నిర్లక్ష్యపు రోగానికి మందేది?
ప్రభుత్వ ఆస్పత్రులకు నిర్లక్ష్యపు జబ్బు పట్టుకుంది. అడిగే వారు లేక.. పర్యవేక్షణ కరువవ్వడంతో రోగులు అష్టకష్టాలు పడుతున్నారు.
కంబదూరు మండలం చెన్నంపల్లికి చెందిన మారెక్క(63) కాలికి గాయమైంది. కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రికి గురువారం ఉదయం 10 గంటలకు డీజిల్ ఆటోలో తీసుకువచ్చారు. ఆటోలోంచి ఎమర్జెన్సీ వార్డులోకి మోసుకెళ్లారు. అక్కడ డ్యూటీ వైద్యురాలు మల్లేశ్వరి ఓపీకి వెళ్లమని సిఫార్సు చే శారు. ఓపీ గది ఎక్కడో కనుక్కుని.. ఓపీ స్లిప్ తీసుకుని 7వ నంబర్ రూంకు అతికష్టం మీద వెళ్లేసరికి ఒక గంట గడిచింది. అక్కడ డ్యూటీ డాక్టర్ లేరు. తామెవరితో చూపించుకోవాలంటూ ఆ వృద్ధురాలి కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇలాంటి దుస్థితే ఉందని గురువారం ‘న్యూస్‌లైన్’ విజిట్‌లో వెల్లడైంది.
అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్ : ప్రభుత్వ ఆస్పత్రులకు నిర్లక్ష్యపు జబ్బు పట్టుకుంది. అడిగే వారు లేక.. పర్యవేక్షణ కరువవ్వడంతో రోగులు అష్టకష్టాలు పడుతున్నారు. నిత్యం వందల మంది రోగాల బారిన పడి ఆస్పత్రికి వెళితే ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు కచ్చితమైన సమయానికి రాకపోవడంతో రోగులు నరకయాతన పడుతూ.. ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగు తీస్తున్నారు. అనంతపురంలోని సర్వజనాస్పత్రిలో వైద్యులు విధులకు గైర్హాజరవుతూ.. అడిగితే ఇప్పుడే కాఫీ తాగడానికి వెళ్లారంటూ బుకాయిస్తున్నారు. హౌస్‌సర్జన్‌లే అంతా చూసుకోవాల్సి వస్తోంది. కొంత
మంది వైద్యులు విధులకు హాజరుకాకుండా అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకాలు చేసి మరీ తప్పించుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ఆస్పత్రి ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆస్పత్రి ఉద్యోగ వర్గాలు గుసగుసలుపోతున్నాయి. అసలే జ్వరాలతో ప్రజలు మంచాన పడుతుంటే వైద్యులు అందుబాటులో ఉండకుండా నిర్లక్ష్యం చేయడంపై ఆ శాఖ ఉద్యోగులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రాథమిక ‘అనారోగ్య’ కేంద్రాలు..
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ)ను ఏర్పాటు చేసింది. జిల్లా వ్యాప్తంగా 18 క్లస్టర్‌లకు గానూ 80 పీహెచ్‌సీలు, 586 సబ్ సెంటర్లున్నాయి.
జిల్లాలో 42 మదర్ పీహెచ్‌సీలున్నాయి. ప్రధానంగా పీహెచ్‌సీలలో వైద్యులు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉండాలి. మదర్ పీహెచ్‌సీలలో 24 గంటలు అందుబాటులో ఉండాలి. పలుచోట్ల వైద్యులు సరిగా ఉండడం లేదు. ఉదయమే రావాల్సి ఉన్నా ఎంతో మంది జిల్లా హెడ్ క్వార్టర్స్‌లో నివాసముంటూ ఆ బాధ్యతను స్టాఫ్ నర్సులకు అప్పజెప్పుతున్నారు. జీఓ 98 ప్రకారం పనిచేసే చోటే నివాసముండాలి. అయితే వైద్య ఆరోగ్య శాఖలో మేనేజ్ చేసుకుని జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లో ఉంటున్నారు. దీనికి తోడు పీహెచ్‌సీ వైద్యుల పనితీరును సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్లు (ఎస్‌పీహెచ్‌ఓ) పర్యవేక్షించాలి.
