సమరమే! | Election Date And Schedule Released | Sakshi
Sakshi News home page

సమరమే!

Mar 11 2019 10:01 AM | Updated on Mar 23 2019 8:59 PM

Election Date And Schedule Released - Sakshi

సాక్షి ప్రతినిధి, అనంతపురం: సార్వత్రిక సమరానికి కేంద్ర ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపింది. పార్లమెంట్‌ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసింది. తొలి విడతలోనే ఆంధ్రప్రదేశ్‌లోని 25 పార్లమెంట్‌ స్థానాలతో పాటు 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. షెడ్యూలు వెలువడటంతో జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ తక్షణమే అమల్లోకి వచ్చింది. దీంతో ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహించరాదు. కోడ్‌ ఉల్లంఘిస్తే ఎన్నికల నియమావళి ప్రకారం శిక్షార్హులవుతారు. వారిపై అనర్హత వేటు వేసే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా 7 విడతల్లో జరగనున్న ఎన్నికల్లో భాగంగా తొలి విడతలోనే ఏపీ పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. అంటే ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల గడువు మాత్రమే ఉంది. ఊహించని విధంగా తొలి విడతలోనే ఎన్నికలు ఉండటం, పోలింగ్‌కు తక్కువ సమయం ఉండటంతో ఎన్నికల షెడ్యూలు చూసి ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఉలిక్కిపడ్డారు.

అమల్లోకి వచ్చిన కోడ్‌
ఆదివారం సాయత్రం 5గంటల నుంచే ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది. దీంతో రాజకీయ పార్టీల నేతలకు సంబంధించిన విగ్రహాలకు ముసుగులు వేయడంతో పాటు వారికి సంబంధించిన ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించనున్నారు. ఎన్నికల బరిలో నిలిచే ప్రజాప్రతినిధులు ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాల్లోపాల్గొనకూడదు. ఎన్నికల ప్రచారం నిర్వహించే అభ్యర్థులు రాత్రి 10 గంటలకే మైకులు బంద్‌ చేయాలి. ఉదయం 6గంటల వరకూ మైకుల్లో ఎలాంటి ప్రచారం చేయకూడదు. దీన్ని అతిక్రమించినా కోడ్‌ ఉల్లంఘన కిందకు వస్తుంది. అలాగే అభ్యర్థులు పత్రికలకు ఇచ్చే యాడ్స్‌తో పాటు ఈ సారి సోషియల్‌ మీడియాలోని ప్రకటనలు కూడా ఎన్నికల వ్యయం కింద పరిగణించనున్నారు. అలాగే అభ్యర్థులు ఎన్నికల అఫిడవిట్‌లో సోషియల్‌ మీడియా అకౌంట్లు కూడా పొందుపరచాలి.

ఎన్నికలకు నెల రోజులే గడువు: ఏపీ, తెలంగాణలో తొలివిడతలో.. అది కూడా ఒకేదఫాలో ఎన్నికలు నిర్వహించనున్నారు. దీంతో అభ్యర్థులకు ప్రచారానికి, ఎన్నికలకు సిద్ధం కావడానికి తక్కువ సమయం ఉంది. ఈ నెల 17న ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ అయ్యే అవకాశం ఉంది. 18 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 25 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్లకు చాలా తక్కువ సమయం ఉంది. ఇప్పటి వరకూ ప్రధాన పార్టీలైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, తెలుగుదేశం పార్టీలు అభ్యర్థులపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో అభ్యర్థులను ప్రకటించడం, వారు నామినేషన్లకు సిద్ధం అయ్యేందుకు చాలా తక్కువ సమయం ఉంది. ఈ నెల 26వ తేదీ నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 28వ తేదీ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహకరించుకోవచ్చు. దీంతో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. ఏప్రిల్‌ 11న ఎన్నికలు ఉంటాయి. నామినేషన్‌ ప్రక్రియ ముగింపు రోజునకు, పోలింగ్‌కు 14రోజుల గడువు మాత్రమే ఉంటుంది.

వైఎస్సార్‌సీపీ, టీడీపీ మధ్యే పోటీ
జిల్లాలో అనంతపురం, హిందూపురం పార్లమెంట్‌ స్థానాలతో పాటు 14 అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి.  టీడీపీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మధ్యనే ప్రధాన పోటీ జరగనుంది. కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, జనసేన, లోక్‌సత్తా, బీఎస్‌పీ లాంటి పార్టీలు పోటీలో ఉన్నప్పటికీ ఈ పార్టీలు జిల్లాలో ఏ అసెంబ్లీ స్థానాల్లో కూడా గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో వైఎస్సార్, టీడీపీ పార్టీల మధ్య హోరాహోరి పోరు సాగనుంది. రెండు పార్టీల నుంచి బలమైన అభ్యర్థులు బరిలో ఉండే అవకాశం ఉండటంతో ఈ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement