వెలవెలబోతున్న నాపరాతి గనులు

Stone mines Loss With Lockdown Kurnool - Sakshi

మూతపడిన పాలిష్‌ ఫ్యాక్టరీలు   

ఉపాధి కోల్పోయిన 55 వేల మంది కూలీలు

ప్రభుత్వ ఆదాయానికి రోజూ రూ. 10 లక్షలు గండి

కోవెలకుంట్ల/బేతంచెర్ల: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా(కోవిడ్‌–19) వైరస్‌తో నాపరాతి, గ్రానైట్‌ పరిశ్రమలు కుదేలవుతున్నాయి. పరిశ్రమలను నిర్వహిస్తున్న యజమానులు తీవ్ర నష్టాలను చూస్తున్నారు. వేలాది మంది కూలీలు పనుల్లేక ఇంట్లో ఉన్నారు. బనగానపల్లె నియోజకవర్గంలోని కొలిమిగుండ్ల, అవుకు, బనగానపల్లె, సంజామల మండలాల్లో సుమారు 12 వేల హెక్టార్లలో నాపరాతి గనులు విస్తరించి ఉన్నాయి. అవుకు, కొలిమిగుండ్ల మండలాల్లో 500 చొప్పున పాలిష్‌ ప్యాక్టరీలు ఉన్నాయి. గనులు, ఫ్యాక్టరీల్లో దాదాపు 50 వేల మంది కూలీలు పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. అలాగే బేతంచెర్ల, బుగ్గానిపల్లె, హెచ్‌. కొట్టాల, ఆర్‌ఎస్‌ రంగాపురం గ్రామాల్లో   500 వరకు నాపరాళ్ల, పాలిష్‌ పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో 5 వేల మందికి ఉపాధి లభిస్తోంది. 

ఉపాధి కోల్పోయిన కూలీలు..
కరోనా వైరస్‌ కారణంగా గనులు, ఫ్యాక్టరీలు మూత పడటంతో పదిహేను రోజుల నుంచి ఇందులో పనిచేస్తున్న కూలీలకు ఉపాధి కరువైంది. గృహ నిర్మాణానికి అవసరయ్యే అన్ని రకాల నాపరాతి రాళ్లు ఇక్కడ దొరుకుతాయి. జిల్లాతో పాటు అనంతపురం, వైఎస్సార్‌ జిల్లా వాసులు ట్రాక్టర్లు, లారీల ద్వారా వీటిని తీసుకెళ్తుంటారు. పనులు నిలిచిపోవడంతో గనుల్లో పనిచేసే వారితోపాటు లారీలు, ట్రాక్టర్లలో రాళ్లను లోడింగ్, అన్‌లోడ్‌ చేసే కూలీలకు పనిలేకుండా పోయింది.

ప్రభుత్వ ఆదాయానికి గండి
నాపరాతి గనులు, ఫ్యాక్టరీలనుంచి రాళ్లను వివిధ ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాల్సి ఉంది. ట్రాక్టర్‌కు రూ. 500, లారీకి రూ. 3 వేల ప్రకారం ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాల్సి ఉంది. ప్రతి రోజు 500 నుంచి 600 వరకు ట్రాక్టర్లు, లారీలు గనుల నుంచి రాళ్లను తరలిస్తున్నాయి. ఈ ప్రకారం రోజుకు ప్రభుత్వానికి రూ. 5 లక్షల చొప్పున రాయల్టీ చెల్లించాల్సి ఉంది. పనులు నిలిచిపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడింది.

ఇబ్బందులు పడుతున్నాం
పది హేను రోజుల నుంచి నాపరాతి గనుల్లో పనులు నిలిచిపోయాయి. రోజూ పనికి వెళితేనే పూట గడవటం కష్టంగా ఉంది. పనులు లేకపోవడంతో ఇళ్ల వద్ద ఖాళీగా ఉండాల్సి వస్తోంది.  – శంకర్, గని కార్మికుడు, నాయినిపల్లె, కొలిమిగుండ్ల మండలం  

తీవ్రంగా నష్టపోతున్నాం
పరిశ్రమలు మూతపడడంతో తీవ్రంగా నష్టపోతున్నాం. కార్మికులు ఉపాధి కోల్పోయారు. ప్రత్యేక దృష్టితో నాపరాతి పరిశ్రమలకు తోడ్పాటు అందించాలి. లేదంటే గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది.  
– గౌరి హుసేన్‌రెడ్డి,ఫ్యాక్టరీ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top