అటువంటిది ఎస్‌పీహెచ్‌ఓలే సరిగా విధులు నిర్వర్తించడం లేదన్న ఆరోపణలు వినబడుతున్నాయి. జిల్లాలో ఆవులదట్ల, హేమావతి, కొట్టాలపల్లి, డీ హీరేహాల్, శెట్టూరు, కుందుర్పి, పీహెచ్‌సీలు, ధర్మవరం సీహెచ్‌సీలో వైద్యులే లేరు. ఇతర పీహెచ్‌సీలలో పనిచేసే వారిని ఇక్కడికే అటాచ్ చేశారు. వారు ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా పీహెచ్‌సీలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 185 మంది వైద్యులుండాల్సి ఉండగా, అందులో 163 మంది మాత్రమే ఉన్నారు.
పీహెచ్‌సీలలో వైద్యులున్నా సరిగా విధులు నిర్వర్తించడం లేదన్న ఆరోపణలు ప్రజల నుంచి బలంగా వినబడుతున్నాయి.
డీసీహెచ్‌ఎస్‌లో వైద్యుల కొరత
డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ హాస్పిటల్ సర్వీసెస్ (డీసీహెచ్‌ఎస్)లో వైద్యుల కొరత పట్టిపీడిస్తోంది. డీసీహెచ్‌ఎస్ పరిధిలో ఒక డిస్ట్రిక్ట్ హాస్పిటల్, 3 ఏరియా ఆస్పత్రులు, 10 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లున్నాయి. ఇందులో అధిక శాతం వైద్యుల కొరత ఉంది. ప్రజలకు మెరుగైన వైద్యం అందడం లేదు. దీనికి తోడు కుటుంబ నియంత్రణ, ప్రసవాలు సరిగా జరగడం లేదు. చిన్నపిల్లల వైద్యులు లేరు. దీంతో ప్రజలు సర్వజనాస్పత్రికే రావాల్సి వస్తోంది. పీడియాట్రీషియన్, గైనకాలజిస్టు, అనస్తీషియా వైద్యులు లేకపోవడంతో అందుకు సంబంధించిన సేవలకు బ్రేక్ పడుతోంది.
కఠిన చర్యలు తీసుకుంటాం
పీహెచ్‌సీలలో వైద్యుల లేరని ఫిర్యాదులందుతుండటం వాస్తవమే. ఎవరైతే ఇష్టారాజ్యంగా విధులు నిర్వర్తిస్తున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పీహెచ్‌సీలలో ఉండాల్సిందే. మెడికల్ ఆఫీసర్లపై ఎప్పటికప్పుడు ఎస్‌పీహెచ్‌ఓలే నిఘా ఉంచాలి.
- డాక్టర్ వెంకటరమణ, డీఎంహెచ్‌ఓ
వైద్యులు లేరు
తమ పరిధిలో ఉండే ఆస్పత్రులలో వైద్యులు అధిక సంఖ్యలో లేరు. వైద్య విధాన పరిషత్ కింద పనిచేసే ఆస్పత్రిలో తగినంతగా వైద్యులుండాలి. చిన్నపిల్లల వైద్యులు, స్త్రీల వైద్య నిపుణులు, మత్తుమందు వైద్యులుంటే ఇంకా మెరుగైన ఫలితాలు సాధిస్తాం.
- డాక్టర్ యు.రామకృష్ణారావు, డీసీహెచ్‌ఎస్
సమయపాలన పాటించాల్సిందే
వైద్యులు సమయపాలన పాటించాలి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆస్పత్రిలో ఉంటూ సేవలందించాలి. నిర్లక్ష్యం చేయరాదు. వైద్యులందరితో మాట్లాడి రోగులకు ఇక్కట్లు కలుగకుండా చూస్తాం.
- డాక్టర్ కేఎస్‌ఎస్ వెంకటేశ్వర రావు, సర్వజనాస్పత్రి
సూపరింటెండెంట్, అనంతపురం


