మస్తుగా ఇసుక! 

Supply Of Sand Widely In Vizianagaram District - Sakshi

జిల్లాలో విస్తృతంగా ఇసుక సరఫరా 

ఊపందుకుంటున్న భవన నిర్మాణాలు 

కళకళలాడుతున్న స్టాక్‌ పాయింట్లు, రీచ్‌లు 

ఇప్పటి వరకూ 134577 టన్నుల సరఫరా 

కార్మికులకు కావలసినంత పని లభ్యం 

ఆదివారం ఒక్కరోజే  973 టన్నుల విక్రయం 

సాక్షి ప్రతినిధి విజయనగరం: వర్షాలు విస్తారంగా కురవడంతో వచ్చిన వరదల కారణంగా నదుల్లో ఇసుక తవ్వకాలకు అంతరాయం కలిగింది. అంతేగాకుండా సరఫరాలో పారదర్శకత ఉండాలనీ... ఎలాంటి అక్రమాలకు తావుండకూడదనీ కొత్తగా ఇసుక పాలసీ తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో సరఫరాలో కాస్తంత అతరాయం జరిగింది. దీనిని రాజకీయ అస్త్రంగా వాడుకోవాలని విపక్షం చూసింది. ఇదేదో ఘోర వైఫల్యం అన్నట్టు ఆందోళనలకు... విమర్శలకు తెరతీసింది. కానీ అనూహ్యంగా వారి కుట్రలను భగ్నం చేస్తూ విరివిగా రీచ్‌లు ప్రారంభించి... అవకాశం ఉన్న చోట స్టాక్‌ పాయింట్లు ఏర్పాటు చేసి కావలసినంత ఇసుక అందుబాటు ధరకు సరఫరా చేయడంతో వారి గొంతులో ఇప్పుడు పచ్చివెలక్కాయ పడినట్టయింది. గత నెల 15న ఇసుక వారోత్సవాల పేరుతో జిల్లాలో ఇసుక సరఫరా మొదలుపెట్టారు.

ప్రారంభంలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నవారికి ఇసుక అందించేవారు. ఇప్పుడిక ఆన్‌లైన్లో దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఇసుక అందుబాటులోకి రావడంతో ఆఫ్‌లైన్లోనే అందిస్తున్నారు. పంచాయతీ సెక్రటరీలకు నగదు చెల్లించి ఇసుక తీసుకువెళ్లే వెసులుబాటు కల్పించారు. ట్రాక్టర్‌ ఇసుక ఇసుక రేటు, లేబర్‌ చార్జీలతో కలుపుకుని దాదాపు రూ.1600 వరకూ ఉంది. వాహనాన్ని వినియోగదారుడే తీసుకువెళితే ఈ రేటు. లేదంటే వాహనం అద్దెను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

రీచ్‌లలో తవ్వకాల జోరు.. 
జిల్లాలో మొత్తం 76 ఇసుక రీచ్‌లుండగా వీటిలో 60 రీచ్‌లను తెరిచారు. ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ 1,34,577.25 టన్నుల ఇసుక సరఫరా చేశారు. డెంకాడ స్టాక్‌యార్డ్‌ నుంచి ఇప్పటి వరకూ 3156.5 టన్నులు, బొబ్బిలి స్టాక్‌యార్డ్‌ నుంచి 400 టన్నులు డెంకాడ పట్టాభూమి నుంచి 9014 టన్నులు ఇసుక విక్రయించారు. ఆదివారం ఒక్కరోజే 974 టన్నుల ఇసుకను వినియోగదారులకు అందించారు. డెంకాడ పట్టాభూముల్లో ఇసుక విక్రయాలు ఆదివారంతో ముగిశాయి. అక్కడే మరో 20వేల టన్నుల ఇసుక త్వరలోనే అందుబాటులోకి రానుంది. అధికారులు ఇప్పటికే భూమిని పరిశీలించి ప్రభుత్వ అనుమతికోసం నివేదిక పంపించారు. 

నిర్మాణానికి ఇక కొరత ఉండదు 
నిర్మాణ పనులకు ఇసుక కొత లేకుండా అవసరమైన మేరకు లభ్యతను బట్టి వినియోగదారులకు అందిస్తున్నాం. ప్రారంభంలో కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయి. రేవులకు వెళ్లేందుకు అప్రోచ్‌ రోడ్లు కూడా లేవు. కానీ ఇప్పుడు ఆ సమస్యలన్నిటినీ అదిగమించాం. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడానికి పోలీస్, రెవిన్యూ, గనుల శాఖలతో మూడు చెక్‌పోస్టులు కూడా నడుపుతున్నాం. ఇకపై ఇసుకకు ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. 
– డాక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్, కలెక్టర్, విజయనగరం జిల్లా   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top