ ద్వారా ఆయన డీల్‌ కుదుర్చుకున్నారు మరి.

సాక్షి, అమరావతి బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో ‘అద్దె బస్సుల ఒప్పందం’ వివాదాస్పదంగా మారింది. కాలపరిమితి ముగిసిన అద్దె బస్సుల ఒప్పందాన్ని రెన్యూవల్‌ చేయడానికి వీల్లేదని అధికారులు అంటున్నా. తాజాగా టెండర్లు పిలవాలని ఆర్టీసీ పాలకమండలి నిర్ణయించినా.. ఉత్తరాంధ్రకు చెందిన ఓ కీలకనేత వినిపించుకోవడంలేదు. ఎందుకంటే అద్దె బస్సుల ఒప్పందాన్ని రెన్యువల్‌ చేసేందుకు ఉత్తరాంధ్రకే చెందిన ఓ ఎమ్మెల్సీ ద్వారా ఆయన డీల్‌ కుదుర్చుకున్నారు మరి.

దాదాపు 140 అద్దె బస్సుల ఒప్పందం
2008, 2009లో ఆర్టీసీ దాదాపు 140 అద్దె బస్సుల్ని తీసుకుంది. వాటిలో పల్లెవెలుగు, సిటీ బస్సులు ఉన్నాయి. వాటి ఒప్పంద కాలపరిమితి ఈ ఏడాది మార్చి 31తో ముగిసింది. దాంతో ఒప్పందాన్ని తాత్కాలికంగా 6 నెలలకు పొడిగించారు. ఈ సెప్టెంబర్‌ 30తో ఆ గడువు ముగియనుంది. గతేడాది కాలపరిమితి ముగిసిన అద్దె బస్సుల ఒప్పందాలను ఆర్టీసీ రెన్యువల్‌ చేసింది. అయితే అప్పట్లో ఆర్టీసీ పాలకమండలి లేదు. దాంతో అధికారులు ఒప్పందాన్ని రెన్యూవల్‌ చేసి ఇటీవల పాలకమండలి నియామకం తర్వాత ర్యాటిఫికేషన్‌ చేశారు. అదే రీతిలో ఈ ఏడాది మార్చితో కాలపరిమితి ముగిసిన 140 బస్సుల ఒప్పందాలను కూడా రెన్యువల్‌ చేయాలని అద్దె బస్సుల యజమానులు కోరారు. ఆర్టీసీ పాలకమండలికి చెందిన ‘పెద్ద’ అందుకు సమ్మతించారు. అయితే ఆ ప్రతిపాదనను ఆర్టీసీ ఉన్నతాధికారులు తిరస్కరించారు. ఎంఎస్‌టీసీ నిబంధనల ప్రకారం అద్దె బస్సుల కోసం ఆన్‌లైన్‌లో టెండర్లు పిలవాలని నిర్ణయించారు. ఆర్టీసీ పాలకమండలిలో మెజార్టీ సభ్యులు అదే అభిప్రాయం వ్యక్తం చేయడంతో ఆమేరకు  తీర్మానం ఆమోదించారు.  దీంతో అద్దె బస్సుల కోసం ఆర్టీసీ టెండర్ల ప్రక్రియ చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది.

కీలక నేతతో డీల్‌..
ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు ఉత్తరాంధ్రకు చెందిన కీలక నేతను ఆశ్రయించారు. ఆయన సామాజికవర్గానికే చెందిన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అంతా తానై ఈ కథ నడిపించారు. ఆ ఎమ్మెల్సీ సూచన మేరకు అద్దెబస్సుల యజమానులు ఈ నెల 10 విజయవాడలోని ఓ హోటల్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మరో 9 ఏళ్ల పాటు ఒప్పందాన్ని రెన్యువల్‌ చేసేందుకు ఎమ్మెల్సీ ప్రతిపాదించిన డీల్‌మీద చర్చించారు. ఒక్కో బస్సుకు రూ.50 వేల చొప్పున వసూలు చేసి ఉత్తరాంధ్ర కీలకనేతకు ఇవ్వాలని నిర్ణయించారు. అంటే దాదాపు రూ.70 లక్షలు ఉత్తరాంధ్ర కీలక నేతకు ముట్టజెప్పనున్నారన్నమాట. ఇక ఎమ్మెల్సీకి, ఆర్టీసీ పెద్దకు, జోనల్‌స్థాయి ప్రతినిధులకు ముడుపులు దీనికి అదనం. 

టెండర్ల ప్రక్రియకు బ్రేక్‌..?
డీల్‌ కుదిరిన విషయాన్ని ఎమ్మెల్సీ కీలక నేతకు తెలిపారు. దాంతో ఆయన వెంటనే రంగంలోకి దిగారు. అద్దె బస్సుల కోసం తాజాగా టెండర్ల ప్రక్రియను నిలుపుదల చేయాలని మౌఖికంగా ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ వ్యవహారంపై ఆర్టీసీ ఉన్నతాధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అద్దె బస్సుల ఒప్పందాలను నిబంధనలకు విరుద్ధంగా రెన్యూవల్‌ చేయలేమని చెబుతున్నారు. ప్రస్తుతానికి కీలక నేత ఆదేశాలతో టెండర్ల ప్రక్రియ అయితే తాత్కాలికంగా నిలుపుదల చేశారు. అయితే ఆ కీలక నేత పట్టుబడుతుండటంతో అద్దె బస్సుల ఒప్పందాన్ని రెన్యూవల్‌ చేయకతప్పదని తేల్చిచెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement