ఓర్వలేక బరి తెగింపు

TDP Activists Attack On Volunteers In Srikakulam - Sakshi

సాక్షి, శ్రీకాకుళం: ఐదేళ్లలో ప్రజలకు నరకం చూపించారు. భౌతిక దాడులు చేశారు. హత్యలకు కూడా తెగబడ్డారు. ఇది చాలదన్నట్లుగా జన్మభూమి కమిటీలంటూ పేట్రేగిపోయారు. ఇంత జరిగినా సహనం తో ఎన్నికల వరకు జనమంతా వేచి చూశారు. ఆ తర్వాత దిమ్మ దిరిగినట్లుగా బుద్ధి చెప్పారు. కానీ వారి ఆలోచన తీరు మారలేదు. టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా జిల్లాల్లో ఉన్నత నేతల వరస ఏమీ మారలేదు. వలంటీర్లను అవహేళనచేస్తూ మాట్లాడిన చంద్రబాబు వ్యవహారంపై రాష్ట్ర వ్యా ప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆయన బాటలోనే జిల్లాలోని కొందరు నేతలు ఇంకా తామే అధికారంలో ఉన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. అటు అచ్చెన్న, కూన రవి తదితర అగ్రనేతలతో పాటు ద్వితీయ శ్రేణి కార్యకర్తలు కూడా బరితెగిస్తున్నారు. అధికారులను వదలడం లేదు. తలుపులేసి కొడతామంటూ బెదిరిస్తున్నారు. ఇప్పుడు వలంటీర్ల వంతు వచ్చినట్లుగా వారిపై ఎక్కడికక్కడ భౌతిక దాడులు, పరుష పదజాలాలతో వేధింపులు మొదలెట్టారు. దీంతో జిల్లాలో టీడీపీ నేతల అరాచకాలు తగ్గలేదంటూ జిల్లా వాసులు గగ్గోలు పెడుతున్నారు. వారికి తగిన బుద్ధి చెప్పాలంటూ జనం కోరుకుతున్నారు. 

తాజాగా మంగళవారం టెక్క లి మండలం చాకిపల్లిలో ఇద్దరు వలంటీర్లు కత్తుల కుమారస్వామి, జలుమూరు అప్పన్నలపై టీడీపీ నాయకులు మాజీ ఎంపీటీసీ పంగ వసంత్, మాజీ సర్పంచ్‌ పంగ తవిటయ్య, పంగ పెంటయ్యల బృందం భౌతిక దాడులకు దిగింది. పింఛన్ల పంపిణీ సమయంలో ఇద్దరు వలంటీర్లపై దాడులకు దిగారు. సముదాయిద్దామని మధ్యలోకి వచ్చిన కృష్ణ అనే వృద్ధుడిపై కూడా టీడీపీ నేతలు దారుణంగా దాడి చేశారు. సెల్‌ఫోన్లు పగులగొట్టారు.  

దాడులకు దిగారిలా.. 
∙సెప్టెంబర్‌ 9న టెక్కలి నియోజకవర్గం పాతనౌపడకు చెందిన గ్రామ వలంటీరుపై టీడీపీ కార్యకర్తలు మర్ధల సురేష్‌ తదితరులు భౌతిక దాడులు చేశారు. 
∙సెప్టెంబర్‌ 9వ తేదినే భామిని మండలం తాలాడ గ్రామంలో వలంటీర్లుగా పనిచేస్తున్న వారిపై టీడీపీ నేతలు వలరౌతు అచ్చుతరావు, వలరౌతు 

