రాయలసీమ రాష్ట్రాన్ని ప్రకటించాల్సిందే: బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి | Rayalaseema should be declared as Captial of Andhra Pradesh | Sakshi
Sakshi News home page

రాయలసీమ రాష్ట్రాన్ని ప్రకటించాల్సిందే: బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి

Feb 25 2014 3:05 AM | Updated on Sep 2 2017 4:03 AM

రాయలసీమ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసి కర్నూలును రాజధానిగా ప్రకటించాలని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు.

కర్నూలు(సిటీ), న్యూస్‌లైన్:  రాయలసీమ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసి కర్నూలును రాజధానిగా ప్రకటించాలని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బెరైడ్డి రాజశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రత్యేక రాయలసీమ డిమాండ్‌తో బెరైడ్డి చేపట్టిన రెండు రోజుల నిరాహార దీక్ష సోమవారం ప్రారంభమైంది. స్థానిక జిల్లా పరిషత్ గాంధీ విగ్రహం ఎదుట జరిగిన దీక్షలో ఆయన మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధానిగా మూడేళ్లపాటు కొనసాగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైందని, దీంతో రాజధాని కర్నూలును కాదని హైదరాబాద్‌కు తరలిపోయిందన్నారు. ప్రస్తుతం సమైక్యంగా ఉన్న రాష్ట్రాన్ని విభజించి రాయలసీమకు తీవ్ర అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. ఇందుకు కారణమైన కాంగ్రెస్‌తోపాటు సహకరించిన టీడీపీ, బీజేపీలను తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
 
  వెనుకబాటుతో ఉన్న రాయలసీమ బాగు పడాలంటే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి ఈ ప్రాంత ప్రజాప్రతి నిధులు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయడం ద్వారా ఒత్తిడి తేవాలని సూచించారు. అంతకుముందు గౌరీ గోపాల్  ఆసుపత్రి ఎదురుగా ఉన్న శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి ఆయన పూలమాల వేశారు. అక్కడి నుంచి రాజ్‌విహార్, జిల్లా పరిషత్తు గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. రాయలసీమ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి మహబూబ్ సాహెబ్, సమితి నాయకులు శ్రీరాములు, రామచంద్రారెడ్డి, త్యాగరాజు, కొండయ్య, సురేంద్రారెడ్డితోపాటు సివి.రామన్, కేవిఆర్, పుల్లయ్య, రవీంద్ర కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి యువజన సంఘాలు, ఇరిగేషన్ ఉద్యోగుల సంఘం నాయకులు బెరైడ్డిని కలిసి సంఘీభావం ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement