breaking news
PRC Arians
-
ఎన్నాళ్లీ నిరీక్షణ?
రాయవరం (మండపేట): ఒక రోజు ఉదయం ఎనిమిది గంటలకే సీఎం వీడియో కాన్ఫరెన్స్ ఉందంటూ ఉద్యోగుల ఉరుకులు, పరుగులు. మరో రోజు సాయంత్రం ఐదు గంటలకు మొదలయ్యే వీడియో కాన్ఫరెన్స్ రాత్రి తొమ్మిది గంటలకు ముగుస్తుంది. ఇంత కష్టపడి పనిచేసినా..ఉద్యోగులకు సమయానికి డీఏ ఇవ్వరు. ఆర్థిక ప్రయోజనాలు కల్పించరు. ఫ్రెండ్లీ ప్రభుత్వంగా పనిచేస్తామని చెప్పుకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్యోగుల ప్రయోజనాల విషయానికి వచ్చే సరికి నాన్చివేత ధోరణి అవలంబిస్తున్నారంటూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే ఏడాది జూన్‌తో పీఆర్సీ గడువు ముగుసున్నా.. గత పీఆర్సీ బకాయిలు ఇప్పటి వరకూ చెల్లించలేదు. పీఆర్సీ బకాయిల మాట అటుంచితే కరువుభత్యం చెల్లింపులోనూ మీనమేషాలు లెక్కిస్తున్న సర్కారు తీరుపై ఉద్యోగులు, పెన్షనర్లలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు... పరిస్థితి బాగుపడితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామంటూ ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఆరు నెలలకోసారి ధరల సూచిక ఆధారంగా కరువు భత్యం ప్రకటిస్తోంది. సాధారణంగా జనవరి, జూలై నెలల్లో కేంద్రం డీఏ ప్రకటిస్తుంది. ఆ ప్రకారం రెండు మూడు నెలల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర డీఏ ప్రకారం రాష్ట్ర పీఆర్సీ నిష్పత్తిని బట్టి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ప్రకటిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 2016 జూలై నుంచి మూడు డీఏలు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటికి 2016 జూలై డీఏ మాత్రమే ప్రకటించింది. ఇంకా రెండు డీఏలు ఇవ్వాల్సి ఉంది. బకాయిల మాటెత్తని సర్కార్ ప్రతి ఐదేళ్లకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు నూతన వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసి ఉద్యోగుల జీతభత్యాలు, అలవెన్సులు నిర్ణయిస్తుంది. గతంలో పీఆర్సీ ఏర్పాటులో జాప్యం వల్ల 18 నెలలు నష్టపోయారు. ప్రస్తుతం అమలవుతున్న పీఆర్సీ గడువు 2018 జూన్‌తో ముగియనుంది. 2018 జూలై నుంచి నూతన పీఆర్సీ అమల్లోకి రావాలి. నూతన పీఆర్సీ కోసం ముందుగా అధ్యయన కమిటీని నియమించాల్సి ఉంది. ఇంత వరకూ అటువంటి చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకోలేదు. ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు పీఆర్సీ బకాయిలు చెల్లించాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. విడతల వారీగా బకాయిలు చెల్లించాలంటూ విజ్ఞప్తి చేసినా ఇంత వరకూ ప్రభుత్వం నుంచి సూత్రప్రాయ ప్రకటన కూడా వెలువడలేదు. 