రోగమొస్తే జేబు గుల్లే | Network hospitals that have stopped EHS services | Sakshi
Sakshi News home page

రోగమొస్తే జేబు గుల్లే

Aug 22 2025 2:35 AM | Updated on Aug 22 2025 2:35 AM

Network hospitals that have stopped EHS services

ఉద్యోగులు, పింఛనర్లకు దక్కని ఆరోగ్య భరోసా

ఆస్పత్రులకు భారీగా పేరుకుపోయిన బిల్లులు  

ఈహెచ్‌ఎస్‌ సేవలు నిలిపేసిన నెట్‌వర్క్‌ ఆస్పత్రులు 

అత్యవసర సేవలకు ఉపయోగపడని ఈహెచ్‌ఎస్‌ కార్డు 

నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు రూ.320 కోట్లు బకాయి పెట్టిన ప్రభుత్వం 

ఆరోగ్యశ్రీ బకాయిలు రూ. 4 వేల కోట్లు దీనికి అదనం

అప్పులు చేసి వైద్యం చేయించుకుంటే రీయింబర్స్‌మెంటూ పూర్తిగా చెల్లించని వైనం

గుంటూరు జిల్లాకు చెందిన రాష్ట్ర ప్రభుత్వ మాజీ ఉద్యోగి భార్య జనవరిలో  అనారోగ్యం పాలయ్యారు. చికిత్స కోసం కుటుంబసభ్యులు కార్పొరేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఎంప్లాయీ హెల్త్‌ స్కీం (ఈహెచ్‌ఎస్‌) కార్డు ఉందని, నగదు రహిత వైద్యం అందించాలని కుటుంబసభ్యులు కోరారు. కానీ, ‘ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదు. డబ్బు కట్టి వైద్యం చేయించుకునేట్లైతే  ఉండండి. లేదంటే వెళ్లిపోండి’ అని ఆస్పత్రి యాజమాన్యం తేల్చి చెప్పింది. చేసేదేం లేక రూ.3 లక్షలకు పైగా బిల్లును సొంతంగా చెల్లించారు. రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేస్తే, ప్రభుత్వం ఇప్పటికీ మంజూరు చేయలేదు.  

ప్రకాశం జిల్లాకు చెందిన పశు సంవర్ధక శాఖ ఉద్యోగి కాలు నొప్పితో వైద్యులను సంప్రదించగా శస్త్రచికిత్స చేయాలన్నారు. ఈహెచ్‌ఎస్‌ కింద చికిత్స కోసం కర్నూలులోని నెట్‌వర్క్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లగా... ‘‘ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదు. ఉచిత చికిత్సలు అందించలేం’’ అని వైద్యులు చెప్పారు. ఫీజు కట్టి రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

సాక్షి, అమరావతి:  ప్రస్తుతం రాష్ట్రంలో లక్షలమంది ఉద్యోగులు, పింఛనర్లు ఎదుర్కొంటున్న సమస్యలకు నిదర్శనాలు. ఈ రెండు ఘటనలు చంద్రబాబు ప్రభుత్వం వారి ఆరోగ్య భద్రతను పూర్తిగా గాలికి వదిలేసిందనేందుకు తార్కాణాలు. నెలనెల ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీమ్‌ (ఈహెచ్‌ఎస్‌)కు తమ వాటా చెల్లిస్తున్నా... ఆపద సమయంలో అక్కరకు రావడం లేదనేందుకు సాక్ష్యాలు. ఉద్యోగులు, పింఛనర్లు అనారోగ్యంతో నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు వెళ్తే.. నగదు రహిత వైద్యం లభించడం లేదు. దీంతో జేబులోంచి డబ్బు పెట్టాల్సి వస్తోంది. రూ.లక్షల్లో అప్పులు చేసి వైద్యం చేయించుకుని రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు పెట్టుకుంటే నెలల తరబడి మంజూరు చేయడంలేదు. 

రాష్ట్రంలో ఈహెచ్‌ఎస్‌పై 22 లక్షల మందికి పైగా ఉద్యోగులు, పింఛనర్లు, వారి కుటుంబసభ్యులు ఆధారపడి ఉన్నారు. 50:50 నిష్పత్తిలో ఉద్యోగులు, ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తున్నారు. నిరుడు చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక నిరుపేదల ఆపద్బాంధవి ఆరోగ్యశ్రీతో పాటు, ఈహెచ్‌ఎస్‌ను అటకెక్కించారు. చికిత్సలు చేసిన ఆస్పత్రులకు సకాలంలో బిల్లులు మంజూరు చేయడం మానేశారు. ఏకంగా రూ.320 కోట్ల మేర ఈహెచ్‌ఎస్‌ బిల్లులు బకాయి పెట్టారు. అరోగ్యశ్రీ బిల్లుల బకాయిలు రూ.4 వేల కోట్లకు పైమాటే. 

ఇవన్నీ నెలల తరబడి పేరుకుపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పలుసార్లు నెట్‌వర్క్‌ ఆస్పత్రుల ప్రతినిధులు ప్రభుత్వానికి వివరించారు. అయినప్పటికీ స్పందన కొరవడడంతో ఆస్పత్రులు పూర్తిగా ఈహెచ్‌ఎస్‌ సేవలను నిలిపివేశాయి. కేన్సర్, గుండెపోటు, బ్రెయిన్‌ స్ట్రోక్, కిడ్నీ, లివర్, ఇతర పెద్ద అనారోగ్య సమస్యలతో పాటు ప్రమాదాల్లో గాయాలపాలైనవారు ఉచిత వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

మళ్లీ 2019కి ముందు నాటి పరిస్థితి... 
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీతో పాటు, ఈహెచ్‌ఎస్‌ పథకాన్ని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం బలోపేతం చేసింది. ఆరోగ్యశ్రీ పరిధిలో ఉండే అన్ని నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు ఈహెచ్‌ఎస్‌ సేవలను విస్తరించింది. అంతేకాకుండా 2019కు ముందు చంద్రబాబు ప్రభుత్వం తొలగించిన ప్రొసీజర్‌లను   పునరుద్ధరించింది. కేన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధుల బారినపడితే... ఉద్యోగులు, పింఛనర్లు వారి కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడకూడదని 46 కేన్సర్‌ ప్రొసీజర్‌లను పథకంలోకి చేర్చింది. 

మొత్తంమ్మీద 2014–19 మధ్య కంటే 2019–24 కాలంలో ఈహెచ్‌ఎస్‌ లబ్ధిదారులకు రెట్టించిన ఆరోగ్య భరోసా లభించింది. 2014–19 సమయంలో టీడీపీ పాలనలో రూ.976 కోట్లు ఖర్చు చేయగా, 2019–24 మధ్య వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రూ.1,427 కోట్లు ఖర్చు పెట్టారు. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో ఈహెచ్‌ఎస్‌కు 2019కి ముందునాటి పరిస్థితి దాపురించిందని లబ్దిదారులు వాపోతున్నారు.  

కార్డులు ఎక్కడా ఆమోదించడం లేదు 
ఈహెచ్‌ఎస్‌ కార్డులు ఎక్కడా ఆమోదించడం లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం రూ.2 లక్షల వరకే మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ ఇస్తోంది. ఎక్కువ ఖర్చు పెట్టుకున్న ఉద్యోగులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. రీయింబర్స్‌మెంట్‌ పరిమితిని రూ.5 లక్షలు చేయాలి. ఉద్యోగి కాంట్రిబ్యూషన్‌ ప్రతి నెల నేరుగా ట్రస్ట్‌కు జమ చేయాలి. ఈ విధానం అమలైతేనే మేలు జరుగుతుంది. ప్రొసీజర్స్‌ రేట్లను సమీక్షించి పెంచాలి. ప్రస్తుతం ఉన్న ధరలతో నష్టపోతున్నామని ఆస్పత్రులు చెబుతున్నాయి.  –కె.వెంకట్రామిరెడ్డి, అధ్యక్షులు, సచివాలయ ఉద్యోగుల సంఘం 

ప్రభుత్వం– ఆస్పత్రుల మధ్య ఉద్యోగులు నలిగిపోతున్నారు 
ఉద్యోగుల నుంచి ఠంఛన్‌గా ఈహెచ్‌ఎస్‌ వాటా తీసుకుంటున్నా... ప్రభుత్వం ట్రస్ట్‌కు ఆ డబ్బు జమ చేయడం లేదు. ట్రస్ట్‌ ఆసుపత్రులకు బిల్లులు ఇవ్వడం లేదు. దీంతో అప్పు చేసి వైద్యం చేయించుకోవాల్సి వస్తోంది. ఆస్పత్రులు ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. రూ.5 లక్షలు పెట్టి వైద్యం చేయించుకుంటే రీయింబర్స్‌మెంట్‌ కేవలం రూ.90 వేలు ఇస్తున్నారు. 

ఇదేమని అడిగితే ఆమోదించిన ప్రొసీజర్‌ రేట్లు ప్రకారం అంతే వస్తుందని ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ అధికారులు చెబుతున్నారు. అటు ఆస్పత్రులు, ఇటు ప్రభుత్వం మధ్య ఉద్యోగులు నలిగిపోతున్నారు. ఓపీ, వార్షిక ఆరోగ్య చెకప్‌లతో పథకాన్ని బలోపేతం చేస్తామన్న హామీలు నీటి మీద రాతలే అయ్యాయి. ఐపీ సేవలు అందక ఉద్యోగులు, పింఛనర్లు నరకం చూస్తున్నారు. –బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement