కార్పొరేషన్‌ స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణం

TDP Party Office Constructed Without Any Govt. Permission In Guntur - Sakshi

ఆక్రమణపై చర్యలేవి?     

అందులో టీడీపీ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటు

ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌ సీపీ లీగల్‌ సెల్‌

పట్టించుకోని నగర పాలక సంస్థ అధికారులు

సాక్షి, గుంటూరు: కోట్ల రూపాయల విలువ చేసే కార్పొరేషన్‌ స్థలం కబ్జాకు గురైంది. అనుమతి లేకుండా అడ్డగోలుగా టీడీపీ నేతలు భారీ భవనం నిర్మించారు. లీజు, పన్ను రూపంలో కార్పొరేషన్‌ ఖజానాకు రూ.లక్షలు గండిపడింది. అయినా గుంటూరు నగరపాలక సంస్థ అధికారులకు కనీసం చీమకుట్టినట్లయినా లేదు. అక్రమ కట్టడాలపై కొరడా ఝుళిపించి, వాటిని తొలగించాలని సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు.

గత ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదిక కూల్చివేతతో అక్రమ కట్టడాల నిర్మూలనకు శ్రీకారం చుట్టారు. అయినప్పటికీ కొందరు అధికారుల్లో మాత్రం చలనం రావడం లేదు. అక్రమ కట్టడాలు, ఆక్రమణలను చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు అందినా కనీసం నోటీసులు సైతం జారీ చేయడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

గుంటూరు నగరంలో..
గుంటూరు నగరం నడిబొడ్డున అనుమతి లేకుండా నిర్మించిన భవనంలో టీడీపీ రాష్ట్ర కార్యాలయం కొనసాగుతున్న విషయం తెలిసిందే. గుంటూరు నగరంలోని అరండల్‌పేట 12/3లో టీఎస్‌ నంబరు 826లో ఉన్న వెయ్యి గజాల కార్పొరేషన్‌ స్థలాన్ని 1999, జూలై 1వ తేదీన టీడీపీ కార్యాలయ నిర్మాణం కోసం 30 ఏళ్ల పాటు లీజుకు తీసుకున్నారు. ఏడాదికి రూ.25 వేల చొప్పున నగరపాలక సంస్థకు అద్దె చెల్లిస్తూ, ప్రతి మూడేళ్ల కొకసారి లీజును రెన్యూవల్‌ చేయించుకోవడంతోపాటు, 33 శాతం అద్దె పెంచే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు.

టీడీపీ నేతలు మాత్రం పక్కనే ఉన్న 1,637 చదరపు గజాల స్థలాన్ని సైతం ఆక్రమించి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ స్థలంలో మూడంతస్తుల అతిపెద్ద భవనాన్ని నిర్మించి టీడీపీ జిల్లా కార్యాలయం ఏర్పాటు చేశారు. 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే సదరు భవనాన్ని టీడీపీ రాష్ట్ర కార్యాలయంగా  ఏర్పాటు చేశారు. భవనం నిర్మించి 20 ఏళ్లు దాటుతున్నా ఇంత వరకు సదరు భవనానికి అనుమతులు తీసుకోవడం గాని కార్పొరేషన్‌కు ఒక్క రూపాయి పన్ను కట్టడం గాని చేయలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
పన్ను వేయించేందుకు ప్రయత్నాలు.. 
టీడీపీ రాష్ట్ర కార్యాలయ భవనం ఉన్న స్థలం లీజు అసెస్‌మెంట్‌ రూపంలో కొనసాగుతోంది. అయితే కార్పొరేషన్‌లో కొందరు అధికారుల సాయంతో అక్రమ భవనానికి పన్ను అసెస్‌మెంట్‌ నంబర్‌ సృష్టించాలని టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. పురపాలక నిబంధనల ప్రకారం నగరంలో పన్నులు వేయని భవనాలకు గరిష్టంగా మూడేళ్లు వెనక్కు వెళ్లి పన్ను వేసే వెసులుబాటు ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని టీడీపీ అక్రమ నిర్మాణానికి సైతం పన్ను వేయించుకోవడం కోసం ఇటీవల జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్‌ మాజీ ఎమ్మెల్యే బంధువు ఎంఏయూడీ కార్యాలయానికి సైతం వెళ్లి వచ్చారు. అయితే ఈ వ్యవహారం ప్రభుత్వం దృష్టిలో ఉండటంతో ప్రయత్నాలు ఫలించలేదు. 

ఫిర్యాదులు చేసినా ఫలితం శూన్యం..
టీడీపీ నాయకులు నిర్మించిన అక్రమ కట్టడం, కార్పొరేషన్‌ స్థలం ఆక్రమణపై వెంటనే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌ సీపీ లీగల్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు పోలూరి వెంకటరెడ్డి, న్యాయవాదులు ఈ నెల పదో తేదీన కార్పొరేషన్‌ ఏసీకి ఫిర్యాదు చేశారు. వారు ఫిర్యాదు చేసి పది రోజులు గడుస్తున్నా అక్రమ కట్టడం, ఆక్రమణపై చర్యలు తీసుకునేందుకు కార్పొరేషన్‌ అధికారులు ముందుకు రావడం లేదు. నేటికి కనీసం నోటీసులు కూడా జారీ చేయలేదు. నగరపాలక సంస్థ రికార్డుల్లో కూడా టీడీపీ రాష్ట్ర కార్యాలయ భవనం లేదన్న విషయం, అదే విధంగా కార్పొరేషన్‌ స్థలాన్ని ఆక్రమించారన్న విషయం బహిరంగ రహస్యమే. అయినప్పటికీ కార్పొరేషన్‌ అధికారులు చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారోనని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top