తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలకు అందుబాటులోకి తీసుకోచ్చేందుకు భీమవరంలో ఏర్పాటు చేసిన పాస్‌పోర్టు
భీమవరం టౌన్ : తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలకు అందుబాటులోకి తీసుకోచ్చేందుకు భీమవరంలో ఏర్పాటు చేసిన పాస్‌పోర్టు కార్యాలయాన్ని త్వరలో ప్రారంభిస్తామని పార్లమెంటు సభ్యులు గోకరాజు గంగరాజు తెలిపారు. శనివారం భీమవరం డీఎన్‌ఆర్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన పాస్‌పోర్టు మేళాను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ పాస్‌పోర్టు కార్యాలయం విషయమై ఇటీవల విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌ను కలిసి మాట్లాడినట్టు తెలిపారు. రాజ్యసభ సభ్యులు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ మన పెద్దలు పాస్‌పోర్టు కోసం మద్రాసు వెళ్లేవారని, ఇప్పుడు భీమవరంలో పాస్‌పోర్టు కార్యాలయం ప్రారంభిస్తామన్నారు.
ఎమ్మెల్యేలు పుల పర్తి రామాంజనేయులు, కలవపూడి శివ మాట్లాడారు. పాస్‌పోర్ట్ అధికారి ఎల్‌ఎన్‌పి. చౌదరి మాట్లాడుతూ ఏజెంట్లను నమ్మి జేబులు ఖాళీ చేసుకోవద్దని దరఖాస్తుదారులకు సూచిం చారు. ఆదివారం కూడా ఈ మేళాను నిర్వహిస్తున్నామన్నారు. మున్సిపల్ చైర్మన్ కొటికలపూడి గోవిందరావు, డీఎన్నార్ కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు గోకరాజు వెంకటనర్శింహరాజు, గాదిరాజు సత్యనారాయణరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ, గోకరాజు రామరాజు, ప్రిన్సిపాల్ పి. రామకృష్ణంరాజు, పోత్తూరి ఆంజనేయులరాజు, చెరుకువాడ రంగసాయి పాల్గొన్నారు.