ఇస్మార్ట్‌ సిటీ దిశగా శ్రీకాకుళం

Srikakulam Has Been Moving Towards Smart City - Sakshi

స్మార్ట్‌ సిటీ దిశగా శ్రీకాకుళం పరుగులు పెట్టనుంది. అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన 13 నగరాల్లో చిక్కోలుకు స్థానం దక్కడంతో హర్షం వ్యక్తమవుతోంది. టీడీపీ హయాంలో స్మార్ట్‌ సిటీ అంటూ హడావుడి చేసినా నిధులు విడుదల చేయకపోవడంతో మాటలకే పరిమితమైంది. పది రోజుల క్రితం పరిశీలన కోసం ముగ్గురు అధికారుల బృందాన్ని పంపిన ప్రభుత్వం.. వారి నివేదిక ఆధారంగా వెనువెంటనే నిర్ణయం తీసుకుంది. స్మార్ట్‌ సిటీ పథకం అమలైతే శ్రీకాకుళం నగరంతోపాటు విలీనం కానున్న ఏడు పంచాయతీలు కూడా అభివృద్ధి పథంలో నడుస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

సాక్షి, శ్రీకాకుళం : ప్రతి ఏటా రూ.90 కోట్లతో అభివృద్ధి పనులు.. మూడేళ్లలో రూ.270 కోట్లు వెచ్చించి శ్రీకాకుళం నగరాభివృద్ధి.. ఇదీ గత ప్రభుత్వం ఆర్భాటంగా చేసిన ప్రకటన. వాస్త వం మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉం ది. స్మార్ట్‌ సిటీ పథకంలో ప్రజలకు సౌకర్యాలను కల్పించే పనులను అంతంతమాత్రంగానే చోటు కల్పించారు. ఏడు రోడ్లు కూడలి నుంచి నవభారత్‌ జంక్షన్‌ వరకు ఉన్న రోడ్డు ను విస్తరించే పనులను చేపట్టారు. సుమారు రూ.2 కోట్ల విలువైన పనులను కాంట్రాక్టర్‌తో జరిపించారు. అతనికి చెల్లింపులు మాత్రం రూ.50 లక్షల వరకు మాత్రమే జరిగింది.

అలాగే ఆదివారపు పేట నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు ఉన్న నాగావళి నది గట్టునకు రిటైనింగ్‌ వాల్‌ నిర్మించి అక్కడ రూ.8 కోట్లతో పార్కును నిర్మించేందుకు కూడా అంచనాలు రూపొందించారు. ఇవన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. అక్కడ కూడా కాంట్రాక్టర్‌తో కొద్దిపాటి పనిచేయించి రూ.20 లక్షల వరకు బిల్లును చెల్లించారు. సకాలంలో బిల్లులు ఇవ్వపోవడంతో కాంట్రాక్టర్లు పనులను నిలిపివేశారు. రూ.90 కోట్లతో తొలి ఏడాది పనులు చేపడతామని ప్రకటించినా కనీసం రూ.9 కోట్ల పనులను కూడా చేపట్టలేదు. జరిగిన రూ.3 కోట్ల పనుల్లో రూ.కోటి వరకు మాత్రమే బిల్లు చెల్లింపులు జరిగాయి. ఇలా స్మార్ట్‌ సిటీ పథకాన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది.  

పది రోజుల్లోనే నిర్ణయం  
ప్రస్తుత ప్రభుత్వం స్మార్ట్‌ సిటీ పథకంపై పది రోజుల్లోనే ఓ నిర్ణయాన్ని తీసుకుంది. రివర్స్‌ టెండరింగ్‌ కోసం అన్ని కాంట్రాక్టు పనులను నిలిపివేయాలని ఆదేశించిన ప్రస్తుత ప్రభుత్వం స్మార్ట్‌ సిటీ పథకం పరిశీలన కోసం పది రోజుల క్రితం ముగ్గురు అధికారుల బృందాన్ని పంపిన విషయం పాఠకులకు తెలిసిందే. వారు నగరంలో విస్తృతంగా పర్యటించి మునిసిపల్‌ అధికారులు, ఉడా అధికారులతో చర్చించి నగర ప్రజలకు అవసరమైన పనులను గుర్తించారు. గత ప్రభుత్వ హయాంలో స్మార్ట్‌ సిటీ పథకం ద్వారా ఏయే పనులను చేయాలనుకున్నారో, అవి ఏ స్థాయిలో ఉన్నాయో, అవి ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడతాయో తెలుసుకొని అన్ని వివరాలతో ఐదు రోజుల క్రితం ప్రభుత్వానికి నివేదించారు.

దీనిని పరిశీలించిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్, మునిసిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రెండు రోజుల క్రితం మునిసిపల్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ సమీక్షించారు. అందులో త్రిసభ్య కమిటీ నివేదించిన పనులపై చర్చించారు. ముఖ్యంగా రోడ్లు, కాలువలు, తాగునీరు తదితర సమస్యలతోపాటు పార్కుల అభివృద్ధి, ఇతర ప్రజా సౌకర్యాల కల్పనపై దృష్టి సారించాలని ఇంజినీరింగ్‌ అధికారులకు సూచించారు. తక్షణం అవసరమైన పనులను తొలిదశలో చేపట్టాలని ఆదేశించారు.

మొత్తం 13 స్మార్ట్‌ సిటీలకు ఐదేళ్లలో రూ.5,183 కోట్లు అవసరమవుతాయని అంచనా రూపొందించగా శ్రీకాకుళం నగరానికి రూ.350 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకు కేటాయించవచ్చని మునిసిపల్‌ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం మునిసిపల్‌ ఇంజినీరింగ్‌ అధికారులు రోడ్లు, కాలువల నిర్మాణం, మరమ్మతులు, ప్రధాన కాలువల నిర్మాణం, పాడైపోయిన పార్కులు, తదితర వాటిని పరిశీలించి అంచనాలు రూపొందించడంలో నిమగ్నమయ్యారు. స్మార్ట్‌ సిటీ పథకం గురించి అధికారికంగా ఉత్తర్వులు వెలువడిన వెంటనే పనులను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top