వెంటాడిన మృత్యువు | Road Accident In Kadapa | Sakshi
Sakshi News home page

వెంటాడిన మృత్యువు

Aug 9 2018 7:41 AM | Updated on Aug 30 2018 4:17 PM

Road Accident In Kadapa - Sakshi

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బండపల్లె దూదేకులపల్లెకు చెందిన అక్బర్‌ అలీ(35)

లక్కిరెడ్డిపల్లె(వైఎస్సార్‌ కడప): మండలంలోని రాయచోటి –వేంపల్లె రహదారిలో లక్కిరెడ్డిపల్లె సమీపంలోని దాసిరెడ్డి మిట్ట వద్ద బుధవారం రాత్రి రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న సంఘటనలో అక్బర్‌ అలీ(35)అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్‌ఐ సురేష్‌రెడ్డి కథనం మేరకు.. మండలంలోని దిన్నెపాడు గ్రామం దూదేకులపల్లెకు చెందిన అహ్మద్, షబీనా అనే దంపతులు రాయచోటిలో వారి పనులు ముగించుకొని స్వగ్రామానికి ద్విచక్రవాహనంలో బయలుదేరారు.

రామాపురం మండలం  బండపల్లె దూదేకులపల్లెకు చెందిన ఖలందర్, అక్బర్‌ అలీ అనే ఇద్దరు లక్కిరెడ్డిపల్లె నుంచి స్వగ్రామానికి వస్తుండగా వర్షం పడుతుండడంతో ఎదురుగా వచ్చే వాహనాన్ని గమనించక రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. రోడ్డుపై గాయాలతో పడి ఉన్న వీరిని గమనించని రాయచోటికి వెళ్లే పూలుకుంట ఆర్టీసి బస్సు(ఏపీ29జడ్‌ 2784)ద్విచక్రవాహనంతో పాటు అహ్మద్,షబీనాను రోడ్డుపై ఈడ్చుకెళ్లడంతో వారిద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఖలందర్,అక్బర్‌ అలీ అనే ఇద్దరు కూడా రోడ్డుకు మరో వైపు గాయాలతో పడి ఉండగా అతి వేగంగా వస్తున్న గుర్తు తెలియని కారు అక్బర్‌ అలీ తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే అతను మృతి చెందగా ఖలందర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలతో ఉన్న ఖలందర్,అహ్మద్, షబీనాలను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement