పల్లెల్లో సంక్రాంతి | Sankranthi in villages | Sakshi
Sakshi News home page

పల్లెల్లో సంక్రాంతి

Jan 13 2014 4:54 AM | Updated on Jul 6 2018 3:32 PM

పల్లెల్లో సంక్రాంతి - Sakshi

పల్లెల్లో సంక్రాంతి

పల్లెలకు సంక్రాంతి పండగ శోభ వచ్చింది. సంక్రాంతి పండగకు విద్యా సంస్థలకు పది రోజుల పాటు సెలవులు ఇచ్చారు.

మిర్యాలగూడ, న్యూస్‌లైన్: పల్లెలకు సంక్రాంతి పండగ శోభ వచ్చింది. సంక్రాంతి పండగకు విద్యా సంస్థలకు పది రోజుల పాటు సెలవులు ఇచ్చారు. పట్టణాల్లో ఉండే వారంతా వారి వారి కుటుంబ సభ్యులతో సొంతూళ్లకు వచ్చేశారు. దాంతో గ్రామాలలో సందడి వాతావరణం నెలకొన్నది. సంక్రాంతి పండగను భోగి, సంక్రాంతి, కనుమ ఇలా మూడు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతికి పది రోజుల ముందునుంచే పల్లెల్లో గంగిరెద్దుల ఆటలు, హరిదాసు కీర్తనలు వినిపిస్తున్నాయి.

 ప్రతి ఇంటి వాకిలిలో రంగు రంగుల ముగ్గులు పేర్చి కనిపిస్తున్నాయి. మిర్యాలగూడ మండలంలోని తుంగపాడు గ్రామంలో ప్రతి ఇంటిలో కూడా ఉద్యోగ రీత్యా పట్టణాల్లో స్థిర పడ్డవారే ఉన్నారు. కానీ సంక్రాంతి పండగను సొంత గ్రామంలో జరుపుకోవడానికి కుటుంబ సభ్యులతో కలిసి తుంగపాడుకు చేరుకున్నారు. చిన్నారులు ఇళ్లపైన గాలి పటాలు ఎగురవేస్తూ ఆటపాటలతో గడుపుతున్నా రు. మహిళలు కబుర్లు చెప్పుకుంటూ పిండివంటల తయారీలో నిమగ్నమయ్యారు.

 ముగ్గుల పోటీలు
 సంక్రాంతి పర్వదినం రంగవళ్లులకు ప్రత్యేకత. దీంతో గ్రామాలలో సంక్రాంతి పండగను పురస్కరించుకొని ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా ప్రతి ఇంటి వాకిలిలో రంగు రంగుల ముగ్గులువేసి గొబ్బెమ్మలతో అలంకరించారు. దాంతో పల్లెల్లో ప్రతి వాకిలి కూడా రంగులతో కళకళలాడుతూ కనిపించింది.

 ధనుర్మాసం మొదలై నప్పటి నుంచే..
 అర్వపల్లి/తిరుమలగిరి/చిలుకూరు న్యూస్‌లైన్ :  ధనుర్మాసం మొదలైనప్పటి నుంచే కొన్ని గ్రామాల్లో గొబ్బెమ్మల వ్రతం  నిర్వహిస్తున్నారు. ఇళ్లముందు గొబ్బెమ్మలతో పాటు ప్రతి రోజూ ఆవుపేడతో తయారు చేసిన ఓ పిడకను ఉంచి పూజలు చేస్తున్నారు. ఈపిడకలను భోగిమంటల్లో వేస్తే పుణ్యం కలుగుతుందని ప్రజల నమ్మకం.

 మూడు రోజుల పాటు వేడుకలు
 భోగి, మకర సంక్రాంతి, కనుమ..ఇలా మూడు రోజుల పాటు సంక్రాంతి వేడుకలు జరుపుకుంటారు. ఈపండగకు ప్రత్యేకంగా భోగి మంటలు వేస్తారు. పండగకు దూర ప్రాంతాల నుంచి  కూతుళ్లు, అల్లుళ్లు, మనుమలు, మనువురాళ్లు, బంధువులు వచ్చారు. మహిళలు అరిసెలు, సకినాలు, కార పప్పలు, చుట్లు, చక్రాలు, లడ్డూలు లాంటి పిండి వంటలు సిద్ధం చేసే పనుల్లో బిజీగా ఉన్నారు. నువ్వులతో పులగం వండుతారు. వర్షాలు సకాలంలో కురిసి పంటలు బాగా పండడంతో రైతులు పండగను ఆనందంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు.  అర్వపల్లిలో సుమారు 30 కుటుంబాలు ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర పనుల రీత్యా పట్టణాలకు వెళ్లాయి. వీరంతా పండగ కోసం సొంతూరుకు వచ్చారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement