పోలీస్‌స్టేషన్‌పై దాడి హేయమైన చర్య

SP PHD Rama Krishna Responed Attack on Police Station - Sakshi

13 మంది నిందితుల అరెస్ట్‌

ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ

గూడూరు: రాపూరు పోలీస్‌స్టేషన్‌పై దాడి హేయమైన చర్య అని ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ పేర్కొన్నారు. ఈ విషయమై కొన్ని చానళ్లలో వాస్తవాలు చూపకుండా వక్రీకరించారని తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ వీఎస్‌ రాంబాబుతో కలసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. రాపూరుకు చెందిన జోసఫ్‌ అనే వ్యక్తి సుబ్బరాయులుకు గతంలో రూ.2వేలు ఇచ్చి ఉన్నారని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం జోసఫ్‌ భార్య దీనమ్మ అతని వద్దకు వెళ్లి నగదు ఇవ్వాలని కోరగా అతను ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడన్నారు. ఈ క్రమంలో జోసఫ్‌ బుధవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ నిమిత్తం పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారన్నారు.

అతనుతో పాటు కొందరు మద్యం సేవించి ఉండగా వారిని బయటే ఉండాలని పోలీసులు సూచించారని తెలిపారు. పోలీసులను మద్యం తాగి దూషిస్తున్న పెంచలయ్య అనే వ్యక్తిని పరీక్ష నిమిత్తం హాస్పిటల్‌కు తీసుకెళ్లారన్నారు. దీంతో ఏదో జరుగుతున్నట్లు వక్రీకరించి కొందరు దళితవాడలోని ప్రజలను రెచ్చగొట్టే విధంగా సమాచారం ఇవ్వడంతో కాలనీ నుంచి కొంతమంది పోలీస్‌స్టేషన్‌ వద్దకు వచ్చి దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ సమయంలో పోలీసులు సంయమనం పాటించారే తప్ప వారిపై ఎలాంటి దాడి చేయలేదని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో ఎం.పిచ్చయ్య, కె.రమేష్, రంగయ్య, జార్జి, ఎం.వేమయ్య, ఆర్‌.రాజేష్‌. ఎం.లక్ష్మి, ఎం.పెంచలమ్మ, వరలక్ష్మి, పి.కనకమ్మ, ఆర్‌.పెంచలమ్మ, ఆర్‌.హైమావతితో పాటు రాపూరు గ్రామ సర్పంచ్‌ భర్త తుమ్మలపల్లి మధుసూదన్‌రావు ప్రమేయం ఉందని అరెస్ట్‌ చేసి కోర్టుకు హాజరు పరిచామన్నారు.

దాడి అమానుషం
గూడూరు రూరల్‌:  పోలీసు స్టేషన్‌లోకి చొరబడి సిబ్బందిపై దాడి చేయడం అమానుష చర్య అని ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ పేర్కొన్నారు. గూడూరు రూరల్‌ పోలీసు స్టేషన్‌ను గురువారం ఆయన తనిఖీ చేశారు. రాపూరు పోలీసు స్టేషన్‌పై అక్కడి దళితులు బుధవారం రాత్రి దాడి చేసి ఎస్సై, సిబ్బందిని గాయపరిచారు. ఈ విషయంపై ఎస్పీ మాట్లాడుతూ పోలీసు స్టేషన్‌పై దాడికి పాల్పడిన వారిలో 30 మందిని గుర్తించామన్నారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఇరువర్గాలను పిలిచి రాపూరు ఎస్సై లక్ష్మణరావు మాట్లాడుతుండగా ఓ వర్గానికి చెందిన వ్యక్తి మద్యం సేవించి కానిస్టేబుల్‌తో గొడవకు దిగాడన్నారు. గొడవకు దిగిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోగా అతనికి సంబంధించిన బంధువులు ఒక్కసారిగా మూకుమ్మడిగా పోలీసు స్టేషన్లోకి చొరబడి విచక్షణారహితంగా ఎస్సై, సిబ్బందిపై దాడికి తెగబడ్డారన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ  తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top