తైక్వాండోలో నిధుల గోల్‌మాల్‌

taekwondo Funds Corruption In Anantapur - Sakshi

వైరల్‌ అవుతున్న కాల్‌ రికార్డులు

రూ. 40 నుంచి 50 లక్షల మేర నిధులు స్వాహా చేశారని ఆరోపణలు

అనంతపురం సప్తగిరి సర్కిల్‌: రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్‌లో నిధుల గోల్‌మాల్‌ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. శుక్రవారం వివిధ సామాజిక మాధ్యమాల్లో రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్‌ ట్రెజరర్‌ జగన్‌మోహన్‌(గుంటూరు) వాటిని వైరల్‌ చేయడంతో అది హాట్‌ టాపిక్‌గా మారింది. తైక్వాండో అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి అచ్యుత్‌రెడ్డి తన స్వార్థ ప్రయోజనాల కోసం అసోసియేషన్‌కు సంబంధించిన నిధులను పక్కదారి పట్టించారనే ఆరోపణలతో కూడిన కాల్‌ రికార్డులను ఆయన బహిర్గతం చేశారు. దీంతో ఆయా క్రీడాకారులకు అందించాల్సిన కనీస సౌకర్యాలను, వారికి అందించాల్సిన క్రీడా దుస్తులను సైతం అందించకుండా మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఆరోపణలు ఇలా...
అచ్యుత్‌రెడ్డి 2006 నుంచి రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్‌కు కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. జగన్‌మోహన్‌తో కలిసి అచ్యుత్‌రెడ్డి సంయుక్త బ్యాంకు ఖాతాను తెరిచారు. అయితే తన ప్రమేయం లేకుండానే అచ్యుత్‌రెడ్డి నిధులను వాడుకున్నారని జగన్‌మోహన్‌ ఆరోపిస్తున్నారు. గతేడాది ఫిబ్రవరిలో నిర్వహించిన జాతీయస్థాయి టోర్నీకి రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) రూ. 10 లక్షల నిధులను కేటాయించిందని దానికి సంబంధించి ఎలాంటి లావాదేవీలు తన దృష్టికి రాలేదన్నారు. అసోసియేషన్‌ ఖాతాను తన వ్యక్తిగత ఖాతాగా మార్చుకుని కార్యకలాపాలు సాగిస్తున్నారని విమర్శించారు. గత పదేళ్లుగా ఇలాంటి కార్యకలాపాలను కొనసాగిస్తున్నారన్నారు.

జిల్లా అసోసియేషన్లకు బెదిరింపులు
ఆయా జిల్లాల్లో కొనసాగుతున్న అసోసియేషన్లలో తనకు విరుద్ధంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా జిల్లా అసోసియేషన్లకు అఫ్లియేషన్‌ను రద్దు చేస్తామని బెదిరింపు చేస్తున్నారని, దీంతో ఆయా సంఘాల ప్రతినిధులు ఆయన పై ఎలాంటి చర్యలు తీసుకునేందుకు ముందుకు రావడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అచ్యుత్‌రెడ్డి విధానాల వల్లనే అసోసియేషన్‌ నాలుగు విభాగాలుగా చీలిందని అంటున్నారు.

క్రీడాకారులకు అవకాశాలు నిరాకరణ
ఆయా జిల్లా అసోసియేషన్లలో శిక్షణ తీసుకుంటున్న క్రీడాకారులకు జిల్లాస్థాయి టోర్నీల్లో ఆడేందుకు అవకాశాన్ని అచ్యుత్‌రెడ్డి నిరాకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. గత నెలలో కడపలో జరిగిన టోర్నీలో కర్నూలు స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(సాయి) క్రీడాకారులకు అవకాశం కల్పించలేదు. దీంతో ఆయా క్రీడాకారులు జిల్లా కలెక్టర్‌ను సైతం ఆశ్రయించారు. దీంతో ఆయన ఆయా జిల్లాల క్రీడా ప్రాధికార సంస్థకు సమాచారాన్ని అందించి వారిని ఆడించేందుకు అవకాశాన్ని తీసేస్తున్నామని ఆయన రాత పూర్వకంగా నివేదికలను పంపారు. దీంతో కడప జిల్లాకు చెందిన అల్తాఫ్‌ హుస్సేన్‌ అనే క్రీడాకారుడు డిక్లరేషన్‌ను సమర్పించుకోవాల్సి వచ్చింది. తాను తదుపరి స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ప్రాతినిధ్యం వహించనని, ఏ ఇతర అసోసియేషన్ల నుంచి ప్రాతినిధ్యం వహించనని రూ. 10 బాండు మీద రాయించుకున్నారు. ఈ వ్యవహారంపైన ఆయా సంఘాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top