శివ తదితరులు కులం పేరుతో దూషించి, వాగ్వాదానికి దిగారు
► సెప్టెంబర్‌ 13న రాజాం పట్టణంలో వార్డు వలంటీర్లుగా పనిచేస్తున్న టి.శైలజ, జి.లావణ్య, కె.ఆదిలక్ష్మి, ఎ.నవ్యలపై 10వ వార్డు టీడీపీ నేత కాకర్ల సత్యనారాయణ దారుణంగా పరుషంగా వేధింపులకు దిగాడు. దీనిపై పోలీసులకు బాధిత వలంటీర్లు ఫి ర్యాదు చేయగా, మీ అంతు చూస్తా అంటూ వలంటీర్లపై బెదిరింపులకు దిగాడు. 
► సెప్టెంబర్‌ 21న రేగిడి మండలంలోని కొత్త చెలికానివలసలో వలంటీర్లపై తోట నాగభూషణం, తోట రామారావు, తోట జగన్‌ అనే వ్యక్తులు దూషణకు దిగారు. ఇందులో రామారావు వలంటీర్లపై దాడులకు ప్రయత్నించాడు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
► సెప్టెంబర్‌ 21నే పలాస పట్టణంలో ఉదయ పురం వార్డు వలంటీర్లు కొవ్వూరు లక్ష్మి, కొత్తపల్లి శోభారాణిలపై 22వ వార్డు టీడీపీ మాజీ కౌన్సిలర్‌ గాలి కృష్ణారావు దాడులకు పాల్పడ్డాడు.  
► అంతకుముందు ఇచ్ఛాపురంలో కూడా వలంటీర్లపై అక్కడి ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు దాడులకు దిగారు. 
ఇలా ఒకటి కాదు రెండు కాదు వలంటీర్లు ఆగస్టు 15 నుంచి విధుల్లోకి వస్తే.. ఇప్పటివరకు కనీసం పది మందిపై టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. గ్రామ/వార్డుల్లో ప్ర భుత్వ పథకాలను ముఖ్యంగా రేషన్‌  బియ్యం గా నాణ్యమైన బియ్యాన్ని ప్యాకెట్ల రూపంలో అందజేస్తున్న వలంటీర్లపై దాడులకు దిగుతున్నారు. ఈ దాడుల్లో మహిళలని కూడా చూడ కుండా తమ ఆక్రోశాన్ని ప్రదర్శిస్తున్నారు.  
అగ్ర నేతల వారసులుగా... 
‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా..’ అన్న చందంగా జిల్లాలో టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కోటబొమ్మాళి ఎంపీడీఓపై పరుష పదజాలం తో బెదిరింపులకు దిగిన సంగతి మర్చిపోక ముందే రాజధాని ప్రాంతంలో విధుల్లో ఉన్న ఐపీఎస్‌ అధికారి విక్రాంత్‌ పాటిల్‌పై ‘యూజ్‌లెస్‌ ఫెలో..’ అంటూ వార్నింగ్‌ ఇచ్చి జిల్లా పరువు తీశారు. 

అలాగే మరో అగ్ర నేత మాజీ విప్‌ కూన రవికుమార్‌ ఏకంగా సరుబుజ్జిలి ఎంపీడీఓను ఉద్దేశించి తలుపులేసి బాదేస్తా అంటూ ఒంటికాలితో లేచాడు. అయితే పోలీసులు కేసు నమోదు చేయడంతో పరారీలో ఉండి, ఇటీవలే ముందస్తు బెయిల్‌పై అజ్ఞాతం వీడారు. ఇంతటి ఘన చరిత్రతో టీడీపీ అగ్రనేతలు చెలాయిస్తుంటే వారి వెంటే ఉన్న ద్వితీయ శ్రేణి నేతలు తామేమీ తక్కువ కామంటూ వలంటీర్లపై దాడులకు దిగుతున్నారు. అలాగే గతంలో పనులు చేస్తామంటూ డబ్బులు దండుకున్న నేతలను ప్రశ్నిస్తున్న సామాన్యులపై కూడా బెదిరింపులు ఆపడం లేదు. అగ్రనేతలకు తామే వారసులమంటూ నిరూపించుకుంటున్నారు. దీనిపై జిల్లా వాసులంతా భగ్గుమంటున్నారు. వీరికి ఎన్నికల్లో తగిన శాస్తి జరిగినా ఏమాత్రం తగ్గడం లేదంటూ వాపోతున్నారు. 

తీరు మారదా.. 
జిల్లాలో టీడీపీ నేతల దౌర్జన్యాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ వారు దాడులకు దిగుతున్నారు. అలాగే గ్రామాల్లో ప్రభుత్వ పథకాలు అసలైన అర్హులకే ఇస్తున్నందున కడుపు మంటతో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఆఖరికి చిన్న చిన్న తగాదాలను సైతం గ్రామాల్లో రెచ్చగొడుతూ వైఎస్సార్‌సీపీకి అనుబంధంగా ఉన్న యువకులను సైతం టార్గెట్‌ చేస్తున్నారు. 
అధికారం కోల్పోయి నాలుగు నెలలు కావస్తున్నా ఇంకా అధికార దర్పం తగ్గడం లేదు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రోజుకో తీరులో ప్రవర్తిస్తున్న వైనంతో ఇక్కడ కూడా నాయకులు వ్యవహార శైలిని మార్చుకుంటున్నారు. ఇప్పటికే పది మందికి పైగా వలంటీర్లపై దాడులకు దిగిన తెలుగు తమ్ముళ్లు ఇక ముందు ప్రతి నెలా ఒక్కో నియోజకవర్గంలో టార్గెట్‌ చేసి దాడులకు పాల్పడతారని, ఇందుకోసం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 3 నుంచి వచ్చే నెల 30 వరకు గ్రామ సభలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా, దీన్ని వేదికగా చేసుకుని, వాగ్వాదాలకు దిగి వలంటీర్లుపై దాడులకు దిగొచ్చని సమాచారం. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top