అప్పన్న ఆదాయం.. పక్కాగా వ్యయం

Simhachalam Temple EO Clarify on Hundi Income - Sakshi

ఒక్క పైసా కూడా దుర్వినియోగం కానివ్వం

మొండిబకాయిలు వసూలు చేస్తాం

అంతర్గత విజిలెన్స్‌ వ్యవస్థ ఏర్పాటుకు అనుమతి తీసుకుంటాం

సింహాచలం ఈవో వెంకటేశ్వరరావు

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సింహాచలం శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానానికి భక్తులు సమర్పించే విరాళాలు, కానుకలు, ఆలయ ఆదాయం ఇకపై దుర్వినియోగం కాకుండా పక్కాగా చర్యలు తీసుకుంటామని దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం.వెంకటేశ్వరరావు వెల్లడించారు. అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిలో జవాబుదారీతనం పెంచేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సింహాచలం దేవస్థానం ఆదాయం పెద్దమొత్తంలో దుర్వినియోగం అయిందని, వివరాల్లేని సర్దుబాటు చెల్లింపులు, పక్కా రికార్డుల్లేని చెల్లింపులు, బిల్లులకు మించి అదనపు చెల్లింపులు.. మొత్తంగా 375 అంశాలపై ఆడిట్‌ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. రూ.61 కోట్ల 32 లక్షల 87వేల చెల్లింపులకు ఆడిట్‌ శాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా 375 అంశాల్లో(కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించి) చెల్లింపులు జరిగాయని తేల్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 105 అంశాల్లో కోట్లకు కోట్లు అదనపు బిల్లులుచెల్లించారని మొత్తంగా రూ.2 కోట్ల 9 లక్షలు సర్దుబాటు చెల్లింపులకు అసలు బిల్లులే లేవని పేర్కొంది.

  రూ.27 కోట్ల 42 లక్షల చెల్లింపులకు రికార్డుల్లేవని, కొన్ని బిల్లులకు రూ. 29 కోట్ల మేర అదనపు చెల్లింపులు చేశారని.. ఇలా అడ్డగోలుగా లెక్క లేకుండా  కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేసినట్లు సాక్షాత్తు ఆడిట్‌ శాఖ నిగ్గుతేల్చిన విషయం తెలిసిందే. ఈ వివరాలతో ‘టీడీపీ హయాంలో ప్రసాదంలా నిధుల పందేరం’ శీర్షికన శనివారం సాక్షి పత్రికలో వచ్చిన కథనంపై సింహాచలం ఈవో వెంకటేశ్వరరావు స్పందించారు. ఆడిట్‌ అభ్యంతరాలపై వివరాలిస్తామని, నిధుల దుర్వినియోగం అని విచారణలో తేలితే బాధ్యులపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని   స్పష్టం చేశారు. ఇక నిధుల వినియోగాన్ని పక్కాగా చేస్తామని, ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాకుండా చేస్తామని చెప్పారు. సుమారు రూ.6 కోట్ల 75 లక్షల బకాయిలు ఇంకా  కాంట్రాక్టర్లు, షాపుల యజమానుల నుంచి రావాల్సి ఉందని  ఈవో  తెలిపారు. మొండిబకాయిలన్నీ వసూలు చేస్తామని, ఇది అత్యంత ప్రాధాన్య అంశంగా తీసుకుంటామని చెప్పారు. ఇక  దేవస్థానంలో అంతర్గత విజిలెన్స్‌ వ్యవస్థ ఏర్పాటుకు దేవాదాయ, ధర్మాదాయ ఉన్నతాధికారుల అనుమతి తీసుకుంటామని  వెల్లడించారు. బ్లాక్‌ లిస్టులో ఉన్న వ్యాపారస్తులు, కాంట్రాక్టర్ల బకాయిలపై దృష్టిసారిస్తామని, వీలైనంత త్వరగా రావాల్సిన బకాయిలను వసూలు చేస్తామని చెప్పారు. అనవసర వ్యయాలు తగ్గించి దేవస్థానం ఆదాయం వృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటామని వెంకటేశ్వరరావు స్పష్టంచేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top