ఎవరు.. ఎక్కడ!

TDP Leaders Conflicts on Party Tickets - Sakshi

అభ్యర్థుల ప్రకటనే తరువాయి

ఎన్నికల షెడ్యూలు నేపథ్యంలో రాజకీయపార్టీలో మొదలైన సందడి

అభ్యర్థుల ప్రకటన కోసం వైఎస్సార్‌సీపీ, టీడీపీలో ఆశావహుల ఎదురుచూపులు

టీడీపీలో మిగిలిన మూడుస్థానాలపై కూడా స్పష్టత

గుప్తా, శ్రావణి, సురేంద్రలకు గుంతకల్లు, శింగనమల, కళ్యాణదుర్గం స్థానాలు దాదాపు ఖరారు

రెండు రోజుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రకటన

తక్కువ సమయం ఉండటంతో నేటి నుంచి ఎన్నికల బరిలోకి ఆశావహులు

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఎన్నికల షెడ్యూలు వెలువడింది. నామినేషన్, పోలింగ్‌ తేదీలు ఖరారయ్యాయి. కానీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల విషయంలోనే స్పష్టత రావాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీతో పాటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా అభ్యర్థుల ప్రకటనపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరో వారం రోజుల్లో నామినేషన్ల ఘట్టం మొదలు కానుండటంతో రాజకీయ పార్టీలు త్వరగా అభ్యర్థుల అంశాన్ని తేలిస్తే ఎన్నికల యుద్ధానికి సన్నద్ధం కావొచ్చని ఆశావహులు అభిప్రాయపడుతున్నారు. అయితే రెండు పార్టీల్లో కూడా ఒకటి, రెండు స్థానాలు మినహా తక్కిన అన్ని స్థానాలకు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎవరు బరిలోకి దిగుతారనే స్పష్టత రాజకీయ పార్టీలతో పాటు ప్రజలకు కూడా ఉంది. అయినప్పటికీ అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు.

టీడీపీలో మిగిలిన మూడు స్థానాలకూ అభ్యర్థులు ఖరారు
తెలుగుదేశం పార్టీలో రెండు పార్లమెంట్‌ స్థానాలతో పాటు 11 అసెంబ్లీ స్థానాలపై ఆ పార్టీ అధిష్టానం ఇప్పటికేస్పష్టత ఇచ్చింది. మూడు స్థానాలను మాత్రమే పెండింగ్‌లో ఉంచింది. అయితే వీటిపై కూడా నిర్ణయం తీసుకున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. గుంతకల్లు నుంచి మధుసూదన్‌ గుప్తా, శింగనమల నుంచి బండారు శ్రావణి, కళ్యాణదుర్గం నుంచి అమిలినేని సురేంద్రబాబు బరిలో ఉండబోతున్నారని తెలిసింది. ఈ నిర్ణయంతో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు షాక్‌ అయ్యారు. హనుమంతరాయ చౌదరికి టిక్కెట్‌ రాకపోవడంతో ఆయన కుమారుడు మారుతి పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అధికారిక ప్రకటన వరకూ వేచి చూద్దామని చౌదరి ఆపినట్లు సమాచారం. గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌ కూడా ఇదే బాట అనుసరించనున్నారు. సిట్టింగ్‌ను, బీసీ సామాజిక వర్గానికి చెందిన తనను కాదని, గుప్తాకు ఇవ్వడం ఏంటని అధిష్టానాన్ని నిలదీసినట్లు తెలిసింది. తుదిజాబితాలో తన పేరు లేకపోతే ఆ రోజు సాయంత్రమే టీడీపీకి రాజీనామా చేస్తానని తేల్చి చెప్పినట్లు చర్చ జరుగుతోంది. అయితే శింగనమలలో శమంతకమణికి ఎమ్మెల్సీ ఇవ్వడంతో వీరు పార్టీలో జరిగే పరిణామాలను మౌనంగా పరిశీలిస్తున్నారు. యామినీబాలకు టిక్కెట్‌ రాకపోతే శ్రావణికి మాత్రం సహకరించకూడదనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

రెండురోజుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రకటన..
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. పార్టీ సమన్వయకర్తలుగా కొనసాగుతున్న వారికే దాదాపు టిక్కెట్‌ ఖరారయ్యే అవకాశం ఉంది. అయితే సామాజిక సమీకరణలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ఒకటి, రెండు చోట్ల మినహా పెద్దగా మార్పులేవీ ఉండకపోవచ్చని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. జిల్లాలో ఈ దఫా రాజకీయ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత, వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర, నవరత్నాల పథకాల ప్రకటనతో జిల్లాలో ‘ఫ్యాన్‌’ గాలి బలంగా వీస్తోంది. దీంతో జిల్లా ప్రజలు ఈ విడత ఎన్నికల ఫలితాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. ‘అనంత’ రాజకీయాల్లో హేమాహేమీలుగా పిలవబడేవారు, ఓటమి ఎరుగని నేతలుగా పేరున్న వారు, ఇప్పటి వరకూ టీడీపీ ఓటమి ఎరుగని స్థానాల్లో ఈ దఫా పరిస్థితి భిన్నంగా ఉండే అవకాశం ఉంది. దీంతో రెండు పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

నెలరోజుల పాటు టెన్షన్‌.. టెన్షన్‌
ఎన్నికలు ముగిసే వరకూ నెలరోజుల పాటు అభ్యర్థులు, ఆయా పార్టీల్లోని ద్వితీయ, మండల, గ్రామస్థాయి నేతలు, కార్యకర్తల్లో కూడా టెన్షన్‌ నెలకొంది. 4–5 విడతల్లో ఎన్నికలు ఉంటే ప్రచారానికి అభ్యర్థులకు ఎక్కువ సమయం ఉండేది. అయితే తొలి విడతలోనే ఎన్నికలు ఉండటంతో సరిగ్గా నెలరోజులు మాత్రమే గడువుంది. ఈ సమయంలోనే డబ్బు సేకరణ, అసంతృప్తుల బుజ్జగింపు, బూత్‌ కమిటీ సభ్యులను అప్రమత్తం చేయడం, ఓటరు జాబితాలో చేర్పులు, ప్రచారంతో పాటు ఎన్నికలకు అవసరమయ్యే అన్ని రకాల సరంజామాను సిద్ధం చేసుకోవాలి. దీనికి చాలా తక్కువ సమయం ఉండటంతో నేటి నుంచి జిల్లాలోని 14 నియోజకవర్గాల పరిధిలోని 63 పంచాయతీల్లో కూడా ఎన్నికల కోలాహలం మొదలవనుంది. ప్రచారం, ప్రలోభాలు, డబ్బు పంపిణీతో పాటు రకరకాల అంశాలతో ఎన్నికల సందడి కనిపించనుంది. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు ఈ నెల రోజుల పాటు అభ్యర్థులతో పాటు పార్టీ శ్రేణులు శతవిధాల ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top