వ్యూహమా... వైరాగ్యమా !
జిల్లా రాజకీయాల్లో ఎంపీ రాయపాటి సాంబశివరావుకు ప్రత్యేక స్థానం ఉంది. ఎప్పుడు సంచలనాలతో వార్తల్లో ఉండటం ఆయనకు పరిపాటి.
సాక్షి ప్రతినిధి, గుంటూరు : జిల్లా రాజకీయాల్లో ఎంపీ రాయపాటి సాంబశివరావుకు ప్రత్యేక స్థానం ఉంది. ఎప్పుడు సంచలనాలతో వార్తల్లో ఉండటం ఆయనకు పరిపాటి. వాస్తవానికి జిల్లా రాజకీయాల్లో మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ రాయపాటి సాంబశివరావులు ఉప్పు నిప్పులా ఉంటారు.
అయితే తాజాగా మంత్రి కన్నా ఎంపీ స్థానానికి పోటీ చేస్తే తాను సంపూర్ణ మద్దతు ఇస్తానని రాయపాటి ప్రకటించడం జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఏ ఉద్దేశంతో రాయపాటి ఈ ప్రకటన చేసి ఉంటారనే అంశంపై ఊహాగానాలకు తెరలేచింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎంపీ రాయపాటి సాంబశివరావు అనుసరిస్తున్న వైఖరితో కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉంది.
కాంగ్రెస్ విధానాలపై ఆయన పలుమార్లు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సీమాంధ్ర ప్రజల అభిమతానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం వల్ల రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కొట్టుకుపోతుందని, ఆ పార్టీ నుంచి పోటీ చేయడానికి అభ్యర్థులు ఉండరని ప్రకటనలు చేశారు. కాంగ్రెస్ అభిమానులకు, పార్టీ అధిష్టానానికి ఈ వ్యాఖ్యలు బాధ కలిగించాయి. కాంగ్రెస్ పార్టీ ద్వారానే పెరిగి ఆ పార్టీపై వ్యాఖ్యలు చేయడం సరికాదని సన్నిహితులు రాయపాటికి సూచించారు.
ఇవేమీ పట్టించుకోకుండా సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నారని, ఆ పార్టీ తరఫున తాను పోటీ చేసే అవకాశాలున్నట్టు పరోక్షంగా మరోసారి ప్రకటనలు ఇచ్చారు. వీటి కారణంగా రాయపాటిని పార్టీ కూడా దూరంగానే ఉంచుతోంది. ఇక ఆ పార్టీలో రాయపాటికి సీటు వచ్చే అవకాశాలు లేవనే అభిప్రాయం వినపడుతున్న నేపథ్యంలో కన్నాకు మద్దతుగా ఇచ్చిన ప్రకటనపై రెండు రకాలైన అభిప్రాయాలు వినపడుతున్నాయి.
వైరాగ్యమా?
2009 ఎన్నికల నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్‌లో తనకు ఎదురైన ేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వైరాగ్యంతో రాయపాటి ఈ ప్రకటన చేసి ఉంటారని కొందరు చెబుతున్నారు. ముఖ్యంగా అప్పటి ఎన్నికల్లో సిటింగ్ ఎంపీగా పోటీ చేసేందుకు ఆయన పడిన కష్టం అంతా ఇంతా కాదు. అప్పట్లో ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, దగ్గుబాటి పురందేశ్వరి తదితరులు ఈ సీటు కోసం పోటీ పడ్డారు. అలాగే ఆయన వ్యతిరేక వర్గం సైతం టికెట్ రాకుండా తీవ్ర ప్రయత్నాలు చేసింది.
కేంద్రమంత్రి పదవికోసం ఎంతగా పోటీ పడతారో అంతలా ఎంపీ టికెట్ కోసం ఆయన పోరాటం చేయాల్సి వచ్చింది. చివరకు టికెట్ పొంది ఎంపీగా గెలుపొందారు. ఆ తరువాత కేంద్ర మంత్రి పదవి కోసం, టీటీడీ బోర్డు చైర్మన్ పదవి కోసం ప్రయత్నాలు చేశారు. అవేమీ రాకపోవడంతో తన సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తెరపైకి వచ్చిన రాష్ట్ర విభజనను ఆసరాగా కాంగ్రెస్‌ను దుమ్మెత్తిపోశారు.
వ్యూహమా... తాజాగా మంత్రి కన్నాకు ఎంపీ సీటు ఇస్తే తాను మద్దతు పలుకుతానని ప్రకటించడం ద్వారా ఆయన కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని పరోక్షంగా చెప్పినట్టుగా భావిస్తున్నారు. మంత్రి కన్నా లక్ష్మీనారాయణ సైతం ఒకదశలో ఎంపీగా పోటీ చేయాలన్న తలంపుతో ఉన్నది వాస్తవమే అయినప్పటికీ ఆయన పశ్చిమ నియోజకవర్గం వదిలి ఎంపీగా పోటీ చేస్తారా అన్నది అనుమానమే. మంగళగిరి, సత్తెనపల్లి, తాడికొండ, తెనాలితో పాటు నగరంలో ఎంపీ రాయపాటికి ప్రత్యేక క్యాడర్ ఉంది. ఈ క్యాడర్ సహాయంతో తన శత్రువైన కన్నాకు ప్రతికూల ఫలితాలు వచ్చే విధ ంగా చేయాలనే వ్యూహం ఆయనలో లేకపోలేదని మరి కొందరు చెబుతున్నారు.