
‘ఎర్ర’ స్మగ్లింగ్‌లో ఇంటి దొంగలు
శేషాచల అటవీ ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణా ఇంటిదొంగల సహకారంతో యధేచ్ఛగా సాగుతోందనే విమర్శలున్నాయి.
- చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో దుంగలు మాయం
- కోట్లకు పడగలెత్తిన ఓ పోలీస్ అధికారి
- భాకరాపేట ఫారెస్ట్ గోడౌన్‌లోనూ మాయమవుతున్న దుంగలు
తిరుపతి రూరల్ : శేషాచల అటవీ ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణా ఇంటిదొంగల సహకారంతో యధేచ్ఛగా సాగుతోందనే విమర్శలున్నాయి. ముందుగా ఇంటిదొంగల పనిపడితే ఎర్రచందనం స్మగ్లిం గ్ చాలా వరకు నియంత్రించవచ్చని పలువురు అంటున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రగిరి, చిన్నగొట్టిగళ్లు, ఎర్రావారిపాళెం మండలాల్లో పెద్ద ఎత్తున ఎర్రచందనం అక్రమరవాణా జరుగుతోంది. అక్రమ రవాణా వెనుక ఇంటిదొంగల ప్రమేయం ఉండడమే కారణం.
పోలీస్ శాఖలో రహస్య సమావేశాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నివారణకు తీసుకున్న నిర్ణయాలు సైతం స్మగ్లర్లకు తెలిసిపోతున్నాయంటే ఆశాఖలో ఎర్ర దళారీలు ఏ స్థాయిలో ఉన్నారో తెలుస్తోంది. ఎర్రచందనం అక్రమ రవాణాకు చంద్రగిరి పోలీసులు పెలైట్‌లుగా వ్యవహరించారనే విమర్శలు ఉన్నా యి. ఎర్రచందనం స్మగ్లర్లకు శేషాచల అడవుల్లోకి మార్గాలు చూపడం, ఏ మార్గాన వెళితే తనిఖీలు ఉండవు, స్మగ్లింగ్‌కు సులువుగా ఉంటుంది, వంటి సలహాలు చెప్పడం, దుంగలను రోడ్డు దాటించడమే కొంతమంది పోలీసులు పనిగా పెట్టుకున్నారని అక్కడి వారే చెబుతున్నారు.
వీటంతటికీ ఓ పోలీస్ అధికారి సహకరిస్తున్నారని తెలుస్తోంది. చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో 38 ఎర్రచందనం దుంగలు మాయమయ్యాయని సమాచారం. స్పెషల్ బ్రాంచ్ పోలీసు లు కూడా 38 దుంగలు మాయమయ్యాయని ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చినా ఎవ్వరూ పట్టించుకోలేదు. వీటి కి సంబంధించిన లెక్కలను రికార్డుల్లో తారుమారు చేశార నే పుకార్లు వినిపిస్తున్నాయి.
ఇన్‌ఫార్మర్ల సహకారం
ఎర్రచందనం అక్రమ రవాణా కోసం పోలీసులు కొంతమందిని ఇన్‌ఫార్మర్లు గా పెట్టుకున్నారు. స్మగ్లర్లకు సహకరిస్తు న్న కొంత మంది ఇంటి దొంగలు ఇన్‌ఫార్మర్ల సహాయంతోనే తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. వారి ద్వారా దుం గకు ఇంతని రేటు నిర్ణయించి అక్రమంగా రోడ్డు దాటిస్తున్నారు. ఇన్‌ఫార్మ ర్లు ఒక పార్టీని పట్టించి నాలుగు పార్టీల నుంచి డబ్బు వసూలు చేసి వదిలేస్తున్నారు. ఈ డబ్బును అందరూ కలసి పంచుకుంటున్నారని సమాచారం.
కోట్లకు పడగలెత్తిన పోలీస్ అధికారి
ఎర్రచందనం అక్రమ రవాణాకు సహకరిస్తున్న చంద్రగిరి పరిధిలోని ఓ పోలీస్ అధికారి కోట్లకు పడగలెత్తారు. అనతి కాలంలోనే ఆయన కోట్లాది రూపాయలు సంపాదించారని కింది స్థాయి సిబ్బందే బాహాటంగా చెబుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఇక్కడకు బదిలీపై వచ్చిన ఆయన ఎర్రచందనం అక్రమ రవాణాకు సహకరిస్తూ కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారు. ఇక్కడే తిష్ట వేసేందుకు పెద్ద ఎత్తున పైరవీలకు ప్రయత్నిస్తున్నారని సమాచారం.
ఫారెస్టు గోడౌన్‌లోనూ దుంగలు మాయం
భాకరాపేట ఫారెస్టు గోడౌన్‌లో కొన్నేళ్లుగా భద్రపరిచిన ఎర్రచందనం దుంగ లు ఒకొక్కటే మాయమవుతున్నాయి. ఈ నెల మొదటి వారంలో గోడౌన్ నుం చి కింది స్థాయి ఉద్యోగి ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తూ దొరికిపోయాడు. దుంగల తరలింపు వెనుక ఓ ఫారెస్టు అధికారి హస్తం ఉందని తెలిసింది. ఎర్రచందనాన్ని కాపాడాల్సిన అధికారులే డబ్బులకు ఆశపడి ఇలా చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎస్పీ అయినా ఇంటి దొంగల భరతం పట్టి ఎర్రచందనం అక్రమ రవాణా నివారించాలని ప్రజలు కోరుతున్నారు.