46 వేల మంది ఉద్యోగులకు... జిల్లాలో సుమారు 46 వేల మంది వరకూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సుమారు 39 వేల మంది పింఛనుదారులు ఉన్నారు. ఉద్యోగులకే కాదు పింఛన్‌దారులకు పీఆర్సీ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఒక్కో ఉద్యోగికి వారి సర్వీసును బట్టి రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు పీఆర్సీ బకాయిలు చెల్లించాల్సి ఉండగా, పెన్షనర్లకు ఒక్కొక్కరికి రూ.7 వేల నుంచి రూ.25 వేల వరకూ చెల్లించాల్సి ఉంది. ఒక్కో ఉద్యోగికి సగటున రూ.25 వేలు చెల్లించాల్సి వస్తే 46 వేల మంది ఉద్యోగ ఉపాధ్యాయులకు రూ.115 కోట్లు, ఒక్కో ఫెన్షనర్కు సగటున రూ.15 వేలు చెల్లించాల్సి వస్తే 39 వేల మందికి రూ.58 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. వేచి చూస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాటలు వింటూ ఇప్పటి వరకూ ఉద్యోగులు వేచి చూసే ధోరణి అవలంబించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి మెరుగుపడినా సమస్యలను పరిష్కరించకపోవడం పట్ల ఉద్యోగుల్లో అసంతృప్తి ఉంది. ప్రభుత్వ వైఖరి మారకుంటే పోరాటం చేయక తప్పదు. – డి.వి.రాఘవులు, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పోరాటం తప్పదు నాలుగేళ్లుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగు పడేందుకు ఉద్యోగులు శక్తికిమించి కష్టించి పనిచేస్తున్నారు. ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు చెబుతున్న మాటలను ఉద్యోగులు, ఉపాధ్యాయులు అర్థం చేసుకున్నారు. ఆర్థిక పరిస్థితి బాగున్నా కూడా ఇవ్వకుంటే పోరాటం తప్పదు. పీఆర్సీ గడువు ముంచుకొస్తున్నా..గత పీఆర్సీ బకాయిలు చెల్లించకపోవడం అన్యాయం. – పితాని త్రినాథరావు, అమరావతి జేఏసీ జిల్లా చైర్మన్ -
‘ఉప పోరు’లోనే గుణపాఠం
♦ ఉద్యోగుల డిమాండ్లను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం ♦ పెండింగ్‌లోనే మూడు విడతల డీఏ ♦ 10 నెలల పీఆర్సీ అరియర్స్ విడుదల ఎప్పుడో? ♦ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణలోనూ నిర్లక్ష్యమే.. ♦ సమాయత్తం అవుతున్న ఉద్యోగులు కర్నూలు(అగ్రికల్చర్): ప్రభుత్వంపై ఉద్యోగుల్లో వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. మూడు విడతల డీఏ పెండింగ్‌లో ఉన్నా పట్టించుకునే దిక్కులేదు. 2016 జూలై, 2017 జనవరి, 2017 జూలై వరకు డీఏ ఇవ్వాల్సి ఉంది. 10 నెలల పీఆర్సీ అరియర్స్ ఏళ్లుగడుస్తున్నా అతీగతీ లేదు. పదవీ విరమణ వయస్సు 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచినా వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు అమలు చేయలేదు. ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని కోరుతున్నా పట్టించుకోని ప్రభుత్వానికి నంద్యాల ఉప ఎన్నికలో బుద్ధి చెప్పడానికి ఉద్యోగులు సమాయత్తమవుతున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని 2014 సాధారణ ఎన్నికల్లో చంద్రబాబునాయుడు స్పష్టమైన హామీ ఇచ్చి ప్రస్తుతం సాకులు చూపుతూ కాలయాపన చేస్తున్నారు. 2018 జూలై 1నాటికి 11వ పీఆర్సీ అమలులోకి రావాల్సి ఉంది. ఇంతవరకు 11వ వేతన సవరణకు కమిషన్నే ఏర్పాటు చేయలేదు. ఆ దిశగా కనీస చర్యలు లేవు. ఉద్యోగులకు క్యాస్‌లెస్ వైద్యానికి జారీ చేసిన హెల్త్ కార్డులను కార్పొరేట్ వైద్యశాలలు పట్టించుకోవడంలేదు. ఇలా ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుండటం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ప్రజాధనాన్ని విదేశీ పర్యటనలకు, ప్రచారానికి, జిల్లాల పర్యటనలకు అడ్డగోలుగా ఖర్చు చేస్తూ ఉద్యోగుల విషయానికి వచ్చే సరికి రాష్ట్రం లోటు బడ్జెట్‌తో నడుస్తుందని చెప్పడం సర్వసాధారణమైంది. ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధిచిన డిమాండ్లపై నిర్లక్ష్య ధోరిణిలో ఉండటం పట్ల ఉద్యోగులు రగిలిపోతున్నారు. ఏ ఉద్యోగిని కదిలించినా ప్రభుత్వ తీరుపై విరుచుకుపడుతున్నారు. నంద్యాల ఉపఎన్నిక చక్కటి వేదిక.. నంద్యాల ఉప ఎన్నికలో ఓటమి భయం వెంటాడుతుండటంతో ఏదో విధంగా గెలుపొందేందుకు అధికార పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. అధికారం అండతో సామ, ధాన దండోపాయాలకు పాల్పడుతోంది. తమ నిరసనను ప్రభుత్వానికి తెలియచేయడానికి నంద్యాల ఉప ఎన్నిక చక్కటి అవకాశమని ఉద్యోగులు బావిస్తున్నారు. అనేక డిమాండ్లను ప్రక్కనపెట్టడం ఒక ఎత్తు అయితే 50 ఏళ్లు దాటిన తర్వాత పనితీరునుబట్టి కొనసాగించాలనే ప్రభుత్వ ఉద్దేశ్యంపై ఉద్యోగుల్లో తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. డీఏ వెంటనే ఇవ్వాలి 2016 జూలై1, 2017 జనవరి, 2017 జూలై వరకు మొత్తం మూడు డీఏలు ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. డీఏలను విడుదల చేయడంలో జాప్యం చేయరాదు. డీఏలను ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టడంతో ఉద్యోగ, ఉపాద్యాయ, కార్మికుల్లో వ్యతిరేకత ఏర్పడుతోంది. అదే విధంగా 10 నెలల పీఆర్సీ అరియర్స్‌ను విడుదల చేయడంలో ప్రభుత్వం చొరువ తీసుకోవాలి. ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారంలో నాన్చివేత తగదు. వెంటనే చర్యలు తీసుకోవాలి. – లక్ష్మినారాయణ, జాయింట్ సెక్రటరీ, జిల్లా ఎన్జీఓ అసోసియేషన్ 11వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే నియమించాలి 11వ వేతన సవరణ సంఘాన్ని ప్రభుత్వం వెంటనే నియమించాలి. నిబందనల ప్రకారం 2018 జూలై1 నాటికి 11వ వేతన సవరణ అమలులోకి రావాల్సి ఉంది.కాని ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. వెంటనే 11వ వేతన సవరణకు కమిషన్ వేయాలి. 50 ఏళ్ల దాటిన తర్వాత పనితీరును బట్టి ఉద్యోగంలో కొనసాగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే యత్నాల్లో ఉండటం దారుణం. ఇటువంటి ఆలోచనను వెంటనే ఉప సంహరించుకోవాలి. లేకపోతే ప్రభుత్వానికే నష్టం. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలి. – పి.రామకృష్ణారెడ్డి, కోశాధికారి, జిల్లా ఎన్జీఓ అసోసియేషన్ డిమాండ్లు పరిష్కరించాలి ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించడానికి వెంటనే చొరవ తీసుకొవాలి. మూడు విడతల డీఏ, 10 నెలల పీఆర్సీ అరియర్స్ ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇందువల్ల ప్రభుత్వంపై ఉద్యోగులకు అసంతృప్తి పెరుగుతోంది. కాంట్రాక్టు ఉద్యోగులను విధిగా క్రమబద్దీకరించాల్సిందే. ఇందులో రాజీ పడం. చట్టాలను మార్పు చేసుకొని రెగ్యులర్ చేయాలి. 11 వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి. – జవహర్లాల్, జిల్లా కార్యదర్శి, ఎన్జీఓ అసోసియేషన్