హవ్వ..ఇది విన్నారా?

SP Grievance Applications Solved 90Percent In Prakasam - Sakshi

మీకోసం సమస్యలు 98 శాతం పరిష్కరించారట!

గడిచిన నాలుగేళ్లలో 510 సమస్యలు మాత్రమే పెండింగట

ప్రతి సోమవారం గ్రీవెన్స్‌ క్యూకడుతున్న వందల మంది బాధితులు

ఒంగోలు అర్బన్‌: జిల్లా అధికారులు ఆశ్చర్యపోయే లెక్కలు చెబుతున్నారు. గడిచిన నాలుగేళ్లలో ప్రతి సోమవారం కలెక్టర్‌ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించే గ్రీవెన్స్‌ సమస్యలు ఇప్పటి వరకూ 98 శాతం పరిష్కరించామని అధికారిక లెక్కలు చెబుతుండటంపై విస్మయం కలిగిస్తోంది. ప్రజల సమస్యలు, అవసరాల కోసం రోజుల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లేకపోవడంతో జిల్లా ప్రజలు ప్రతి సోమవారం కలెక్టర్‌ ఆధ్వర్యంలో నిర్వహించే గ్రీవెన్స్‌కు హాజరవుతున్నారు. సంబంధిత సమస్యలపై ఫిర్యాదు చేస్తే ఫలితం ఉంటుందని ఆశించి మీకోసం కార్యక్రమానికి ప్రజలు పరుగులు పెడుతున్నారు. అన్నీ శాఖల జిల్లా అధికారులు అక్కడే ఉంటారని, సమస్యల పరిష్కారం త్వరితగతిన జరుగుతుందని వృద్ధులు, వికలాంగులు, మహిళలు ఇలా అన్నీ వర్గాల ప్రజలు జిల్లా నలుమూలల నుంచి వస్తుంటారు. మీకోసంలో ప్రజలు ఇచ్చే అర్జీలకు సంబంధించి ఫిర్యాదులన్నీ క్షేత్రస్థాయిలో పరిష్కారం అవుతున్నాయా..అనేది అనుమానామే. ప్రతి సోమవారం నిర్వహించే మీకోసం లో రెండో సారి, మూడో సారి అర్జీలు ఇస్తున్నామని బాధితులు ప్రత్యక్షంగానే తెలుపుతున్నారు. దీని ఆధారంగా ప్రజా ఫిర్యాదులు ఏ స్థాయిలో పరిష్కారం అవుతున్నాయో అర్థమవుతోంది.

ఇవీ.. అధికారుల లెక్కలు
2014 నుంచి గ్రీవెన్స్‌కు అందిన 47008 ప్రజా ఫిర్యాదుల్లో 46498 సమస్యలు పరిష్కరించి 98.92 శాతం పూర్తి చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.  అంతేకాకుండా ఈ నాలుగేళ్లలో పరిష్కరించాల్సినవి కేవలం 510 మాత్రమే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. లెక్కల వరకు బాగానే ఉన్నా ఫిర్యాదుల పరిష్కారం మాత్రం కాగితాలకే పరిమితమవుతోంది తప్ప పరిష్కారానికి నోచుకోవడం లేదనేది గ్రీవెన్స్‌లో పదేపదే ఒకే సమస్యపై వచ్చే బాధితులను చూస్తే అర్థమవుతోంది. మీకోసంలో వచ్చే ఫిర్యాదుల్లో ఎక్కువ భాగం భూ సమస్యలు, ఆన్‌లైన్‌ తప్పిదాలు, అక్రమాలు, పట్టాదారు పాస్‌ పుస్తకాలు, ఇళ్లు, ఫించన్ల కోసం జిల్లాలోని నలుమూలల నుంచి ప్రజలు మీకోసంలో అర్జీలు సమర్పిస్తుంటారు. పలు సందర్భాల్లో తమ సమస్యలు తీరలేదని ఆత్మహత్యాయత్నాలు జరిగిన సంఘటనలూ ఉన్నాయి.

మీకోసంలో కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్, డీఆర్‌ఓ ఇలా ముఖ్య అధికారులకు ఫిర్యాదులు ఇచ్చిన వెంటనే సంబంధిత శాఖ జిల్లా అధికారి లేక ఇతర అధికారులకు సమస్యను తెలిపి పరిష్కరించాలంటున్నారే తప్ప ఆ సమస్యలు ఆయా మండలాల వారీగా, గ్రామాల వారీగా నిజంగానే పరిష్కారం అవుతున్నాయా లేదా అనేది ఉన్నతాధికారులు పట్టించుకోక పోవడంతో సమస్యలు క్షేత్ర స్థాయిలో పరిష్కారం కావడం లేదు. ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరిగి అలసిపోయిన ప్రజలు మిన్నకుండిపోతున్నారు. కేవలం సంబంధిత అధికారులకు సమస్యలను చేరవేసి పరిష్కారం అవుతున్నాయని లెక్కలు చూపడంపై విమర్శలున్నాయి. ఇప్పటికైనా మీకోసంకు వచ్చే సమస్యల పరిష్కారంపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ చూపి క్షేత్రస్థాయిలో ప్రజా ఫిర్యాదులను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. సమస్యల పరిష్కారాలపై నిత్యం సమీక్షలు నిర్వహిస్తూ ఫిర్యాదుదారులతో మాట్లాడుతూ పారదర్శకంగా చిత్తశుద్ధితో చేయాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top