ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు

Collector Veerapandian Press Meet on AP Elections - Sakshi

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వీరపాండియన్‌

అనంతపురం అర్బన్‌: సార్వత్రిక ఎన్నికలను ప్రశాంత వాతావరణలో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ తెలిపారు. ఆదివారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు, అసిస్టెంట్‌ కలెక్టర్‌ కె.ఎస్‌.విశ్వనాథన్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల నోటిఫికేషన్‌ ఈ నెల 18న జారీ చేస్తామన్నారు. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. నామినేషన్ల దాఖలుకు 25వ తేదీ ఆఖరన్నారు. 26వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుందన్నారు. ఉపసంహరణకు 28వ తేదీ ఆఖరు అన్నారు. ఏప్రిల్‌ 11న పోలింగ్‌ నిర్వహిస్తామని, మే 23న కౌంటింగ్‌ చేపడతామన్నారు.

కోడ్‌ అమలులోకి వచ్చింది
ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైనప్పటి నుంచి కోడ్‌ అమలులోకి వచ్చిందన్నారు. రాజకీయ పార్టీలు, పోటీ చేసే అభ్యర్థులకే కాకుండా అధికారులు, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలకు ఎన్నికల ప్రవర్తనా నియమాళి వర్తిస్తుందన్నారు. నియమావళి పకడ్బందీ అమలుకు జిల్లాలో 75 ఎంసీసీ (మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌) బృందాలను ఏర్పాటు చేశామన్నారు. నియోజకవర్గానికి రెండు చొప్పున 28 వీఎస్‌టీ(వీడియో సర్వైలెన్స్‌ టీం), నియోజకవర్గాకి మూడు చొప్పున 42 ఫ్లయింగ్‌ స్క్వాడ్లు, నియోజకవర్గానికి మూడు చొప్పున 42 ఎస్‌ఎస్‌టీ (స్టాటిక్‌ సర్వైలెన్స్‌ టీం)లు ఏర్పాటు చేశామన్నారు. అదే విధంగా ప్రతి అసెంబ్లీ నియోజవర్గం పరిధిలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఓటరు నమోదు ప్రక్రియ
నామినేషన్‌ ప్రక్రియ 25వ తేదీన ముగుస్తుందన్నారు. ఆ రోజు వరకు ఓటరు నమోదుకు ఫారం–6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అన్నింటినీ పరిశీలించి అర్హులైన వారికి ఓటు హక్కు కల్పిస్తామన్నారు. ఎన్నికల నాటికి వాటితో కలిపి తుది జాబితా ప్రకటిస్తామన్నారు. ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులు, సందేహాలు, సమాచారం కోసం 1950 కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేయవచ్చన్నారు. అదే విధంగా ‘సి–విజల్‌’ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ‘సి–విజిల్‌’ ఫ్లయింగ్‌ స్క్వాడ్, ఎంసీసీ బృందానికి అనుసంధానం చేసి ఉంటుందన్నారు. ఫిర్యాదు అందిన వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటారన్నారు.

‘సువిధ’ అప్లికేషన్‌ ద్వారా నామినేషన్లు
అభ్యర్థులు గతంలో మాదిరిగా నామినేషన్లను మాన్యువల్‌గా ఇవ్వడానికి వీలు లేదన్నారు. ఇందు కోసం ఎన్నికల కమిషన్‌ ప్రత్యేకంగా ‘సువిధ’ అప్లికేషన్‌ ప్రవేశపెట్టిందన్నారు. ఇందులో మూడు మాడ్యూల్స్‌ ఉంటాయన్నారు. ఒకటి అభ్యర్థుల కోసం, మిగిలిన రెండు మ్యాడ్యుల్స్‌ అధికారుల కోసం ఉంచారన్నారు. అభ్యర్థులు తమ నామినేషన్లు, ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఊరేగింపులు, వాహనాలు, సభల నిర్వహణ, ఇలా ప్రతి దానికీ సంబంధించి అనుమతులు ‘సువిధ’ అప్లికేషన్‌ ద్వారా పొందాల్సి ఉంటుందన్నారు.

ఆయుధాలు స్వాధీనం చేయాలి
ఎవరూ ఆయుధాలు కలిగి ఉండకూడదని, ఆయుధాలు ఉన్న వారు వాటిని తక్షణం దగ్గరలోని పోలీసు స్టేషన్‌లో స్వాధీనం చేయాలని ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌ తెలిపారు. ఎన్నికలు ప్రశాతంగా జరిగేందుకు అన్ని చర్యలు చేపట్టామని.. బైండోవర్, నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లపై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. సమాస్యాత్మక గ్రామాలను గుర్తించామని, ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక భద్రత కల్పిస్తున్నామన్నారు. ప్రచారంలో అనుమతి లేని వాహనాలను సీజ్‌ చేస్తామన్నారు. సభలు, ఊరేగింపులు, తదితరాలకు తప్పని సరిగా అనుమతి తీసుకోవాలన్నారు. ఓటర్లకు డబ్బులు, బహుమతుల పంపిణీ శిక్షార్హం అవుతుందన్నారు. ఎన్నికల కమిషన్‌ నిర్దేశించిన మొత్తం కంటే అధికంగా డబ్బు తీసుకెళితే అందుకు సంబంధించి రశీదు చూపాలన్నారు. లేనిపక్షంలో ఆ డబ్బును సీజ్‌ చేసి ట్రెజరీలో డిపాజిట్‌ చేస్తామన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top