పాలకవర్గం లేకుండా పదేళ్లు! 

Srikakulam Facing Administration Problem From 10 Years - Sakshi

కార్పొరేషన్‌ ఎన్నికలు నిర్వహించలేకపోయిన ప్రభుత్వాలు

పదేళ్లుగా పాలకవర్గం లేని శ్రీకాకుళం 

నగరపాలకసంస్థ నిధులు కూడా సక్రమంగా రాని వైనం

సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళం నగరపాలక సంస్థకు పదేళ్లుగా కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాలు ఎన్నికలను నిర్వహించలేకపోయాయి. మునిసిపాలిటీ స్థాయి నుంచి కార్పొరేషన్‌ స్థాయికి ఎదిగిన శ్రీకాకుళం నగరపాలకసంస్థ పదేళ్లుగా పాలకవర్గం లేకుండా ప్రత్యేకాధికారుల పాలనలోనే కొనసాగుతోంది. రాజ్యాంగం ప్రకారం ఇంత సుదీర్ఘకాలం పాటు ఎన్నికలు జరపకుండా ఉండకూడదు. అయితే ప్రభుత్వాలు దీనిని అధిగమించేందుకు పక్కదారులు పడుతూ కోర్టుల్లో కేసులు వేయిస్తూ కాలం వెళ్లదీస్తూ వచ్చాయి. 2010లో పాలకవర్గం కాలపరిమితి ముగిసిన తర్వాత అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉండడంతో ఎన్నికలు నిర్వహించడంలో తాత్సారం చేస్తూ వచ్చింది.

ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం సైతం అన్ని మునిసిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించినా శ్రీకాకుళం నగరపాలకసంస్థకు ఎన్నికలు నిర్వహించలేదు. కోర్టు కేసును సాకుగా చూపించి ఎన్నికలు వాయిదా వేస్తూ వచ్చారు. నిజానికి కోర్టులో కేసి వేసింది తెలుగుదేశం సానుభూతిపరులే కావడం గమనార్హం. నగరపాలకసంస్థలో పంచాయతీలను విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు సర్పంచ్‌లు కోర్టును ఆశ్రయించారు. ఈ కారణంగా ఎన్నికలను వాయిదా వేస్తూ వచ్చారు. అటు తర్వాత దేనినైతే సర్పంచ్‌లు వ్యతిరేకించారో అదే పనిని తెలుగుదేశం పూర్తి చేసింది. అంతకుముందే పంచాయతీలను కార్పొరేషన్‌లో విలీనం చేయడానికి కోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తక్షణం ఎన్నికలు నిర్వహించాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది.

పలు సర్వేల్లో అధికార పార్టీకి వ్యతిరేకత ఉందని తేలడంతో కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేసింది. కోర్టు ఆగ్రహించినప్పుడల్లా డివిజన్ల ఏర్పాటు అంటూ ఒకసారి, ఓటర్ల జాబితా తయారీ అంటూ మరోసారి హడావుడి చేస్తూ ప్రభుత్వం తాత్సారం చేసింది. ఇలా పాలకవర్గం లేకపోవడం వలన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధుల రాబట్టేవారే లేకుండాపోయారు. కొంతమంది ఉద్యోగుల్లో కూడా జవాబుదారీతనం కొరవడింది. ప్రజాప్రతినిధులు సైతం కార్పొరేషన్‌కు నిధులు మంజూరు చేయించాలన్న ప్రయత్నమే చేయకపోవడంతో పదేళ్లుగా అభివృద్ధి కుంటుపడింది. దీనిపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top