ఎన్నాళ్లీ నిరీక్షణ? | Serious dissatisfaction PRCs arrears | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లీ నిరీక్షణ?

Oct 22 2017 3:38 PM | Updated on Oct 22 2017 3:38 PM

రాయవరం (మండపేట): ఒక రోజు ఉదయం ఎనిమిది గంటలకే సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ ఉందంటూ ఉద్యోగుల ఉరుకులు, పరుగులు. మరో రోజు సాయంత్రం ఐదు గంటలకు మొదలయ్యే వీడియో కాన్ఫరెన్స్‌ రాత్రి తొమ్మిది గంటలకు ముగుస్తుంది. ఇంత కష్టపడి పనిచేసినా..ఉద్యోగులకు సమయానికి డీఏ ఇవ్వరు. ఆర్థిక ప్రయోజనాలు కల్పించరు. ఫ్రెండ్లీ ప్రభుత్వంగా పనిచేస్తామని చెప్పుకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్యోగుల ప్రయోజనాల విషయానికి వచ్చే సరికి నాన్చివేత ధోరణి అవలంబిస్తున్నారంటూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే ఏడాది జూన్‌తో పీఆర్సీ గడువు ముగుసున్నా.. గత పీఆర్సీ బకాయిలు ఇప్పటి వరకూ చెల్లించలేదు. పీఆర్సీ బకాయిల మాట అటుంచితే కరువుభత్యం చెల్లింపులోనూ మీనమేషాలు లెక్కిస్తున్న సర్కారు తీరుపై ఉద్యోగులు, పెన్షనర్లలో తీవ్ర అసంతృప్తి నెలకొంది.

ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపుతూ
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు... పరిస్థితి బాగుపడితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామంటూ ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఆరు నెలలకోసారి ధరల సూచిక ఆధారంగా కరువు భత్యం ప్రకటిస్తోంది. సాధారణంగా జనవరి, జూలై నెలల్లో కేంద్రం డీఏ ప్రకటిస్తుంది. ఆ ప్రకారం రెండు మూడు నెలల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర డీఏ ప్రకారం రాష్ట్ర పీఆర్సీ నిష్పత్తిని బట్టి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ప్రకటిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 2016 జూలై నుంచి మూడు డీఏలు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటికి 2016 జూలై డీఏ మాత్రమే ప్రకటించింది. ఇంకా రెండు డీఏలు ఇవ్వాల్సి ఉంది.

బకాయిల మాటెత్తని సర్కార్‌
ప్రతి ఐదేళ్లకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు నూతన వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసి ఉద్యోగుల జీతభత్యాలు, అలవెన్సులు నిర్ణయిస్తుంది. గతంలో పీఆర్సీ ఏర్పాటులో జాప్యం వల్ల 18 నెలలు నష్టపోయారు. ప్రస్తుతం అమలవుతున్న పీఆర్సీ గడువు 2018 జూన్‌తో ముగియనుంది. 2018 జూలై నుంచి నూతన పీఆర్సీ అమల్లోకి రావాలి. నూతన పీఆర్సీ కోసం ముందుగా అధ్యయన కమిటీని నియమించాల్సి ఉంది. ఇంత వరకూ అటువంటి చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకోలేదు. ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు పీఆర్సీ బకాయిలు చెల్లించాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. విడతల వారీగా బకాయిలు చెల్లించాలంటూ విజ్ఞప్తి చేసినా ఇంత వరకూ ప్రభుత్వం నుంచి సూత్రప్రాయ ప్రకటన కూడా వెలువడలేదు.  

46 వేల మంది ఉద్యోగులకు...
జిల్లాలో సుమారు 46 వేల మంది వరకూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సుమారు 39 వేల మంది పింఛనుదారులు ఉన్నారు. ఉద్యోగులకే కాదు పింఛన్‌దారులకు పీఆర్సీ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఒక్కో ఉద్యోగికి వారి సర్వీసును బట్టి రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు పీఆర్సీ బకాయిలు చెల్లించాల్సి ఉండగా, పెన్షనర్లకు ఒక్కొక్కరికి రూ.7 వేల నుంచి రూ.25 వేల వరకూ చెల్లించాల్సి ఉంది. ఒక్కో ఉద్యోగికి సగటున రూ.25 వేలు చెల్లించాల్సి వస్తే 46 వేల మంది ఉద్యోగ ఉపాధ్యాయులకు రూ.115 కోట్లు, ఒక్కో ఫెన్షనర్‌కు సగటున రూ.15 వేలు చెల్లించాల్సి వస్తే 39 వేల మందికి రూ.58 కోట్లు చెల్లించాల్సి వస్తుంది.

వేచి చూస్తున్నారు
రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాటలు వింటూ ఇప్పటి వరకూ ఉద్యోగులు వేచి చూసే ధోరణి అవలంబించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి మెరుగుపడినా సమస్యలను  పరిష్కరించకపోవడం పట్ల ఉద్యోగుల్లో అసంతృప్తి ఉంది. ప్రభుత్వ వైఖరి మారకుంటే పోరాటం చేయక తప్పదు.
– డి.వి.రాఘవులు, యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు

పోరాటం తప్పదు
నాలుగేళ్లుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగు పడేందుకు ఉద్యోగులు శక్తికిమించి కష్టించి పనిచేస్తున్నారు. ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు చెబుతున్న మాటలను ఉద్యోగులు, ఉపాధ్యాయులు అర్థం చేసుకున్నారు. ఆర్థిక పరిస్థితి బాగున్నా కూడా ఇవ్వకుంటే పోరాటం తప్పదు. పీఆర్సీ గడువు ముంచుకొస్తున్నా..గత పీఆర్సీ బకాయిలు చెల్లించకపోవడం అన్యాయం.
    – పితాని త్రినాథరావు, అమరావతి జేఏసీ జిల్లా చైర్మన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement