ఆంధ్రప్రదేశ్ లో మూడు జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాడిపత్రి: అనంతపురం జిల్లాలో శుక్రవారం రోడ్డుప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. తాడిపత్రి మండలం ఇగుడూరు వద్ద రెండు మినీ లారీలు ఢీ కొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఇండియన్ గ్యాస్ గోడౌన్ వద్ద జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కారు బోల్తా పడడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
వైఎస్సార్ జిల్లాలో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృత్యువాత పడ్డారు. దువ్వూరు బైపాస్ రోడ్డు వద్ద కారు బోల్తా పడడంతో ఒకరు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. ఓబులవారిపల్లి మండలం కొర్లకుంట వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ద్విచక్ర వాహనదారుడు మృతి చెందగా, మరొకరి తీవ్రగాయాలయ్యాయి.